ఏఐలో మనమే లీడర్లం :  ప్రధాని నరేంద్ర మోదీ 

ఏఐలో మనమే లీడర్లం :  ప్రధాని నరేంద్ర మోదీ 
  • ఈ టెక్నాలజీతో భారీగా జాబ్స్​

న్యూఢిల్లీ:  ఆర్టిఫీషియల్​ఇంటెలిజెన్స్​(ఏఐ) టెక్నాలజీలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అన్నారు. దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి 'గ్లోబల్ అప్లికేషన్ల కోసం భారతీయ పరిష్కారాల'పై పని చేయాలని యువ పారిశ్రామికవేత్తలను,  స్టార్టప్‌‌లను కోరారు. ఢిల్లీలో మొదలైన స్టార్టప్ మహాకుంభ్‌‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వం ప్రారంభించిన ఏఐ, సెమీకండక్టర్స్  క్వాంటమ్‌‌ మిషన్లు యువతకు ఉద్యోగాలను,  ప్రపంచ పెట్టుబడిదారులకు పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తాయని అన్నారు.

మనం ఏఐ సాంకేతికత  నవయుగంలో ఉన్నాం.  ఏఐలో భారతదేశం పైచేయి సాధిస్తుందని ప్రపంచం గుర్తించింది. ఈ అవకాశాన్ని మనం వదులుకోకుండా చూసుకోవడం ఇప్పుడు మన ప్రాధాన్యత" అని ఆయన అన్నారు.  ‘నేషనల్ క్వాంటమ్​ మిషన్‌‌’కు కేంద్ర మంత్రివర్గం గతంలోనే ఆమోదం తెలిపింది. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌‌ను ఏర్పాటు చేయాలని  నిర్ణయించింది.  

2014లో మనదేశంలో 100 స్టార్టప్‌‌లు కూడా లేవు. ప్రస్తుతం దాదాపు 1.25 లక్షల స్టార్టప్‌‌లు ఉన్నాయి. సుమారు 12 లక్షల మంది యువత లబ్దిపొందారు. మనవద్ద 110కి పైగా యునికార్న్‌‌లు ఉన్నాయి. మన స్టార్టప్‌‌లు 12 వేల పేటెంట్‌‌లను దాఖలు చేశాయి’’ అని మోదీ చెప్పారు.  కేంద్రం ఇప్పటికే ఇండియా ఏఐ మిషన్ కోసం రూ. 10 వేల కోట్ల ప్రణాళికను ఆమోదించిందని మోదీ ఈ సందర్భంగా వివరించారు.