సిద్దిపేట నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభం

సిద్దిపేట నుంచి రైల్వే సర్వీసులు ప్రారంభం
  • వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ
  •  జెండా ఊపిన  మంత్రి హరీశ్ రావు
  • బీఆర్ఎస్, బీజేపీ కార్యకకర్తల మధ్య బాహాబాహీ

సిద్దిపేట, వెలుగు :  సిద్దిపేట నుంచి సికింద్రాబాద్​రైల్వే సర్వీసులను మంగళవారం వర్చువల్ గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. మంత్రి హరీశ్​రావు జెండాఊపారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారు పోటీ పోటీగా నినాదాలు చేసుకున్నారు. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట నుంచి ప్రారంభం కావాల్సిన రైలు బండి 4.20 నిమిషాలకు బయలుదేరింది. ఈ రైలులో మంత్రి హరీశ్​ రావు, ఎంపీ ప్రభాకర్​రెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి దుద్దెడ స్టేషన్ వరకు, ఎమ్మెల్యే రఘునందన్ రావు  మనోహరాబాద్ వరకు కార్యకర్తలతో కలిసి  ప్రయాణం చేశారు. 

పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు

ఈ కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య  పలు మార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  ప్రారంభోత్సవ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ ఫొటో లేకపోవడంపై మంత్రి హరీశ్​ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపంతో అక్కడున్న టీవీని కాలితో తన్నాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు మోదీ ఫ్లెక్సీలను చించేశారు. దీంతో ఒక వర్గంపై మరోవర్గం కూర్చీలు విసురుకున్నాయి. ఇరువర్గాలను సముదాయిస్తున్న క్రమంలో సిద్దిపేట వన్ టౌన్ సీఐ కృష్ణారెడ్డితో పాటు ఒక కానిస్టేబుల్ కు కుర్చి తగిలి గాయాలయ్యాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్​రెడ్డికి కడుపులో గాయం కావడంతో వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. 

రైల్వే లైన్ రూపకర్త కేసీఆర్

సిద్దిపేట నుంచి దుద్దెడ వరకు రైలు లో ప్రయాణించిన మంత్రి హరీశ్​రావు కొండపాక ఐఓసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సిద్దిపేట రైల్వే లైన్ కు  సీఎం కేసీఆర్ స్వయంగా రూప కల్పన చేశారని, 2006 యూపీఏ హయాంలోనే  రైల్వే లైన్ మంజూరు కావడంతో పాటు  33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని చెప్పారని మంత్రి హరీశ్​ రావు అన్నారు. సిద్దిపేట రైల్వే లైన్ కు రాష్ట్ర వాటాగా 33 శాతం  డబ్బులు కట్టినా ప్రారంభోత్సవంలో  కనీసం సీఎం , స్థానిక ఎంపీ ఫొటోలు కూడా పెట్టకపోవడం దారుణమన్నారు. 

గజ్వేల్​లో రూ.530 కోట్ల పనులు ప్రారంభం 

గజ్వేల్/ములుగు/కొండపాక, వెలుగు : సిద్దిపేట జిల్లా గజ్వేల్​ నియోజకవర్గంలో మంగళవారం మంత్రి హరీశ్​రావు పర్యటించి రూ.530కోట్ల అభివృద్ది పనులను ప్రారంభించారు. ములుగు మండలం బండ మైలారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ సబ్​ స్టేషన్​ను, బైలంపూర్, వర్గల్​ మండలం అవుసులోనిపల్లిలో జీపీ భవనాలు, వర్గల్​లో బీసీసీబీ బ్యాంకు, రూ.306 కోట్లతో నిర్మించిన గజ్వేల్​ అవుటర్​ రింగ్​ రోడ్, పత్తి మార్కెట్​యార్డును ఓపెన్​ చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం వారు సీఎం కేసీఆర్​కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేసి హరీశ్​రావుకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గజ్వేల్​లో సీఎం కేసీఆర్​ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డి నుంచి వద్దు..  గజ్వేల్​లోనే ఉండాలని కేసీఆర్​ను ఒప్పించే బాధ్యత తనదన్నారు. ఆ తర్వాత కొత్తగా నిర్మించిన బస్​ స్టాండ్​ను, పద్మశాలి భవనానం, మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఓపెన్ చేసి మాట్లాడారు. గజ్వేల్ లో  పదివేల గృహలక్ష్మి ఇండ్లు కేసీఆర్​ శాంక్షన్ చేశారని, రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలో ఆ డబ్బులు  జమ అవుతనాయని చెప్పారు. కొండపాక మండల ఐఓసీ బిల్డింగును కూడా మంత్రి ప్రారంభించారు.