దేశంలో పేదరికం తగ్గుతున్నది : మోదీ

దేశంలో పేదరికం తగ్గుతున్నది :  మోదీ
  • రామరాజ్యం తరహాలోనే పన్నుల వ్యవస్థను తెచ్చాం: ప్రధాని 
  •     ఢిల్లీ నుంచి ఇచ్చే ప్రతిపైసా లబ్ధిదారుల ఖాతాల్లోకే.. 
  •     అవినీతిపరులపై చర్యలే ఎన్డీఏకు టాప్ ప్రయారిటీ అని వెల్లడి 
  •     సత్యసాయి జిల్లాలో నాసిన్​ క్యాంపస్​ ప్రారంభం 
  •     లేపాక్షి టెంపుల్ సందర్శన.. అనంతరం కేరళలో పర్యటన

లేపాక్షి/పాలసముద్రం :  దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం గత 9 ఏండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. రామరాజ్యం తరహాలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలనను అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం గత పదేండ్లలో ట్యాక్స్ విధానంలో కీలక మార్పులు ప్రవేశపెట్టడం వల్ల పన్నుల రాబడి గణనీయంగా పెరిగిందన్నారు. మంగళవారం ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేసిన ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్)’ సంస్థను ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ప్రధాని మాట్లాడారు. ప్రజల నుంచి పన్నుల ద్వారా సేకరించిన డబ్బును తిరిగి వారికే వివిధ రూపాల్లో వెనక్కి ఇస్తున్నామన్నారు. ‘‘ప్రజల నుంచి పన్నుల ద్వారా సేకరించిన డబ్బులను తిరిగి వారి కోసమే ఖర్చు చేస్తున్నాం. దీనినే సుపరిపాలన అంటాం. రామరాజ్యం ఇచ్చే సందేశం కూడా ఇదే. గత ప్రభుత్వం మాదిరిగా దేశానికి నష్టం చేసే ప్రాజెక్టులను రద్దు చేశాం. రామరాజ్యం తరహాలో వనరులను సరిగ్గా వినియోగించుకుంటున్నాం” అని ప్రధాని తెలిపారు. ‘‘పదేండ్లకు ముందు దేశ ట్యాక్స్ సిస్టమ్​లో అనేక విధానాలు ఉండేవి. అవి సామాన్య ప్రజలకు అర్థమయ్యేవి కావు. కానీ గత పదేండ్లలో మేం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాం” అని మోదీ చెప్పారు. జీఎస్టీ రూపంలో దేశానికి కొత్త ట్యాక్స్ సిస్టమ్ వచ్చిందని, ఇన్ కం ట్యాక్స్ వ్యవస్థను కూడా సులభతరం చేశామన్నారు. సామాజిక జీవనంలో సుపరిపాలనకు శ్రీరాముడు మంచి ఉదాహరణ అని మోదీ అన్నారు. శ్రీరాముడిని ఇప్పుడు నాసిన్ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.  

అవినీతి నిర్మూలనే ప్రయారిటీ.. 

దేశంలో అవినీతి నిర్మూలన, అవినీతిపరులపై చర్యలు తీసుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వానికి టాప్ ప్రయారిటీ అని ప్రధాని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గత పదేండ్లలో ప్రజలకు రూ. 2.5 కోట్ల పన్ను ఆదా అయిందని ప్రధాని మోదీ చెప్పారు. దాదాపు 10 కోట్ల ఫేక్ నేమ్స్ ను డాక్యుమెంట్ల నుంచి తొలగించామన్నారు. ఇప్పుడు ఢిల్లీ నుంచి వెళ్లే ప్రతి పైసా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకే చేరుతోందని తెలిపారు. కాగా, పాలసముద్రం సమీపంలో నేషనల్ హైవే 44కు ఆనుకుని 500 ఎకరాల విస్తీర్ణంలో నాసిన్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు కేవలం గంట సమయంలోనే చేరుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)కు ఎంపికైన ఆఫీసర్లకు ట్రెయినింగ్ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ఏ నజీర్, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఏపీ పర్యటన తర్వాత మంగళవారం సాయంత్రం ప్రధాని కేరళ పర్యటనకు బయలుదేరారు. కొచ్చిలో రాత్రి 7 గంటలకు ఆయన భారీ రోడ్ షో నిర్వహించారు.  

లేపాక్షిలో పూజలు.. 

అయోధ్య వేడుకల నేపథ్యంలో రామాయణ గాథతో సంబంధం ఉన్న ఏపీలోని లేపాక్షి క్షేత్రాన్ని కూడా ప్రధాని మంగళవారం సందర్శించారు. లేపాక్షిలోని వీరభద్రస్వామి టెంపుల్ ను సందర్శించిన మోదీ అక్కడ రామ భజన చేశారు. రామాయణం తోలుబొమ్మల ఆటను తిలకించారు. తొలి తెలుగు రామాయణం అయిన రంగనాథ రామాయణ శ్రవణం చేశారు. లేపాక్షిలోని విష్ణు, శివ, పాపనాథేశ్వర, రఘునాథ, రాముడి ఆలయాలను కూడా మోదీ సందర్శించారు.