కచ్చతీవు ద్వీపాన్ని నిర్మొహమాటంగా శ్రీలంకకు అప్పగించింది : మోదీ

కచ్చతీవు ద్వీపాన్ని నిర్మొహమాటంగా శ్రీలంకకు అప్పగించింది : మోదీ
  • కాంగ్రెస్​ను ఎప్పటికీ నమ్మలేం: మోదీ

న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మొహమాటంగా శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఈ వాస్తవం ఇటీవల బయటకొచ్చిందని, కాంగ్రెస్​పై ప్రజలు కోపంగా ఉన్నారని, ఇక ఆ పార్టీని ప్రజలు ఎప్పటికీ విశ్వసించలేరని ‘ఎక్స్​​’ వేదికగా మండిపడ్డారు.  పాక్​ జలసంధిలోని భూభాగాన్ని పొరుగుదేశానికి అప్పగించాలని 1974లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి ఆర్టీఐ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించిన నివేదికను మోదీ ఉటంకించారు.

‘75 ఏండ్లుగా దేశ ఐక్యత, సమగ్రత, ప్రయోజనాలను బలహీనపరిచేలా కాంగ్రెస్​ పనిచేస్తున్నది’ అని దుయ్యబట్టారు. ఈ నివేదికపై విదేశాంగ మంత్రి జైశంకర్​ కూడా స్పందించారు. ప్రతి భారతీయుడు గతంలో జరిగిన వాస్తవాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ.. నాటి కాంగ్రెస్​ సర్కారు నిర్ణయంతో తమిళనాడు తీరానికి కేవలం 25 కి.మీ. దూరంలోని కచ్చతీవు ద్వీపానికి చేపల వేటకు వెళ్లిన భారత మత్స్యకారులు శ్రీలంక బందీలుగా మారారని తెలిపారు.

ఈ ద్వీపం 1975 వరకు భారత్​ పరిధిలోనే ఉండేదాని,  తమిళనాడు మత్స్యకారులు అక్కడికి చేపల వేటకు వెళ్లేవారని అన్నారు. కానీ ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ సర్కారు శ్రీలంకతో చేసుకున్న ఒప్పందం తర్వాత ఈ ప్రాంతంలో చేపల వేటపై నిషేధం అమల్లోకి వచ్చిందన్నారు. ఈ అంశాన్ని దురదృష్టవశాత్తూ డీఎంకేగానీ, కాంగ్రెస్​ గానీ లేవనెత్తతడం లేదని, దేశ ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు మోదీ ఒక్కరే నిబద్ధతతో కృషి చేస్తున్నారని తెలిపారు.