కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్​ స్కామ్​ : ప్రధాని మోదీ

కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్​ స్కామ్​ : ప్రధాని మోదీ
  • కమీషన్ల కోసం ఢిల్లీ దాకా వచ్చిన్రు: ప్రధాని మోదీ
  • తెలంగాణ ప్రజల కలలను బీఆర్​ఎస్​ చిదిమేసిందని ఫైర్​
  • కాళేశ్వరం స్కామ్​ ఫైళ్లను కాంగ్రెస్ ​దాస్తున్నది
  • అవినీతిపరులను వదిలిపెట్టం.. ఇది మోదీ గ్యారంటీ
  • శక్తిని అంతం చేస్తామని ‘ఇండియా’ కూటమి అంటున్నది
  • శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్​ 4న తేలుతుంది
  • వికసిత్ తెలంగాణ, వికసిత్ భారత్ మా లక్ష్యం
  • జగిత్యాల ‘విజయ సంకల్ప సభ’లో ప్రసంగం

జగిత్యాల, వెలుగు : కాళేశ్వరం పేరిట తెలంగాణను బీఆర్ఎస్ ​నేతలు లూటీ చేశారని, అది సరిపోక ఢిల్లీ దాకా వచ్చి లిక్కర్​ స్కామ్​తో భారీగా కమీషన్లు కొట్టేశారని ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. రజాకార్లతో పోరాడిన తెలంగాణకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, సెంటిమెంట్​తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కలలను చిదిమేసిందని ఆయన అన్నారు.

తెలంగాణ పునర్నిర్మాణం పేరుతో పదేండ్లపాటు బీఆర్​ఎస్​ నేతలు దోచుకున్నరు. కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా  కుంభకోణాలే. అలాంటి వారసత్వ రాజకీయాలకు తెలంగాణ కూడా బలైంది” అని పేర్కొన్నారు. బీఆర్ఎస్​, కాంగ్రెస్​ నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని, పాత ప్రభుత్వం దోపిడీపై కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. లోక్​సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని గీతా విద్యాలయం గ్రౌండ్ లో సోమవారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభ లో ప్రధాని మోదీ మాట్లాడారు. 

కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నోరెత్తడం లేదని, ఫైళ్లను దాచిపెడ్తున్నదని మోదీ అన్నారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కలిసి మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని, భారత మాతకు జై అనే మాట వీరి నోటి నుంచి ఎప్పుడైనా విన్నారా అని అడిగారు.  ఒకరినొకరు ఎంత కాపాడుకునే ప్రయత్నం చేసినా తెలంగాణను దోచినోళ్లను, అవినీతిపరులను వదిలే ప్రసక్తిలేదని.. ఇది మోదీ గ్యారంటీ అని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలను బీఆర్​ఎస్​ దోచుకొని ఇక్కడి డబ్బును ఢిల్లీకి తరలించిందని ఆరోపించారు.  

అబ్ కీ బార్.. చార్ సౌ పార్..

ఆదిలాబాద్ నుంచే దేశవ్యాప్తంగా 56 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, తెలంగాణలోని నలుమూలలా బీజేపీకి మద్దతు పెరుగుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ. 6,400 కోట్లతో పునరుద్ధరించుకున్నామని తెలిపారు. పసుపు బోర్డుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పసుపు రేటు క్వింటాల్​కు రూ. 6 వేల నుంచి రూ. 20 వేలకు పైగా పెరిగిందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, గోమాస శ్రీనివాస్ తన తమ్ముళ్లని, ఈ ఎన్నికల్లో  తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.

ఎన్డీయేకు 400 సీట్లు దాటాలన్నారు. ‘అబ్ కీ బార్.. చార్ సౌ పార్’ అనే నినాదాన్ని ప్రజలతో ఆయన అనిపించారు. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ కుటుంబ పార్టీలని, రెండు పార్టీలు స్కాముల్లో చిక్కుకున్నాయని మండిపడ్డారు. వాటిని మే 13న తెలంగాణలో జరిగే ఎంపీ ఎన్నికల్లో దూరం పెట్టాలని, బీజేపీకి మద్దతివ్వాలని ఆయన అన్నారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతిస్తే తనకు మరింత శక్తి అందుతుందని, మీ ఓటు తో వచ్చే శక్తితో మరింత దేశాభివృద్ధికి దోహదపడే అవకాశం ఉంటుందని చెప్పారు. జూన్  4న లోక్ సభ ఎలక్షన్ రిజల్ట్ రాబోతుందని, వికసిత్ తెలంగాణ నుంచి వికసిత్ భారత్ తన లక్ష్యమని ఆయన అన్నారు. 

మీరే టీచర్లు.. నాకు తెలుగు నేర్పండి

తన ప్రసంగాలను టెక్నాలజీ ద్వారా తెలుగులో వినేందుకు అవకాశం ఉందని, ఇందు కోసం ఎక్స్ (ట్విట్టర్) లో ‘నమో ఇన్ తెలుగు’ను ఫాలో కావాలని ప్రధాని మోదీ కోరారు. అందులో ఏమైనా తప్పులు ఉంటే తనకు చెప్పాలని, ప్రజలే తనకు టీచర్లయ్యి తెలుగు నేర్పించాలన్నారు.  అందరి మొబైల్​ ఫోన్లలో ‘నమో ఇన్​ తెలుగు’ ఉండాలని..  ప్రతిపక్షాలెవరైనా అడిగితే ‘‘గడ్​బడ్ చేయకు.. మోదీ నా జేబులో ఉన్నాడని చెప్పండి..’’ అని ఆయన సూచించారు. 

రాహుల్ సవాల్ స్వీకరిస్తున్న

యావత్ భారతదేశం శక్తిని ఆరాధిస్తుండగా.. ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి మాత్రం శక్తిని వినాశనం చేయాలని చూస్తున్నదని మోదీ మండిపడ్డారు. ‘‘శక్తిని ఆరాధించే వాళ్లం కాబట్టే చంద్రయాన్ కాలుమోపిన ప్రాంతానికి శివశక్తి అని నామకరణం చేశాం. భారత మాతకు నేను పూజారిని. చంద్రయాన్ విజయాన్ని కూడా మహిళాశక్తికి అంకితం చేశాం. శక్తిని పూజించే వారికి మద్దతు ఇస్తారా.. లేక వినాశనాన్ని కోరుకునే ఇండియా కూటమికి మద్దతు ఇస్తారా’’ అని ఆయన అడిగారు. ‘‘శక్తిని అంతం చేస్తామని ముంబైలోని శివాజీ మైదానంలో రాహుల్​గాంధీ అన్నారు.

నేను ఆ సవాల్​ను స్వీకరిస్తున్నా. శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4న తెలుస్తుంది అని ప్రధాని మోదీ అన్నారు.  కాగా, కోరుట్ల వెంకటాపూర్ కు చెందిన చిన్నారి సహస్ర అమ్మవారి వేషధారణలో సభకు వచ్చి అభివందనం చేయడాన్ని గమనించిన ప్రధాని.. ‘‘ఆ  ఆడబిడ్డ శక్తి రూపంలో నన్ను ఆశీర్వదించడానికి వచ్చింది” అని ఆయన పేర్కొన్నారు. జగిత్యాలలో 7వ క్లాస్ చదువుతున్న రోహన్ తాను గీసిన మోదీ ఫొటోను సభలో ప్రదర్శించడం అందర్నీ ఆకట్టుకుంది. సభలో బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్​, బండి సంజయ్,  ధర్మపురి అర్వింద్  తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణ సమాజం మోదీకి అండగా నిలవాలి

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సమాజం ప్రధాని మోదీకి అండగా నిలవాలి. మోదీ నీతివంతమైన పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డరు. రాష్ట్రానికి సమ్మక్క-–సారలమ్మ పేరుతో జాతీయ ట్రైబల్​వర్సిటీ మంజూరు చేశారు. పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేసింది. మోదీ తెలుగు భాషపై మక్కువతో కష్టమైనా నేర్చుకుంటున్నరు. బీఆర్ఎస్ సర్కార్ వేల కోట్ల దోపిడీకి పాల్పడింది, అది చాలదన్నట్లు కేసీఆర్​కూతురు కవిత లిక్కర్ స్కామ్‌‌ చేసి తెలంగాణ తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది. కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలు పేరుతో  మాయమాటలు చెప్తున్నది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలె.

 కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్

బరాబర్​ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతాం

వీరులను కన్న గడ్డ జగిత్యాలను నిషేధిత పీఎఫ్ఐ లాంటి సంస్థకు అడ్డాగా మార్చారు. పీఎఫ్ఐ నాయకులు పాకిస్తాన్​కు జేకొడుతుంటే వాళ్లకు ఆర్థిక సాయం చేస్తున్న వారి చెవుల్లో నుంచి రక్తం కారేలా మనం నినదించాలె. రాముడి పేరు చెబితే కాంగ్రెస్, బీఆర్ఎస్​ వాళ్లు గజగజ వణుకుతున్నారు. దేశ ప్రజల భాగస్వామ్యంతో అయోధ్యలో రాముడి గుడిని బీజేపీయే కట్టింది. బరాబర్ శ్రీరాముడి పేరుతో ఎన్నికల్లో ఓట్లడుగుతం, మీకు దమ్ముంటే బాబర్ పేరుతో ఓట్ల అడగాలె.

బండి సంజయ్, కరీంనగర్ ఎంపీ