సూరత్: ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణకు కృషి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇందుకోసం రెడ్యూస్, రీయూజ్, రీచార్జ్, రీసైకిల్ మంత్రాన్ని పాటించాలని సూచించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంచినీటి వనరుల్లో కేవలం 4 శాతమే ఇండియాలో ఉన్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో నీటి సంక్షోభం నెలకొంది. అందుకే అందరూ నీటి సంరక్షణకు నడుం బిగించాలి. ఇందుకోసం కొత్త టెక్నాలజీని, టెక్నిక్స్ ను వినియోగించుకోవాలి” అని చెప్పారు. గుజరాత్‌లోని సూరత్‌లో చేపట్టిన ‘జల్ సంచయ్ జన్ భాగీదారి’ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించి మాట్లాడారు.
మన దేశంలో 80 శాతం నీటిని వ్యవసాయానికే వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. డ్రిప్ ఇరిగేషన్ లాంటి పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘‘పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మనకు కొత్తేం కాదు. అది మన సంస్కృతిలోనే ఉంది. మనం నీళ్లను మొక్కుతం. నదులను దేవతలుగా కొలుస్తాం. నర్మద, గంగా, గోదావరి, కావేరీ నదులు మనకు తల్లులు” అని పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం..
నీటి సంరక్షణకు పాలసీలు తీసుకొస్తే సరిపోదని, ప్రజల భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ‘‘నీటి సంరక్షణ, నదుల పునరుద్ధరణ పేరుతో గతంలో స్కీమ్స్ తీసుకొచ్చి వేలాది కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్పుడు వచ్చిన ఫలితాలు శూన్యం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఫలితాలు కనిపిస్తున్నాయి. నీటి సంరక్షణకు పదేండ్లలో మేం ఎన్నో పథకాలు తీసుకొచ్చాం.
గతంలో గ్రామాల్లో 3 కోట్ల నల్లా కనెక్షన్లు మాత్రమే ఉండేవి. మేం వచ్చాక 15 కోట్లకు పెంచాం. జల్ జీవన్ మిషన్ లో భాగంగా హర్ ఘర్ జల్ స్కీమ్ తీసుకొచ్చి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చాం. జల్ జీవన్ మిషన్ కింద దేశంలోని 75% ఇండ్లకు నల్లా నీళ్లు అందుతున్నాయి. భూగర్భ జలాలను పెంచేందుకు ‘అటల్ భూజల్’ స్కీమ్, ‘క్యాచ్ ది రెయిన్’ క్యాంపెయిన్ ను ప్రారంభించాం” అని పేర్కొన్నారు.