బీఆర్​ఎస్​ పార్టీ.. ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలా తయారైంది:మోడీ

బీఆర్​ఎస్​ పార్టీ.. ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలా తయారైంది:మోడీ
  • సమ్మక్క, సారక్క పేరుతో ములుగులో ట్రైబల్​ వర్సిటీ
  • ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
  • రాష్ట్రంలో కరప్షన్​, కమీషన్​ సర్కార్​ నడుస్తున్నది
  • బీఆర్​ఎస్​ పార్టీ.. ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలా తయారైంది
  • ఫ్యామిలీ క్షేమం తప్ప ప్రజల సంక్షేమం ఆ పార్టీకి పట్టదు
  • ట్రైబల్​ వర్సిటీకి జాగ అడిగితే రాష్ట్ర సర్కార్​ పట్టించుకోలే
  • తెలంగాణ ఆడబిడ్డల కోసం ఢిల్లీలో సోదరుడిలా నేనున్నా
  • హైదరాబాద్​ సెంట్రల్​ వర్సిటీని ఇన్​స్టిట్యూట్​ 
  • ఆఫ్​ ఎమినెన్స్​గా డెవలప్​ చేస్తామని ప్రకటన
  • పాలమూరు వేదికగా రూ. 13,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

మహబూబ్​నగర్, వెలుగు : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇక్కడి రైతుల కష్టాలు తనకు తెలుసని, వారికి అండగా నిలిచేందుకు బోర్డును ఇస్తున్నామని వెల్లడించారు. ఈ నిర్ణయంతో తెలంగాణ రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ములుగు జిల్లాలో ట్రైబల్​యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, దీనికి గిరిజనుల ఆరాధ్య  దైవాలైన సమ్మక్క, సారక్క పేరు పెడ్తున్నట్లు ప్రకటించారు.  వర్సిటీ కోసం రూ.900 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ట్రైబల్​ వర్సిటీకి జాగా ఇవ్వాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఐదేండ్లు నాన్చిందని, గిరిజనులపై రాష్ట్ర సర్కార్​కు ప్రేమ లేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం తాము ఏ హామీ ఇచ్చినా సంతోషంతో, చిత్తశుద్ధితో ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కరప్షన్​, కమీషన్​ సర్కార్​ నడుస్తున్నదని ప్రధాని దుయ్యబట్టారు. 

బీఆర్​ఎస్​.. ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీగా తయారైందని, ఫ్యామిలీ కోసమే అది పనిచేస్తున్నదని మోదీ విమర్శించారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, చెప్పింది చేసే ప్రభుత్వం కావాలని ఆకాంక్షిస్తున్నారని ఆయన అన్నారు. చెప్పింది చేసే బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్​నగర్​ జిల్లా అమిస్తాపూర్​లోని ఐటీఐ కాలేజ్​ గ్రౌండ్​లో ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ రాష్ట్రంలో రూ. 13,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన ‘పాలమూరు ప్రజా గర్జన’ పబ్లిక్​ మీటింగ్​లో పాల్గొన్నారు.  రెండు సభల్లోనూ ఆయన ప్రసంగించారు. అనేక సార్లు తెలుగులో ‘‘నా కుటుంబసభ్యుల్లారా’’ అంటూ సభకు వచ్చినవాళ్లను పలుకరించారు. 

రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ అన్నారు. ‘‘సుగంధ ద్రవ్యాల సాగును ప్రోత్సహించడానికి దేశంలో వివిధ రకాల బోర్డులు పని చేస్తున్నాయి.  2014 తర్వాత దేశంలో పసుపు ఎగుమతి రెట్టింపైంది. కానీ, పసుపు లాంటి బంగారు దినుసులను పండించే రైతులను ఆదుకునేందుకు బోర్డు లేదు.. వారికి ఒక గొప్ప కానుక అందిస్తున్నా.. దేశంలోనే ప్రత్యేకమైన పసుపు రైతుల కోసం జాతీయ పసుపు బోర్డును తెలంగాణకు మంజూరు చేస్తున్నా. ఇది రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో మేలు చేస్తుంది’’ అని ఆయన చెప్పారు. తెలంగాణలోని పసుపు రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. 

ధీరవనితలు పుట్టిన నేల ఇది

రాష్ట్ర మహిళలు ఢిల్లీలో తమకొక సోదరుడు ఉన్నాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మోదీ అన్నారు. ‘‘తెలంగాణ అక్కాచెల్లెళ్లారా.. మీకోసం ఢిల్లీలో ఒక సోదరుడు ఉన్నాడనే విషయం మరిచిపోవద్దు. మీ జీవితాల్లో మార్పు కోసం, మీ జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ సోదరుడు నిరంతరం పనిచేస్తుంటాడు” అని ఆయన తెలిపారు.  ‘‘రాణీ రుద్రమదేవి లాంటి ధీర వనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. ఇటీవల నారీ శక్తి వందన్ చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్​ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపాం. చట్ట సభల్లో గతంకంటే రెట్టింపు స్థాయిలో మహిళలు తమ గళాన్ని వినిపించవచ్చు. తెలంగాణ మహిళలు మాకు ఓట్లేసి గెలిపించారు.  రాష్ట్రంతోపాటు  దేశవ్యాప్తంగా మహిళలకు నారీశక్తి వందన్​తో సాధికారిత దక్కుతుంది” అని ఆయన తెలిపారు. మహిళల జీవితాలను మెరుగు పర్చడానికి బీజేపీ ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేస్తుందని అన్నారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో మరుగుదొడ్లను కట్టించామని, ముద్ర స్కీం కింద ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్లు ఇస్తున్నామని, పీఎం ఆవాస్​ యోజన కింద ఇండ్లు కట్టిస్తున్నామని, ఉజ్వల పథకం కింద గ్యాస్​ కనెక్షన్లు ఇస్తున్నామని వివరించారు. పాలమూరుకు రావడానికి గంట ముందు స్వచ్ఛత అభియాన్​ కార్యక్రమంలో పాల్గొన్నానని, ప్రజల మద్దతుతో పరిశుభ్రత సాముహిక ఉద్యమంగా మారుస్తున్నామని తెలిపారు. 

సాగునీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ 

తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడుతున్నదని, రైతు స్కీముల పేరుతోనూ అక్రమ సంపాదన కూడగట్టుకుంటున్నదని మోదీ ఆరోపించారు. ప్రాజెక్టులను హంగు, ఆర్భాటాలతో ప్రారంభిస్తున్నదే తప్ప.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ‘‘రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం. ఇక్కడ బీజేపీ అధికారంలో లేకున్నా రైతులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.  రైతులకు ఉపయోగపడే రామగుండం ఎరువుల కర్మాగారం మూత పడ్తే ఇక్కడి ప్రభుత్వం తెరిపించలేదు. మేము రూ.6,300 కోట్లతో తెరిపించాం.  ఈ కర్మాగారం ద్వారా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు తక్కువ ధరలకే ఎరువులు అందుబాటులో ఉంటాయి. పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా రాష్ట్రానికి రూ.10వేల కోట్ల దాకా అందించాం” అని ఆయన వివరించారు.  2014కు ముందు కాంగ్రెస్​ ప్రభుత్వం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల కోసం కేవలం 3,400 కోట్లు చెల్లించేదని, తమ ప్రభుత్వం ఏడాది కాలంలో ఏకంగా రూ.27 వేల కోట్లు ధాన్యం కొనుగోళ్లకే ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో జరిగిన లోక్​సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఆదరణ చూపించారని, ఈ సభకు వచ్చిన ప్రజల ఉత్తేజాన్ని, ఆనందాన్ని చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే విషయం స్పష్టమవుతున్నదని చెప్పారు. ‘‘రాష్ట్రంలోని ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు, హామీలతో అవినీతిలో కూరుకుపోయింది. బీజేపీతోనే రాష్ట్రంలో మార్పు వస్తుంది” అని అన్నారు. 

తెలంగాణ అభివృద్ధి కొత్త శిఖరాలకు

హైవేల నిర్మాణంతో దేశంలోని అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం ఏర్పడుతుందని మోదీ అన్నారు.  ప్రజల సంక్షేమం కోసం తెలంగాణలో అనేక కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని తెలిపారు. దసరాకు ముందే పండుగ మొదలైందని చెప్పారు.  రూ. 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టుల వల్ల తెలంగాణ అబివృద్ధి కొత్త శిఖరాలకు వెళ్తుందని చెప్పారు. ‘‘దేశంలో నిర్మించే 5 టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్‌‌‌‌‌‌‌‌ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్‌‌‌‌‌‌‌‌తో ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణ ప్రజల బతుకులు బాగు చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. మేం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి 2,500 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను నిర్మించాం” అని ఆయన వివరించారు. హైదరాబాద్​ సెంట్రల్​యూనివర్సిటీని ‘ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎమినెన్స్‌‌‌‌‌‌‌‌’గా డెవలప్​ చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

మేం హామీ ఇస్తే తప్పక నెరవేరుతుంది

తెలంగాణ గొప్ప కళలు, సంస్కృతులు, నైపుణ్యాలకు నిలయమని మోదీ అన్నారు. ఇక్కడ తయారయ్యే ప్రతి ఉత్పత్తికి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభిస్తున్నదని చెప్పారు. ‘‘బిద్రి కళతో తయారు చేసిన ఒక బహుమతిని ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి అందించాను. ఈ బహుమతిలో ఉన్న కళ గురించి దేశ, విదేశాల్లో చర్చించుకుంటున్నారు. ఈ నైపుణ్యాలు ఉన్న వారికి మద్దతు అవసరం. చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న బడుగు, బలహీన వర్గాల వారి కోసం పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్​ తీసుకొచ్చాం” అని తెలిపారు. యువత, మహిళలు, రైతులు, చేతివృత్తి కళాకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ‘‘మోదీ హామీ ఇచ్చాడంటే అది తప్పక నెరవేరుతుంది. అందుకే ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. అందరం కలిసి తెలంగాణను ప్రగతి పథంలో నడిపిద్దాం. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు ఇక్కడికి రావడం, మీ అందరినీ చూడడం వల్ల నా జన్మ ధన్యమైంది. ఇందుకు వరుణుడు కూడా ఆశీర్వదించడం ఆనందంగా ఉంది” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

ట్రైబల్​ వర్సిటీకి రాష్ట్ర సర్కార్​ సహకారమేది?

ములుగు జిల్లాలో సెంట్రల్​ ట్రైబల్​ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఆ యూనివర్సిటీకి ఇక్కడి గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క,-సారక్క పేరు పెడుతున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇందు కోసం రూ.900 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ఐదేండ్లుగా భూమి ఇవ్వలేదని ఆయన అన్నారు. ఒకవేళ ఇక్కడి సర్కారు సహకరించి ఉంటే ఈ యూనివర్సిటీ ఏర్పాటులో ఆలస్యం అయ్యేది కాదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదివాసీలు, గిరిజనుల మీద శ్రద్ధ లేదని ప్రధాని మండిపడ్డారు.

బీఆర్ఎస్ పార్టీ ‘కారు’ స్టీరింగ్ ఎవరి దగ్గర ఉందో.. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నరో.. మీకందరికీ తెలుసు. ఈ రెండు కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడింది. వీటికి కరప్షన్, కమీషన్లు మాత్రమే తెలుసు. ఈ ఫ్యామిలీ పార్టీలది ఒకే ఫార్ములా.. పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ.. బై ద ఫ్యామిలీ.. ఫర్​ ద ఫ్యామిలీ! ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చేశారు.. పొలిటికల్ పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా నడిపిస్తున్నారు. ఈ కంపెనీల్లో ప్రెసిడెంట్, సీఈవో, డైరెక్టర్, జీఎం, మేనేజర్, ట్రెజరర్లు అంతా వాళ్ల వాళ్ల కుటుంబ సభ్యులే. వాళ్ల అవసరాల కోసం మాత్రమే కొందరు బయటివాళ్లను సహాయ సిబ్బందిగా పెట్టుకుంటారు. బయటివాళ్లకు ఏ అవకాశమూ ఇవ్వరు. కుటుంబాల మేలు తప్ప ప్రజల సంక్షేమం ఆ పార్టీలకు పట్టదు. బీజేపీ మాత్రం దేశమనే కుటుంబం కోసం, ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది.  

- ప్రధాని నరేంద్ర మోదీ