అయోధ్య: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి ఆలయ శిఖరంపై భగవా(కాషాయ) జెండాను ఎగురవేయనున్నారు. ఆలయ నిర్మాణం పూర్తయిన దానికి సంకేతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పది అడుగుల ఎత్తు, ఇరవై అడుగుల పొడవు ఉన్న ఈ త్రిభుజాకార భగవా జెండా మీద సూర్యుడు, ఓం, కోవిదార వృక్షం చిత్రాలు ఉంటాయి. ఇది రాముడి తేజస్సు, వీరత్వాన్ని సూచిస్తుంది. గౌరవం, ఐక్యత, సాంస్కృతిక కొనసాగింపును ఈ జెండా తెలియజేస్తుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. మోదీ సప్తమందిర్, శేషావతార్ మందిర్, అన్నపూర్ణ మందిర్‌లను దర్శించుకుంటారు.
రామ్ లల్లా గర్భగుడిలో పూజ చేస్తారు. మధ్యాహ్నం శిఖరంపై జెండా ఎగురవేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మార్గశిర మాసం శుక్లపక్షం పంచమి తిథి నవంబర్ 24 సాయంత్రం 9:22 గంటలకు మొదలై, నవంబర్ 25 రాత్రి 10:56 గంటల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో 25 తేదీన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ రోజును వివాహ పంచమి కూడా అంటారు. అంటే శ్రీరాముడు, సీతమ్మల వివాహ దినం. అలాగే ఇది సిక్కు మతగురు తేజ్ బహదూర్ షహీదీ దినం కూడా. ఇదే రోజున ప్రధాని
అయోధ్య నగరంలో పర్యటించనున్నారు.
