
- విపత్తులకు ఐక్యంగా స్పందించాలె
- ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు
- విపత్తుల ప్రభావం ఒక్క చోటికే పరిమితం కాదన్న ప్రధాని
- సీడీఆర్ఐలో కొన్నేళ్లలోనే 40 దేశాలు భాగమయ్యాయని వెల్లడి
న్యూఢిల్లీ : విపత్తులు సంభవించినప్పుడు ఉమ్మడిగా, వేగంగా స్పందించడం అవసరమని ప్రధాని అన్నారు. ఒక ప్రాంతంలో విపత్తు జరిగితే దాని ప్రభావం మిగతా ప్రాంతాలపైన కూడా పడుతుందని అన్నారు. మంగళవారం ఐదో ‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిసైలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2023’లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విపత్తును తట్టుకునే మౌలిక సదుపాయాల కోసం కూటమి (సీడీఆర్ఐ) లో కొన్నేళ్లలోనే 40 దేశాలు భాగమయ్యాయని చెప్పారు. ‘ఒక ప్రాంతంలో సంభవించే విపత్తుల ప్రభావం అక్కడికే పరిమితం కాదు.
మిగతా ప్రాంతాల్లోనూ పడుతుంది. కాబట్టి మన స్పందన కూడా ఐక్యంగా ఉండాలి. మౌలిక సదుపాయాలనేవి కేవలం రాబడికి సంబంధించినవి మాత్రమే కాదు. ప్రతి ఒక్కరినీ చేరుకోవడానికి, తిరిగి నిలదొక్కుకోవడానికి సంబంధించినవి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. సంక్షోభ సమయాలతో సహా అన్ని వేళలా ప్రజలకు సేవ చేయాలి” అని అన్నారు. రవాణా మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో.. సోషల్, డిజిటల్ ఇన్‌ఫ్రా కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ఇటీవలి విపత్తులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల స్థాయిని గుర్తుచేస్తున్నాయని అన్నారు.
భారతదేశం, యూరప్‌ను తాకిన హీట్ వేవ్స్.. టర్కీ, సిరియాలో భూకంపం సంభవించిన సంఘటనలను ఆయన ప్రస్తావించారు. ‘‘ఒక ప్రాంతంలో సంభవించే విపత్తుల ప్రభావం కేవలం స్థానికంగా ఉండదనే అంతర్జాతీయ విజన్ నుంచి సీడీఆర్ఐ ఉద్భవించింది. ఇందులో ప్రభుత్వాలే కాకుండా గ్లోబల్ సంస్థలు, ప్రైవేట్ రంగాలు, డొమైన్ నిపుణులు కూడా పాలుపంచుకోవడం మంచి విషయం. డిజాస్టర్ల సమయంలో పునరుద్ధరణ వేగంగా చేపట్టడంపై దృష్టి పెట్టాలి” అని అన్నారు.
భూటాన్ రాజుతో ప్రధాని భేటీ
భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మ్‌యేల్ వాంగ్చుక్‌తో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. ఇండియా, భూటాన్ భద్రతా సహకారం విషయంలో సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని విదేశాంగశాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించేందుకు రోడ్‌మ్యాప్ రూపకల్పనకు భూటాన్ కింగ్ పర్యటన అవకాశం కల్పించిందన్నారు.