మీ బ్లాక్ పేపర్ మా​కు దిష్టిచుక్క: ప్రధాని మోదీ

మీ బ్లాక్ పేపర్ మా​కు దిష్టిచుక్క: ప్రధాని మోదీ
  • కాంగ్రెస్​పై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్​
  • బ్లాక్ షర్ట్స్ వేసుకుని ఫ్యాషన్ షో చేశారని ఎద్దేవా
  • ప్రతిపక్షాల చర్యలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్య
  • ఉభయ సభల్లో ‘వైట్ పేపర్’ వర్సెస్ ‘బ్లాక్ పేపర్’
  • శ్వేత పత్రం రిలీజ్ చేసిన బీజేపీకి కౌంటర్​గా కాంగ్రెస్ బ్లాక్ పేపర్

న్యూఢిల్లీ: పదేండ్ల ఎన్డీయే పాలనా వైఫల్యాలపై రాజ్యసభలో  కాంగ్రెస్ బ్లాక్ పేపర్ విడుదల చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. పదవీ కాలం ముగియనున్న పలువురు ఎంపీలకు వీడ్కోలు పలికేందుకు మోదీ గురువారం రాజ్యసభకు హాజరయ్యారు. ఖర్గే ‘బ్లాక్ పేపర్’ రిలీజ్ చేసిన తర్వాత మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలకు చురకలంటించారు. ‘‘ఖర్గే జీ రిలీజ్ చేసిన బ్లాక్ పేపర్ మా ప్రభుత్వానికి ‘దిష్టి చుక్క’ లాంటిది. మాపై ఎవరి కన్నూ పడకుండా చేస్తుంది. ఏదైనా పండుగ వచ్చినప్పుడు చిన్న పిల్లాడికి కొత్త బట్టలు వేస్తే దిష్టి తగలకుండా పెద్దోళ్లు దిష్టి చుక్క పెడ్తరు. అలాగే.. మా పదేండ్ల ప్రభుత్వంపై ఎవరి కన్ను పడకుండా మేము సేఫ్​గా ఉండేందుకు కాంగ్రెస్ దిష్టి చుక్క పెట్టింది. ప్రతిపక్షాల ఈ చర్యను మేము స్వాగతిస్తున్నా. ఖర్గేకు  ధన్యవాదాలు చెప్తున్నా’’అని మోదీ వ్యంగంగా స్పందించారు. అపోజిషన్ పార్టీ ఎంపీలంతా బ్లాక్ షర్ట్స్ వేసుకుని ఫ్యాషన్ షో చేశారని ఎద్దేవా చేశారు. కాగా, 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన విజయాలను వివరిస్తూ లోక్ సభలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘వైట్ పేపర్’ రిలీజ్ చేశారు. దీనికి కౌంటర్​గా ఖర్గే రాజ్యసభలో ‘బ్లాక్ పేపర్’ విడుదల చేశారు. దీంతో ఉభయ సభల్లో ‘వైట్ పేపర్’ వర్సెస్ ‘బ్లాక్ పేపర్’ వార్ నడిచింది. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌‌ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్‌‌ పార్లమెంట్​లో ‘వైట్ పేపర్’ సమర్పిస్తామని ప్రకటించారు. 

యూపీఏ హయాంలో బలహీన నాయకత్వం.. 

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆయన వీల్ చైర్​లో ఉన్నప్పటికీ పని చేశారన్నారు. ‘‘కీలక చట్టంపై ఓటేసేందుకు వీల్ చైర్‌‌లో మన్మోహన్ సింగ్ పార్లమెంట్​కు వచ్చారు. బిల్లు ఆమోదం పొందుతుందని తెలిసినా.. ఆయన వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది ఎప్పటికీ  మరిచిపోలేను. సభ్యులు తమ విధుల పట్ల ఎంత నిబద్ధతతో ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. మన దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి. మన్మోహన్ అందించిన సహకారం, దేశాన్ని నడిపించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’అని మోదీ ప్రశంసించారు. తర్వాత వైట్​పేపర్​ను ఉద్దేశిస్తూ మన్మోహన్​ సింగ్ పై మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు. ‘‘యూపీఏ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థను బాగా బలహీనం చేసింది. దీనికి ప్రధానమైన కారణం బలహీనమైన నాయకత్వం ఉండటమే. యూపీఏ పాలనలో సైనికులు చాలా ఇబ్బందులు పడ్డారు. వారికి సరిపడా ఆయుధాలు సమకూర్చలేదు’’ అంటూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ప్రస్తావించకుండా మోదీ విమర్శించారు. కాగా, ప్రగతి మైదాన్​లోని భారత్ మండపంలో నిర్వహించిన శ్రీల ప్రభుపాద 150వ జయంతిలో మోదీ పాల్గొన్నారు. ప్రభుపాద  సేవలను కొనియాడారు.

యూపీఏ హయాంలో ఎకానమీ నాశనం

గత యూపీఏ ప్రభుత్వం పదేండ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ  నాశనం అయిందని కేంద్ర ప్రభుత్వం విమర్శించింది. చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గాడినపెట్టామని తెలిపింది. సవాళ్లను అధిగమించి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ గురువారం పార్లమెంట్ లో వైట్ పేపర్ విడుదల చేసింది. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో, 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్డీయే హయాంలో ఎకానమీ ఎలా ఉందనేది అందులో వివరించింది. 

మొత్తం 59 పేజీలతో కూడిన వైట్ పేపర్ ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. 2004 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని, ఆ తర్వాత వచ్చిన యూపీఏ సర్కార్ దేశ ఆర్థిక వ్యవస్థను  నాశనం చేసిందని వైట్ పేపర్ లో కేంద్ర సర్కారు పేర్కొంది. ‘‘2004లో యూపీఏ ప్రభుత్వం పగ్గాలు చేపట్టే నాటికి దేశ ఆర్థిక వృద్ధి 8 శాతంగా ఉంది. కానీ ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. అంతకుముందు ఉన్న ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో యూపీఏ సర్కార్ విఫలమైంది. ఆర్థిక క్రమశిక్షణను పాటించలేదు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడింది. భారీగా అప్పులు తెచ్చి, వాటిని సరైన రీతిలో ఖర్చు చేయలేదు. దేశంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ను విస్మరించింది” అని వైట్ పేపర్ లో కేంద్ర ప్రభుత్వం మండిపడింది.