చత్తీస్​గఢ్​లో 30% కమీషన్ సర్కార్ : ప్రధాని మోదీ

చత్తీస్​గఢ్​లో 30%  కమీషన్ సర్కార్ : ప్రధాని మోదీ
  • దోచుకోవడానికి ‘మహాదేవ్’ పేరునూ కాంగ్రెస్ వదిలిపెట్టలేదు: మోదీ 
  •     బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో సీఎంకు లింకేంటి? అని ప్రశ్న
  •     ఫ్రీ రేషన్ స్కీమ్​ మరో ఐదేండ్లు పొడిగిస్తామని ప్రధాని ప్రకటన 

దుర్గ్: చత్తీస్​గఢ్ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటున్నదని ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రతి పనిలోనూ 30% కమీషన్ తీసుకుంటోందని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో కాంగ్రెస్ నేతలు తమ ఖజానా నింపుకుంటున్నారని ఫైర్ అయ్యారు. శనివారం చత్తీస్​గఢ్​లోని దుర్గ్ సిటీలో మోదీ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్​పై విమర్శలు గుప్పించారు. ‘‘రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికి దొరికిన ఏ ఒక్క అవకాశాన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వదులుకోలేదు. చివరకు ‘మహాదేవ్’ పేరును కూడా విడిచిపెట్టలేదు. రెండ్రోజుల కిందనే మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్​లో సీఎం బాఘెల్ పేరు బయటకొచ్చింది. 

నిందితులతో తమకున్న సంబంధమేంటో సీఎం బయటపెట్టాలి” అని డిమాండ్ చేశారు. ‘‘రాయ్ పూర్​లో ఈడీ పెద్ద ఎత్తున డబ్బు పట్టుకుంది. అదంతా బెట్టింగ్ డబ్బేనని తేలింది” అని చెప్పారు. ‘‘కొన్ని పార్టీలు ప్రజలను విడదీయాలని కుట్రలు చేస్తున్నాయి. కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. నేనొక ఓబీసీని అని కాంగ్రెస్ అవమానించింది. మొత్తం ఓబీసీ కమ్యూనిటీని అవహేళన చేసింది” అని ఫైర్ అయ్యారు. తన దృష్టిలో దేశంలోనే అతిపెద్ద కులం పేదలని, తాను వాళ్లకు సేవకుడినని మోదీ పేర్కొన్నారు. 

కాగా, చత్తీస్ గఢ్ కు చెందిన ఆకాంక్ష అనే బాలికకు మోదీ థ్యాంక్స్ చెప్పారు. గురువారం కాంకేర్​లో ప్రధాని ర్యాలీకి హాజరైన ఆకాంక్ష.. ఆయన స్కెచ్ ఫొటోను తీసుకొచ్చింది. ర్యాలీలో అది చూసిన మోదీ.. శుక్రవారం ఆమెకు లేఖ రాశారు.