దేశానికి అతిపెద్ద సమస్యగా షార్ట్‌‌కట్‌‌ రాజకీయాలు

దేశానికి అతిపెద్ద సమస్యగా షార్ట్‌‌కట్‌‌ రాజకీయాలు
  • షార్ట్‌‌కట్‌‌ రాజకీయాలు ఇది పెద్ద సవాలుగా మారింది: ప్రధాని నరేంద్ర మోడీ
  • జార్ఖండ్‌‌‌‌లో దేవ్‌‌‌‌గఢ్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టు ప్రారంభించిన ప్రధాని

దేవ్‌‌గఢ్: షార్ట్‌‌కట్‌‌ రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం ఈ షార్ట్‌‌కట్‌‌ రాజకీయాలు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘షార్ట్‌‌కట్ రాజకీయాలు పెద్ద సవాలు మారాయి. ప్రజాకర్షక చర్యల ద్వారా కొందరు ఓట్లు పొందొచ్చు. కానీ ఒక దేశంలోని రాజకీయాలు షార్ట్‌‌కట్‌‌పై ఆధారపడితే.. అది షార్ట్‌‌ సర్క్యూట్‌‌కు దారి తీస్తుంది. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలను అనుసరించే వాళ్లు కష్టపడాల్సిన పనిలేదు. దీర్ఘకాలం చూపే ప్రభావం గురించి ఆలోచించాల్సిన అవసరమూ వారికి లేదు. అలాంటి పాలిటిక్స్‌‌కు ప్రజలు దూరంగా ఉండాలి. షార్ట్‌‌కట్‌‌ రాజకీయాలకు పాల్పడేవారు కొత్త ఎయిర్‌‌‌‌పోర్టులు కట్టరు. రోడ్లు వేయరు. మెడికల్ కాలేజీలు నిర్మించరు. నిజమేంటంటే.. హార్డ్‌‌వర్క్‌‌కు ఎలాంటి షార్ట్‌‌కట్ ఉండదు’’ అని చెప్పారు. మంగళవారం జార్ఖండ్‌‌లో పర్యటించిన ప్రధాని మోడీ.. రూ.401 కోట్ల ఖర్చుతో, 657 ఎకరాల్లో నిర్మించిన దేవ్‌‌గఢ్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ను ప్రారంభించారు. దేవ్‌‌గఢ్‌‌ నుంచి కోల్‌‌కతాకు వెళ్లే ఇండిగో విమానానికి పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ రమేష్ బాయిస్ పాల్గొన్నారు. దేవ్‌‌గఢ్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు 2018 మే 25న ప్రధాని శంకుస్థాపన చేశారు. ఇక్కడ 2,500 మీటర్ల మేర రన్‌‌వే ఉంది. మరోవైపు రూ.16,800 కోట్లతో చేపట్టిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు పూర్తయిన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. దేవ్‌‌గఢ్ ఎయిమ్స్‌‌లో నిర్మించిన ఇన్‌‌పేషెంట్ డిపార్ట్‌‌మెంట్, ఆపరేషన్ థియేటర్‌‌‌‌కు రిబ్బన్ కట్ చేశారు. వీటితోపాటు పలు రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పునాదిరాళ్లు వేశారు. రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి జరుగుతుందని, 8 ఏండ్లుగా దేశం ఇదే ఆలోచనతో పనిచేస్తోందని ప్రధాని అన్నారు.  జార్ఖండ్‌‌ను హైవేలు, రైల్వేలు, ఎయిర్‌‌వేలు, జలమార్గాల ద్వారా అనుసంధానించే ప్రయత్నంలో ఈ ఆలోచన స్ఫూర్తినిచ్చిందని చెప్పుకొచ్చారు. 

మోడీ రోడ్‌‌ షో
దేవ్‌‌గఢ్‌‌లో ప్రధాని మోడీ 12 కిలోమీటర్ల మేర రోడ్‌‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేయగా.. భారీ సంఖ్యలో జనం మోడీకి స్వాగతం పలికారు. వారిని విష్ చేస్తూ మోడీ ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ‘మోడీ.. మోడీ’ నినాదాలు మారుమోగాయి. రోడ్డుకు ఇరువైపులా ఎటు చూసినా ప్రధాని బ్యానర్లు, 
పోస్టర్లు ఏర్పాటు చేశారు.