సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదు: మోడీ

సింగరేణిని ప్రైవేటీకరణ చేసే అధికారం కేంద్రానికి లేదు: మోడీ

సింగరేణిని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఆ అధికారం కేంద్రానికి లేదని చెప్పారు. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51 శాతం ఉండగా..కేంద్రానికి 49 శాతం వాటా ఉందన్నారు. సింగరేణి బొగ్గు గనులపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే పుకార్లను నమ్మవద్దని మోడీ సూచించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేటు పరం చేస్తుందని కొందరు హైదరాబాద్ నుంచి ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సింగరేణిలో గతంలో అనేక స్కాంలు జరిగాయని ఆరోపించారు. 

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం వల్ల రైతులకు ఎరువుల కొరత తీరిందని  ప్రధాని మోడీ అన్నారు. గతంలో ఎరువుల కోసం విదేశాలపై ఆధారపడేవాళ్లమని చెప్పారు. కానీ ప్రస్తుతం దేశంలో గోరఖ్ పూర్ , రామగుండంతో పాటు..మరో 5 ప్రాంతాల్లో ఎరువుల ఉత్పత్తి జరుగుతోందన్నారు.  దీని వల్ల భారతే ప్రపంచ దేశాలకు ఎరువులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. దేశంలో ఫర్టిలైజర్ సెక్టార్ను ఎంతో అభివృద్ధి చేశామన్నారు. గతంలో యూరియా కోసం రైతులు అర్థరాత్రి వరకు క్యూలైన్లలో నిల్చునేవారని..యూరియా కోసం రైతులు లాఠీ దెబ్బలు కూడా తిన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో వ్యవసాయానికి సరిపడా యూరియా ఉత్పత్తి అవుతోందన్నారు. దేశంలో యూరియా బ్లాక్ మార్కెట్ను అరికట్టామన్నారు. ప్రపంచ దేశాల్లో ఎరువుల రేట్లు పెరిగినా.. భారత్లో మాత్రం ఎరువుల రేట్లను పెంచలేదన్నారు. పైగా ఎరువుల రేట్లను తగ్గించామన్నారు. గతంలో నకిలీ ఎరువుల వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని..వాటన్నింటిని రద్దు చేశామన్నారు. ప్రస్తుతం దేశంలో భారత్ బ్రాండ్ ఎరువులు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. 

బీజేపీ ప్రభుత్వం వచ్చాక..దేశంలో అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోడీ తెలిపారు. 24 గంటల పాటు..దేశాభివృద్ధి కోసమే పరితపిస్తున్నామన్నారు. కరోనా ప్రపంచ దేశాలను ఎంతో ఇబ్బంది పెట్టిందని..దీని వల్ల దేశం కూడా తీవ్ర ఇబ్బందులకు గురైందన్నారు. ఈ కష్టకాలంలోనూ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అవతరించిందన్నారు. ఎనిమిదేండ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని..దీనికి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీయే నిదర్శమని చెప్పారు. రైతులకు ఇప్పటి వరకు 10 లక్షల కోట్లు ఖర్చుచేశామని మోడీ వెల్లడించారు. రాబోయే రెండున్నరేండ్లలో మరో రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. 

తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలను కలిపే రైల్వే లైన్ను ప్రారంభించామని ప్రధాని మోడీ తెలిపారు. వీటితో పాటు..జాతీయ రహదారులను ప్రారంభించామని చెప్పారు. రైల్వే లైన్లు, జాతీయ రహదారుల ప్రారంభం వల్ల రాష్ట్రంలో ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. తెలంగాణలో ఇవాళ  రూ. 10 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. తెలంగాణ డెవలప్ మెంట్ కోసం బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మోడీ చెప్పారు.