కాంగ్రెస్ ప్రజావ్యతిరేక కూటమి కడుతోంది : ప్రధాని మోదీ

కాంగ్రెస్ ప్రజావ్యతిరేక కూటమి కడుతోంది : ప్రధాని మోదీ

ఢిల్లీలోని అశోక్ హోటల్ లో మంగళవారం (జులై 18న) నిర్వహించిన ఎన్డీయే మిత్ర పక్షాల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ పట్ల అన్ని వర్గాల్లో విశ్వాసం ఉందన్నారు. దేశ ప్రగతిలో ఎన్డీఏ పాత్ర అత్యంత కీలకం అని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో ఎన్డీఏ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించబోతుందన్నారు. దేశంలో స్థిరమైన పాలన అందించడానికే ఏన్డీఏ కూటమి ఏర్పడిందన్నారు. తాము ఎప్పుడూ కూడా విదేశీ శక్తుల సాయం తీసుకోలేదన్నారు. ఎన్డీఏ కూటమిలో చిన్న, పెద్ద పార్టీలంటూ తేడా ఏం లేదన్నారు. గాంధీజీ, అంబేద్కర్, లోహియా సిద్దాంతాలను ఎన్డీఏ కూటమి అందిస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరుస్తుందని చెప్పారు.  

అద్వానీయే ఎన్డీఏ మార్గదర్శకులని, ఏన్డీఏను వాజ్ పేయి, అద్వానీయే నిర్మించారన్నారు ప్రధాని మోదీ. ఏన్డీఏ కూటమి 25 ఏళ్ల నుంచి దేశ ప్రజల సేవలో ఉందన్నారు. ఎన్డీఏ పక్షాలు పీడిత, బలహీన వర్గాల కోసం పోరాడుతున్నాయని చెప్పారు. వారసత్వ రాజకీయాలతో ఏర్పడిన కూటమి చాలా రోజులు నిలువదన్నారు. ప్రజా వ్యతిరేక కూటములు ఎప్పుడు సఫలం కావన్నారు. కాంగ్రెస్ ప్రజావ్యతిరేక కూటమి కడుతోందని మండిపడ్డారు. యూపీఏ హయంలో ప్రభుత్వాని కంటే కూడా మరో సూపర్ పవర్ ఉండేదని వ్యాఖ్యానించారు. యూపీఏ హయంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 

దేశ ప్రగతిని నిలబెట్టిన ఘనత ఎన్డీఏదే అని ప్రధాని మోదీ అన్నారు. నవ భారత నిర్మాణం తమ లక్ష్యన్నారు. దేశప్రజల ఆకాంక్షలను నెరవేర్చమే తమ అజెండా అని. ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. తాము తలవంచుకునే పనులు ఎప్పుడూ చేయమని చెప్పారు. నిబద్ధతతో తల ఎత్తుకునేలా పాలన కొనసాగిస్తున్నామన్నారు. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందన్నారు. 

భవిష్యత్తులో ఎన్డీఏతో కలిసి వచ్చే పార్టీలను స్వాగతిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ప్రగతిని మార్చడంలో ఎన్డీఏ కీలక భూమిక పోషించిందన్నారు. మిత్ర పక్షాలు వివిధ రకాలుగా ఎన్డీఏకు మద్దతిచ్చాయన్నారు. ఆత్మనిర్భర్‌, అభివృద్ధి చెందిన భారత్‌ కోసం లక్ష్యం సాకారానికి కృషి చేశామన్నారు. భారతీయులు కొత్త సంకల్పంతో ముందడుగు వేస్తున్నారని చెప్పారు. ఎన్‌ -న్యూ ఇండియా, డి -డెవలప్ నేషన్‌, ఎ -యాస్పిరేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ అంటూ ఎన్డీఏకు మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ నిజాయితీగా వ్యవహరించిందని, ప్రతికూల రాజకీయాలు చేయలేదని మోదీ అన్నారు. ఓటర్ల తెలివితేటలను ప్రతిపక్షాలు తక్కువ అంచనా వేస్తున్నాయని చెప్పారు. రాజకీయాల్లో కేవలం పోటీతత్వం మాత్రమే ఉంటుందని చెప్పిన ఆయన.. అది శత్రుత్వంగా మారకూడదన్నారు.  దురదృష్టవశాత్తు ఇప్పుడున్న ప్రతిపక్షం.. అధికార పక్షాన్ని దుర్భాషలాడటమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.

దేశాన్ని రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉంచుతామన్నారు ప్రధాని మోదీ. 2024లోనూ తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ప్రపంచ దేశాలకు కూడా తెలుసని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా, బ్రిటన్‌, యూఏఈ వంటి దేశాలు ఎన్డీఏ ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకోవాలని చూస్తున్నాయని, ఎందుకంటే అదే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని వాళ్లకు తెలుసని మోదీ తెలిపారు.