నిజామాబాద్​లో ప్రధాని మోదీ పర్యటనతో కమలంలో ఫుల్ ​జోష్​

నిజామాబాద్​లో ప్రధాని మోదీ పర్యటనతో కమలంలో ఫుల్ ​జోష్​
  •      మోదీ పర్యటనతో మారిన బీజేపీ ప్రచార శైలి
  •      పసుపు బోర్డు, గల్ఫ్​ కష్టాలు, చక్కెర ఫ్యాక్టరీలే అస్త్రాలుగా ముందుకెళ్తున్న లీడర్లు 

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్​లో ప్రధాని మోదీ పర్యటనతో జిల్లా బీజేపీలో ఫుల్​జోష్ వచ్చింది. పసుపు బోర్డు, గల్ఫ్​ కష్టాలు, చక్కెర ఫ్యాక్టరీలే అస్త్రాలుగా లీడర్లు ప్రజల్లోకి వెళ్తున్నారు. గెలుపునకు పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఇన్నాళ్లూ బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలపై ఆరోపణలు, విమర్శలకే పరిమితమైన ‘కమలం’ నేతల్లో మోదీ హామీలు ఉత్సాహాన్ని నింపాయి. 

బలం.. బాణాలు ఇవే.. 

  • నిజామాబాద్ పార్లమెంట్​నియోజకవర్గం పరిధిలోని ఆర్మూర్, బాల్కొండ, రూరల్, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో సుమారు 40 వేల ఎకరాల్లో పసుపు సాగు అవుతోంది. పాలమూరు వేదికగా ప్రధాని మోదీ పసుపు బోర్డు ప్రకటించడం, కేంద్ర క్యాబినెట్​ కూడా బుధవారం దీనిని ఆమోదించడంతో  రైతుల్లో నమ్మకం పెరిగింది. ఎన్నో ఏండ్ల కల నెరవేరుతున్నందున సంతోషంలో ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ లీడర్లు పసుపు సాగయ్యే ప్రాంతాల్లో పసుపు బోర్డు మీదే ప్రచారాన్ని నిర్వహించనున్నారు.  ముఖ్య నేతలకు పూల దండల స్థానంలో పసుపు కొమ్మల దండలు, బొకేగా పసుపు ఆకు, వేడుకలప్పుడు పసుపు రంగు చల్లుకునేలా ప్లాన్​ చేస్తున్నారు. 
  • ఉమ్మడి నిజామాబాద్​, కరీంనగర్​ జిల్లాల యువకులు చాలాకాలంగా ఉపాధి కోసం గల్ఫ్​ వెళ్తున్నారు. ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనుంది. ఏజెంట్ల చేతిలో మోసపోకుండా గల్ఫ్​ వెళ్లేవారికి వీసా మొదలుకొని రవాణా ఖర్చులు, ఏదైనా కారణంతో వారు మృతి చెందితే గవర్నమెంట్​ఖర్చుతో డెడ్​బాడీలను తీసుకువచ్చే హామీ ఇవ్వనున్నారు. ఈ అంశం కూడా పార్టీకి మంచి మైలేజీ తెస్తుందనే ఆశతో లీడర్లు ఉన్నారు. 
  • 2015లో బోధన్​, మెట్​పల్లిలో నిజాం షుగర్​ ఫ్యాక్టరీలు, అంతకు ఐదేండ్ల ముందు రూరల్​ నియోజకవర్గం పరిధిలో సారంగాపూర్​ కో-ఆపరేటివ్​ చక్కెర మిల్లు మూతబడ్డాయి. వీటిని పునరుద్ధరించాలనే డిమాండు కార్మికులు, చెరకు రైతుల నుంచి ఉంది. లోక్​సభ ఎలక్షన్​కు ముందు ఫ్యాక్టరీలు తెరువాలని అర్వింద్ మెట్​పల్లి నుంచి బోధన్​దాకా పాదయాత్ర చేశారు. పసుపు బోర్డు సాధించిన ధీమాతో ఇక చక్కెర ఫ్యాక్టరీల సంగతి తేలుస్తానని ఎంపీ అర్వింద్​ మంగళవారం ప్రకటించారు. పసుపు బోర్డు హామీ నిలబెట్టుకున్న ఎంపీ అర్వింద్​ క్రేజ్​ జిల్లాలో మరింత పెరిగింది. ఇవే బీజేపీ లీడర్లకు ప్రచారాస్త్రాలు, ప్రధాన బలంగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.