ఏపీ తీరం అభివృద్ధితో ఉరకలు వేస్తుంది: మోడీ

ఏపీ తీరం అభివృద్ధితో ఉరకలు వేస్తుంది: మోడీ

విశాఖపట్నం భారతదేశం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రైల్వేలు, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో దూసుకుపోతున్నామని చెప్పారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, పోర్టు వరకు ఆరులైన్ల రోడ్లు వేస్తున్నామన్నారు. విశాఖ చేపల రేవు ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ తీరం అభివృద్ధితో ఉరకలు వేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ10 వేల కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామని..దీంతో  ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు.  ఏపీ వాసులు స్నేహపూర్వకంగా ఉంటారని..టెక్నికల్, మెడికల్ రంగం ఏదైనా తమ ప్రత్యేకతను కనబరుస్తున్నారని ప్రశంసించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు తనను ఎప్పుడు కలిసినా ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడేవారని గుర్తు చేశారు. 

మౌలిక వసతుల కల్పనలో తామెప్పుడూ వెనక్కి తగ్గలేదని ప్రధాని మోడీ అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి అన్ని రంగాల పురోగతిని వేగవంతం చేస్తోందన్నారు. ఒకవైపు విశాఖ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే మరోవైపు ఫిషింగ్‌ హార్బర్‌ను ఆధునీకరిస్తున్నామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనతోనే ఏపీ తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశమే అందరికీ ఆశావహ దృక్పథం ఇస్తోందని చెప్పారు. 

ఒక వైపు తాము చేసిన అభివద్ధితో దేశంలో పెట్టబడులు పెరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. మరోవైపు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నామన్నారు. రైతులకు ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి అవకాశాన్ని వెతికి పట్టుకుంటామన్నారు. కొద్ది రోజుల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మదిన వేడుకలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.