అంబేడ్కర్ సేవల్ని ఎలా మర్చిపోతాం?

అంబేడ్కర్ సేవల్ని ఎలా మర్చిపోతాం?

న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి అందించిన సేవల్ని మర్చిపోలేమని ప్రధాన మోడీ అన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధిని పూర్తి బాధ్యతతో నిర్వర్తించాలని నెలవారీ కార్యక్రమం మన్ కీ బాత్ లో మోడీ పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో పోరాడిన సైనిక దళాలు, ప్రాణాలు విడిచిన అమర జవాన్ల త్యాగాలను మోడీ గుర్తు చేసుకున్నారు. 

‘డిసెంబర్ 16న 1971 యుద్ధానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. గోల్డెన్ జూబ్లీ సంవత్సరంగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఆ వార్ లో సైనిక బలగాలు, ధీర జవాన్లను మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా, ఈ వీర సైనికులకు జన్మనిచ్చిన తల్లులకు నా వందనాలు’ అని మోడీ అన్నారు. అంబేడ్కర్ తన జీవితాన్ని దేశం, సమాజం కోసం అంకితం చేశారన్నారు. ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ తన జీవితాన్ని దేశానికి, సమాజానికి సేవలందించేందుకు అంకితం చేశారు. మన రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తమ విధులను నిర్వర్తించాలి. అమృత్ మహోత్సవ్ సందర్భంగా మనం మన విధులను పూర్తి బాధ్యతతో నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఇదే అంబేడ్కర్ కు మనమిచ్చే ఘనమైన నివాళి’ అని మోడీ చెప్పారు.