పరిపాలనలో మోడీ  శ్రమజీవి..అవినీతికి వ్యతిరేకి

పరిపాలనలో మోడీ  శ్రమజీవి..అవినీతికి వ్యతిరేకి

2014లో బీజేపీ అమ్ముల పొదిలో నుంచి  రామబాణంలా దూసుకొచ్చిండు నరేంద్రమోడీ. అద్భుత విజయాన్ని సాధించి ప్రధానమంత్రి పదవిని చేపట్టినారు. కొన్నాళ్లు ఆయన పరిపాలనా విధానాన్ని గమనించాను. మోడీ గాలికి కొట్టుకొచ్చిన ప్రధానమంత్రి కాదు. అటల్​ బిహారీ వాజ్​పేయి, లాల్​కృష్ణ అద్వానీ నిర్మించిన పునాదులపై పెరిగిన వ్యక్తి మోడీ. ఆయన చురుకైన సమర్థ నాయకుడు. రాజకీయపరమైన కుటుంబ పక్షపాతం లేని వ్యక్తి. అవినీతికి వ్యతిరేకి.

పీవీ, అద్వానీకి భారత రత్న

ఇందిరాగాంధీకి నమ్మకమైన అనుచరుడు మాజీ ప్రధాని భారత్​లో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, కాంగ్రెస్​ పార్టీకి చెందిన పీవీ నరసింహరావును కాంగ్రెస్​ పార్టీ అవమానించడం వలన నరేంద్ర మోడీ ఇంకా బలవంతుడయ్యాడు. జాతీయ పార్టీ కాంగ్రెస్​ ఒకే కుటుంబం గుప్పిట్లోకి వెళ్లింది. మిగతా నాయకులంతా నాయకత్వ లక్షణాలకి దూరమయ్యారు. ఇప్పుడు ఆ పార్టీలో ఇందిరాగాంధీ వంటి సమర్థ నాయకులు భూతద్దంతో వెదికినా కనిపించరు. తెలంగాణలోని కాంగ్రెస్​ నాయకులు ఎలాగూ పీవీ నరసింహరావు విగ్రహానికి పూలదండ వేసి గౌరవించే సాహసం చేయలేరు. మిగతా పార్టీల నాయకులైనా తెలంగాణ బిడ్డగా పీవీకి గౌరవ వందనం సమర్పించవచ్చు కదా! నా అభిప్రాయం ప్రకారం లాల్​ కృష్ణ అద్వానీ, పీవీ నర్సింహరావు భారత రత్న బిరుదుకు అర్హులు.

దేశాన్ని గుల్ల చేస్తున్న ప్రాంతీయ పార్టీలు

ప్రాంతీయ పార్టీలు దేశాన్ని గుల్ల చేస్తున్నాయి. ప్రజలను బిచ్చగాళ్లను చేసే స్కీములు అవలంబిస్తున్నాయి. దేశ అభివృద్ధిని దెబ్బ తీస్తున్నాయి. ఇటువంటి స్కీములతోనే కాంగ్రెస్​ను తొక్కేసి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ ప్రాంతీయ పార్టీలపై విజయం సాధించింది. ఎప్పటికైనా దేశానికి జాతీయ పార్టీలే మేలు చేస్తాయి. దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి. జాతీయ పార్టీలైన కమ్యూనిస్టు పార్టీలు రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయకుండా  బూజు పట్టిన సిద్ధాంతాలను వల్లె వేస్తూ, అధికారంలో ఉన్న పార్టీలను కాళ్లుపట్టి కిందకు లాగాలని చూస్తున్నాయి. ఒకప్పుడు ఇందిరాగాంధీని పడగొట్టాలని చూశారు. ఇపుడు నరేంద్రమోడీని పడగొట్టాలని చూస్తున్నారు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు పువ్వాడ అజయ్​ మంచి నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు. తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్​ మాటల మాంత్రికుడు. బీఆర్​ఎస్​ పార్టీ మత్తులో పడి పాలనను పట్టించుకోవడం లేదు. అందువలన వ్యతిరేకత పెరిగింది.

పరిపాలనలో మోడీ  శ్రమజీవి

రైతుల కష్టాలు ఏ నాయకుడికి అర్థం కావట్లేదు. రైతు నాయకుడినని చెప్పుకొనే ఒక తిక్కాయన సంవత్సరం రోజులు గొడవ చేసి నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశ పెట్టిన బిల్లులో లోపాలుంటే చెప్పమంటే చెప్పలేక నోరెళ్ల బెట్టిండు. ఎంత గొప్ప నాయకుడైనా రైతు కష్టాలు పూర్తిగా తొలగించలేడు. మన ప్రధాని మోడీ పని రాక్షసుడు. దేశ అభివృద్ధి కోసం చాలా శ్రమ పడుతున్నారు. ఆయనకు సాటి వచ్చే వారు ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేరు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు కీలుబొమ్మ వంటి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. సామాన్య ప్రజలు కోరుకునేది సమర్థ ప్రధాని ఉండాలని, కావాలని. ఆలె నరేంద్ర, విజయశాంతి, కోదండరామ్​, ఈటెల రాజేందర్​ ధృత రాష్ట్ర కౌగిలిలో నలిగిపోయిన వారే. కోదండరామ్​కు జ్ణానోదయం అయినట్లు లేదు. ఒంటరి పోరాటం చేస్తున్నారు. కొందరు ఏ పార్టీలో చేరాలా? అని జుట్టు పీక్కుంటున్నరు. ఒంటరి పోరాటం చేయలేరు. నేటి రాజకీయ పార్టీలకు, రామాయణ కావ్య నాయకుడైన శ్రీరాముడికి ఎటువంటి సంబంధం లేదు. సెక్యులర్​ పార్టీల ముసుగులో కొందరు శ్రీరాముణ్ణి విమర్శిస్తున్నారు. శ్రీరాముడు గొప్ప పరిపాలనాక్షుడు. ఆయనకు సాటియైన వారు పూర్వం లేరు, ఇప్పుడూ లేరు.  ఈ వ్యాసం విమర్శల కోసం కాదు. రాజకీయ నాయకుల ఆత్మపరిశీలన కోసం మాత్రమే. 

- గుడుమాసు జగన్మోహనరావు