మోసగాళ్లను వదలం

మోసగాళ్లను వదలం

దేశాన్ని మోసం చేసేవారు, పేదలను దోచుకునేవారు ఎంత పవర్ ఫుల్ వ్యక్తులైనా, ప్రపంచంలో  ఏ మూల నక్కినా వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అవినీతి చిన్నదైనా, పెద్దదైనా సహించబోమని, అది సామాన్యుడి హక్కులను హరిస్తుందని చెప్పారు.
    

న్యూఢిల్లీ/కుశినగర్:  దేశాన్ని మోసం చేసేవారు, పేదలను దోచుకునేవారు ఎంత పవర్ ఫుల్ వ్యక్తులైనా వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం ఢిల్లీలో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ జాయింట్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. ‘‘అవినీతి చిన్నదైనా, పెద్దదైనా సహించబోం. అది సామాన్యుడి హక్కులను హరిస్తుంది. దేశ ప్రగతిని దెబ్బతీస్తుంది. దేశ శక్తియుక్తులను కుంగదీస్తుంది. అందుకే మోసగాళ్లు, పేదలను దోచేవాళ్లు ఎంత పెద్దవాళ్లైనా, పవర్ ఫుల్ అయినా, దేశంలో గానీ ప్రపంచంలో గానీ ఏ మూల నక్కినా బీజేపీ ప్రభుత్వం వారిని వదలబోదు” అని మోడీ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆశయం ప్రజలకు కూడా అర్థమైందన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ దళారుల ప్రమేయం లేకుండా నేరుగా అమలవుతుండటంతో అవినీతికి ఆస్కారమే లేకుండా పోయిందని చెప్పారు. అవినీతిని వ్యవస్థలో భాగంగా అంగీకరించేందుకు న్యూ ఇండియా ఎంతమాత్రం రెడీగా లేదన్నారు. ‘‘దేశ ప్రజలకు ఇప్పుడు కావాల్సింది సమర్థ, పారదర్శకమైన, చక్కని పాలన. అది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందిస్తోందని వారంతా నమ్ముతున్నారు” అని ప్రధాని అన్నారు.
కుశినగర్ ఎయిర్ పోర్టు ప్రారంభం 
గౌతమ బుద్ధుని మహాపరినిర్వాణ స్థలంగా భావించే యూపీలోని కుశినగర్ లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభించారు. విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత శ్రీలంక నుంచి వచ్చిన తొలి విమానం ల్యాండ్ అయింది. బుద్ధుని అవశేషాలు, శ్రీలంక బౌద్ధ సన్యాసులు, ప్రభుత్వ ప్రతినిధులతో కూడిన విమానం ఉదయం 9 గంటలకు వచ్చి ఎయిర్ పోర్టులో దిగింది. పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వారికి స్వాగతం పలికారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. బుద్ధుని జీవితంతో ముడిపడ్డ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా కుశినగర్ డెవలప్ మెంట్ కు కేంద్రం, యూపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. ‘‘బుద్ధిస్ట్ టూరిజాన్ని ప్రోత్సహించే చర్యల్లో ఈ ఎయిర్ పోర్టు ఏర్పాటు పెద్ద ముందడుగు. దీనితో బౌద్ధ క్షేత్రాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుంది” అని ఆయన పేర్కొన్నారు. 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంతో కూడిన కుశినగర్ విమానాశ్రయం పీక్ అవర్స్ లో 300 మంది ప్యాసింజర్లను హాండిల్ చేయగలదు. ఢిల్లీ, ముంబై, కోల్ కతాల నుంచి ఇక్కడికి త్వరలో విమాన సేవలు మొదలు కానున్నాయి. దీన్ని రూ.260 కోట్లతో నిర్మించినట్టు పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.
ఉడాన్ కింద 900 సిటీలకు ఫ్లైట్లు 
టూరిజం పెరగాలంటే ఆధునిక వసతులు, రోడ్డు, రైలు, విమాన, జల రవాణా, హోటళ్లు, ఆస్పత్రులు, ఇంటర్నెట్ కనెక్టివిటీ, పరిశుభ్రత తదితరాలన్నీ చాలా అవసరమని మోడీ అన్నారు.  ‘‘ఎయిరిండియా ప్రైవేటీకరణతో దేశ విమానయాన రంగానికి కొత్త బలం వచ్చింది. ఉడాన్ పథకంలో భాగంగా కొన్నేళ్లలో 900కు పైగా పట్టణాలకు ఫ్లైట్ సర్వీసుల ప్రారంభానికి అనుమతులొచ్చాయి. వాటిలో 350కి పైగా రూట్లలో ఇప్పటికే విమాన సర్వీసులు మొదలయ్యాయి. 50కి పైగా కొత్త ఎయిర్​పోర్టులు ఏర్పడ్డాయి. యూపీలో అయోధ్య, అలీగఢ్, ఆజంగఢ్, చిత్రకూట్, మొరాదాబాద్, శ్రావస్తిల్లో ఎయిర్​పోర్టుల ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి” అని మోడీ చెప్పారు.