700 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసేలా.. ఐదేళ్లలో 500 గోడౌన్లు

700 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసేలా.. ఐదేళ్లలో 500 గోడౌన్లు
  • ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వల కార్యక్రమంప్రారంభించిన మోదీ
  • ఇందుకు రూ.1.25 లక్షల కోట్లు వెచ్చిస్తామని వెల్లడి
  • 11 రాష్ట్రాల్లో 11 గోడౌన్లు వర్చువల్ గా ఓపెన్ చేసిన ప్రధాని

న్యూఢిల్లీ/రాయ్ పూర్: సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 11 రాష్ట్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఏర్పాటు చేసిన 11 గోడౌన్లను శనివారం ఆయన ఢిల్లీలో వర్చువల్​ షురూ చేశారు. దేశవ్యాప్తంగా 500 కన్నా ఎక్కువ పీఏసీఎస్ లలో గోదాములు నిర్మించేందుకు, వ్యవసాయ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశంలో ధాన్యాన్ని నిల్వ చేసేందుకు సరైన సదుపాయాలు లేనందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే వచ్చే ఐదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల వ్యయంతో గిడ్డంగులు నిర్మించి రైతులు 700 లక్షల టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. రైతులు తమ ధాన్యాన్ని ఆ గిడ్డంగుల్లో నిల్వ చేసుకోవచ్చని, లాభదాయకమైన ధరలు వచ్చినపుడు ఆ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని పేర్కొన్నారు.

అలాగే వంటనూనెలు, పప్పుధాన్యాలు, ఎరువుల దిగుమతిని తగ్గించేందుకు కృషి చేయాలని సహకార సంస్థలకు మోదీ సూచించారు. సహకార సంఘాల ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ‘సహకారంతో సమృద్ధి’ విజన్ తో గత పదేండ్లలో సహకార రంగాల వృద్ధికి తమ ప్రభుత్వం శ్రమించిందని, ఇందుకోసం ప్రత్యేకంగా సహకార మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేశామని మోదీ చెప్పారు.

దేశవ్యాప్తంగా 10 వేల ఫార్మర్  ప్రొడ్యూసర్  ఆర్గనైజేషన్ (ఎఫ్​పీఓ) లను ఏర్పాటు చేశామని, దీంతో రైతులు తమ పంటలను ఎగుమతి చేసుకోగలుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా 18 వేల పీఏసీఎస్ ల కంప్యూటరైజేషన్  ప్రాజెక్టును కూడా ప్రధాని ప్రారంభించారు.

బంధుప్రీతి, అవినీతే కాంగ్రెస్​కు ముఖ్యం

బంధుప్రీతి, అవినీతే కాంగ్రెస్​కు ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశాన్ని అత్యధిక కాలం కాంగ్రెస్  పార్టీ పాలించిందని, కానీ, దేశాభివృద్ధిని పట్టించుకోలేదని ఆయన  మండిపడ్డారు. ‘వికసిత్  భారత్, వికసిత్ చత్తీస్ గఢ్’ కార్యక్రమంలో వర్చువల్​గా పాల్గొన్న మోదీ.. రూ.34,400 కోట్ల విలువైన పది అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వాలను ఎలా ఏర్పాటు చేయాలన్న దానిపైనే కాంగ్రెస్  దృష్టి పెట్టిందని, దేశాన్ని అభివృద్ధి చేయాలన్న అంశం కాంగ్రెస్  అజెండాలో ఎప్పటికీ లేదని ఆయన ఫైర్  అయ్యారు.

‘‘కాంగ్రెస్  పార్టీ నేతలకు వారి కొడుకులు, కూతుర్ల అభివృద్ధే ముఖ్యం. దేశ ప్రగతి గురించి వారు ఎప్పుడూ పట్టించుకోరు. కానీ, మోదీకి దేశమే కుటుంబం. ప్రజల కలలే మోదీ తీర్మానం. అందువల్లే వికసిత్ భారత్, వికసిత్  చత్తీస్‌‌ గఢ్  గురించి నేను మాట్లాడుతున్నాను” అని మోదీ వ్యాఖ్యానించారు.