
- బార్డర్ వద్ద పాకిస్తాన్ కదలికలపై ఆరా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్‌తో సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ ఇద్దరు సమావేశం అయ్యారు. సుమారు అరగంటకు పైగా మాట్లాడుకున్నారు. ఇప్పటికే నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కే.త్రిపాఠి, తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్‌తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజాగా రక్షణశాఖ కార్యదర్శితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. తాజాగా భేటీలో పహల్గాం టెర్రర్ అటాక్‌పై ఎలా స్పందించాలనే దానిపై చర్చించినట్లు సమాచారం. ఇండియాకు అందుబాటులో ఉన్న అవకాశాలు, పాకిస్తాన్ ప్రతీకార చర్యలను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై మాట్లాడుకున్నట్లు తెలుస్తున్నది.
ఎల్‌వోసీ వద్ద పాకిస్తాన్ సైన్యం భారీగా ఆయుధాలు సిద్ధంగా ఉంచినట్లు మోదీకి రాజేశ్ కుమార్ సింగ్ వివరించారు. బార్డర్ వద్ద నెలకొన్న పరిస్థితుల గురించి బ్రీఫ్‌గా వివరించినట్లు తెలుస్తున్నది. పాకిస్తాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా బలోపేతం చేసినట్లు రాజేశ్ కుమార్ సింగ్ వివరించారు. దీనికి ప్రతిగా ఇండియా త్రివిధ దళాల వ్యూహాలను మోదీకి వివరించినట్లు సమాచారం. ఇప్పటికే బార్డర్ వెంట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని వివరించారు. ఆయుధాలు కూడా తరలించినట్లు తెలిపారు.