నా గ్యారంటీల ముందు.. కాంగ్రెస్ హామీలు పనిచేయవ్ : మోదీ

నా గ్యారంటీల ముందు.. కాంగ్రెస్ హామీలు పనిచేయవ్ : మోదీ

బేతుల్ (మధ్యప్రదేశ్) : ఎన్నిక ల కంటే ముందే కాంగ్రెస్ ఓటమిని ఒప్పుకుందని, మధ్యప్రదేశ్​లో వచ్చేది బీజేపీ సర్కారే అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీపై ప్రజల్లో ఎంతో నమ్మకం, ప్రేమ ఉందని చెప్పారు. ఈ నెల 17న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చివరి రోజు ప్రచారంలో భాగంగా మంగళవారం బేతుల్, షాజాపూర్​లో నిర్వహించిన బహిరంగ సభల్లో మోదీ మాట్లాడారు. ‘‘మోదీ గ్యారంటీల ముందు ఫేక్ ప్రామిస్​లు పని చేయవని కాంగ్రెస్​కు తెలుసు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ ఓటమి భయం పెరుగుతున్నది.

ఎన్నికల్లో ఓడిపోతామని కాంగ్రెస్ లీడర్లకు అర్థమైంది. ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. జమ్మూలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్యలో రామ మందిర నిర్మాణం వంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటామని కాంగ్రెస్ అస్సలు ఊహించి ఉండదు. ఇచ్చిన హామీల అమలు బాధ్యత నాది”అని మోదీ భరోసా ఇచ్చారు.

రాహుల్.. కింగ్ ఆఫ్ ఫూల్స్

రాహుల్ చేసిన ‘మేడ్ ఇన్ చైనా ఫోన్’ కామెంట్లపై మోదీ స్పందించారు. ‘‘ఆయన ఓ మహా జ్ఞాని.. కింగ్ ఆఫ్ ఫూల్స్.. అసలు అతడు ఏ ప్రపంచంలో బతుకుతున్నాడు? ఇండియా సాధించిన విజయాలు చూసి ఓర్వలేకపోతున్నడు. ఇదొక రోగం.. ఫారిన్ కళ్లద్దాలు పెట్టుకునే అతడికి ఇక్కడి అభివృద్ధి కనిపించట్లేదు. కాంగ్రెస్ హయాంలో ఏడాదికి రూ.20వేల కోట్ల విలువ కంటే తక్కువ ఫోన్లు తయారయ్యేవి. దాన్ని రూ.3.50 లక్షల కోట్లకు పెంచాం. లక్ష కోట్ల విలువైన ఫోన్లు విదేశాలకు ఎక్స్​పోర్ట్ చేస్తున్నాం. సెల్​ఫోన్ల తయారీలో ఇండియా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఇంట్లో కూర్చొని ఉంటే బయటేం జరుగుతున్నదో తెలీదు”అని రాహుల్​ను ఉద్దేశించి మోదీ విమర్శించారు.

జార్ఖండ్​లో 24 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్​లు..

రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ జార్ఖండ్ చేరుకున్నారు. బిర్సాముండా ఎయిర్​పోర్ట్​లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సీఎం హేమంత్ సోరెన్ ఆయనకు స్వాగతం పలికారు. బుధవారం జనజాతీయ గౌరవ్ దివస్. ట్రైబల్ ఐకాన్ భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళులర్పిస్తారు. గిరిజనుల సంక్షేమం కోసం రూ.24వేల కోట్లు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.