బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రధాని మోదీనే : రేవంత్

బీఆర్ఎస్ అధిష్ఠానం ప్రధాని మోదీనే : రేవంత్
  • కేసీఆర్‌‌‌‌కు నీళ్లనగానే కవిత కన్నీళ్లే గుర్తొస్తయ్
  • నియామకాలనగానే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తది
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు రాష్ట్రానికి మోదీ వస్తున్నారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌సభ ఎన్నికలపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరిందని పీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని స్వయంగా ఒక బీఆర్ఎస్ ఎంపీనే తనతో చెప్పారని తెలిపారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్‌‌తో పాటు ఎంఐఎం మధ్య కూడా సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీకి ఇప్పుడున్న 4 స్థానాలతో పాటు మరో 3 స్థానాలు మహబూబ్‌‌నగర్, మల్కాజిగిరి, చేవెళ్లలో కలిసి పోటీ చేసేందుకు బీఆర్‌‌‌‌ఎస్‌‌తో పొత్తు కుదిరింది. మొత్తంగా బీఆర్ఎస్ 9, బీజేపీ 7, ఎంఐఎం ఒక స్థానంలో కలిసి పోటీ చేస్తాయి” అని చెప్పారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ మాణిక్ రావ్​ఠాక్రేతో కలిసి మీడియాతో మాట్లాడారు. తర్వాత మీడియాతో చిట్‌‌చాట్‌‌ చేశారు. ‘‘బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని నిజామాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారు. బీఆర్ఎస్ అధిష్టానం మోదీనేనని ఇందూరు సభతో తేలిపోయింది. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిష్తేదార్ సమితి అని రాహుల్ గాంధీ ముందు నుంచీ చెప్తూనే ఉన్నారు. కొడుకును సీఎం చేయడంతో పాటు తన కూతురు కవితను లిక్కర్ స్కామ్‌‌ నుంచి బయటపడేసే విషయాన్ని మోదీతో కేసీఆర్​ మాట్లాడారు. ఆ విషయాన్నీ మోదీ బయటపెడితే బాగుండేది” అని అన్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్ని సర్వేల్లో తేలిందని రేవంత్ అన్నారు. అందుకే బీఆర్ఎస్‌‌ను గెలిపించేలా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ప్రధాని మోదీ వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. ఈ పదేండ్లలో ఒక్క విభజన హామీనీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ హేళన చేశారని, డోర్లు మూసి తల్లిని చంపి బిడ్డను తీశారంటూ మాట్లాడారని విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ రిక్వెస్ట్ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకీ వాటాలు వెళ్తున్నాయి. అందుకే కేసీఆర్​పై చర్యలు తీసుకోవడం లేదు. అన్ని రాష్ట్రాల్లోని నేతలపై ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నా.. సీఎం కేసీఆర్, ఆయన ఫ్యామిలీపై ఎందుకు జరగడం లేదు?” అని ప్రశ్నించారు.

కేసీఆర్‌‌‌‌కు గుర్తొచ్చేది అవే

సీఎం కేసీఆర్‌‌‌‌కు నీళ్లు అనగానే కవిత కన్నీళ్లు గుర్తుకొస్తాయని, నిధులనగానే కాళేశ్వరంలో దోపిడీ గుర్తుకొస్తుందని, నియామకాలనగానే తన కొడుకును సీఎం చేయాలన్నది గుర్తుకొస్తుందని రేవంత్ ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ముతోనే ప్రధానికి ఆయన దర్బారులో సన్మానం చేశారు. ఇదంతా ఒకవైపే. ఎన్నికల కోసం కొన్ని వేల కోట్లను కేసీఆర్ పంపించారు. దాని సంగతేంటి?” అని నిలదీశారు. బీఆర్ఎస్ దోపిడీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ రెండు పార్టీల బండారం బయటపడిందనే ఇప్పుడు కాంగ్రెస్​పై విమర్శలు చేస్తున్నాయన్నారు. బీజేపీకి మద్దతిస్తున్న బీఆర్ఎస్‌‌కు ఎంఐఎం ఎలా సపోర్ట్​ ఇస్తుందని ప్రశ్నించారు. ఎంఐఎం దోస్తీ ఎవరితోనో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్ఎస్​తోనా? బీజేపీ, బీఆర్​ఎస్​ను ఓడించాలంటున్న కాంగ్రెస్​తోనా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

వాళ్లు జైలుకెళ్లే టైం వచ్చింది

కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందే తానని రేవంత్ తెలిపారు. ‘‘పదేండ్లలో నేను చేసిన అభివృద్ధి.. ఐదేండ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధం. ప్రజల దృష్టిని మళ్లించేందుకే నాపై హరీశ్ రావు ఆరోపణలు చేస్తున్నారు. కోస్గి, కొడంగల్, మద్దూరులో నేను ఆస్పత్రులను తీసుకొస్తే.. ఇప్పటికీ రాష్ట్ర సర్కారు వాటిని పూర్తి చేయలేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను 5 ఎకరాలు కొని కొడంగల్ బస్ డిపో కోసం దానంగా ఇచ్చాను” అని చెప్పుకొచ్చారు. కొడంగల్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు బిల్లా రంగాలు కొడంగల్ రావాలని హరీశ్, కేటీఆర్​లకు సవాల్ చేశారు. ఈ సమావేశంలో నేతలు పొన్నం ప్రభాకర్, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.