ఇండియా కూటమి స్కామ్‌స్టర్ల సంఘం: మోదీ

ఇండియా కూటమి స్కామ్‌స్టర్ల సంఘం: మోదీ

మహారాజ్​గంజ్/మోతిహరి (బిహార్):ఇండియా కూటమి ఓ ‘స్కామ్​స్టర్ల సంఘం’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజకీయ ఫ్రంట్​లా మాత్రం కనిపించడం లేదని, రూ.20 లక్షల కోట్ల కుంభకోణాలకు పాల్పడిన స్కాంస్టర్ల సంఘంలా కనిపిస్తున్నదని ఆరోపించారు. కూటమి పార్టీల నేతలందరూ ఓటు బ్యాంకు కాపాడుకోవడానికి కుల, మత, కుటుంబ రాజకీయాలు చేస్తుంటారని మండిపడ్డారు. అవినీతి, బుజ్జగింపు పాలిటిక్స్​కు ఇండియా కూటమి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. బిహార్​లోని మహరాజ్​గంజ్, పూర్వి చంపారన్ లోక్​సభ నియోజకవర్గాల్లో మంగళవారం నిర్వహించిన లోక్​సభ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మోదీ పాల్గొని మాట్లాడారు.

 ‘‘కూటమి పార్టీ నేతలందరూ సనాతన ధర్మ వ్యతిరేకులు. వారికి జూన్ 4న ఎన్నికల ఫలితాల రూపంలో గట్టి దెబ్బ తగులుతుంది. దేశ ప్రజలంతా నా కుటుంబ సభ్యులు. మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ జన్మించిన బిహార్​ రాష్ట్రానికి ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి చెడ్డ పేరు తీసుకొచ్చింది. 1990 కాలంలో ‘ఇరంగదారీ పన్ను’ (దోపిడీ)తో దేశవ్యాప్తంగా బిహార్ వార్తల్లో నిలిచింది. రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ.. ఈ ట్రెండ్​ను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నది’’ అని చెప్పారు.

ప్రధానిని బలపర్చేందుకు ఓటేయాలి

ప్రతి ఒక్కరూ వేసే ఓటు స్థానిక ఎంపీని ఎన్నుకోవడానికి మాత్రమే కాదని.. ప్రధానమంత్రిని బలపర్చడానికి కూడా అని మోదీ అన్నారు. పంజాబ్, తెలంగాణ, తమిళనాడుకు వలస వెళ్లిన బిహార్ ప్రజలను ఉద్దేశిస్తూ అక్కడి ప్రభుత్వాలు వివాదాస్పద కామెంట్లు చేస్తున్నా.. నెహ్రు, గాంధీ ఫ్యామిలీ నోరు మెదపలేదన్నారు. గుజరాత్​కు వలసొచ్చిన బిహారీలను తాను సీఎంగా ఉన్నప్పుడు ఎంతో బాగా చూసుకున్నా అని తెలిపారు. ‘‘ఎన్నికల్లో తుక్డే.. తుక్డే గ్యాంగ్​కు బుద్ధి చెప్పాలి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశం ముందుకెళ్లదు. పేదల కష్టాలు కూటమి నేతలకు పట్టవు. ఇక్కడ దోచుకుని.. స్విస్ బ్యాంకుల్లో దాచుకోవడమే వాళ్ల పని’’ అని విమర్శించారు.

తొలి ప్రధాని నెహ్రూ.. రిజర్వేషన్ల వ్యతిరేకి

దేశ తొలి ప్రధాని నెహ్రూతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలంతా.. రిజర్వేషన్లను వ్యతిరేకించారని మోదీ చెప్పారు. బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నెహ్రూ రిజర్వేషన్లు ఇచ్చేవారు కాదన్నారు. రిజర్వేషన్ల అంశంపై దేశంలోని అప్పటి సీఎంలకు నెహ్రూ లేఖలు రాశారని గుర్తుచేశారు.

ఎన్డీఏ కూటమినే ప్రజలు కోరుకుంటున్నరు

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బలంగా ఉండాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజల మద్దతుతో ఎన్డీఏ కూటమి మరింత స్ట్రాంగ్ అవుతున్నదని ట్విట్టర్​లో తెలిపారు. ‘‘ఐదో ఫేజ్ లోక్​సభ ఎన్నికల్లో భాగంగా ఓటేసిన వారందరికీ ధన్యవాదాలు. ఇండియా కూటమిది ఓటు బ్యాంకు రాజకీయాలు. కూటమి నేతలను ఎవరూ నమ్మరు. వాళ్లు తమ పరువు మొత్తం పోగొట్టుకున్నారు. ప్రతి ఫేజ్​లో మా ఓటు బ్యాంకు పెరుగుతున్నది’’అని మోదీ ట్వీట్ చేశారు.