ఝూట్.. లూట్..రెండు పార్టీలు ఒక్కటే: ప్రధాని మోదీ

ఝూట్.. లూట్..రెండు  పార్టీలు ఒక్కటే: ప్రధాని మోదీ
  • బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది.. ఏ మార్పు రాలే
  •  కాళేశ్వరం అవినీతిపై విచారణ ఏదీ?
  • కుటుంబ పార్టీలకు బీజేపీ చేస్తున్న అభివృద్ధి నచ్చదు
  • హైదరాబాద్ మ్యూజియానికి రాంజీగోండు పేరు పెడ్తం
  • ఆదివాసీలను గౌరవించే ప్రభుత్వం మాది
  • ఆదిలాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

హైదరాబాద్: కుటుంబ పార్టీల్లో ఉండేది రెండేనని అవి ఝూట్( అబద్దాలు చెప్పడం), లూట్(దోచుకోవడం) అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటేనని చెప్పారు. ఇవాళ ఆదిలాబాద్‌లో బీజేపీ తలపెట్టిన విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా మోడీ హాజరయ్యారు. నా కుటుంబ సభ్యలందరికి నమస్కారం అంటూ మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అది తప్ప ఏ మార్పూ రాలేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ సర్కారు ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు తిన్నారు అంటే మీరు తిన్నారు అనుకుంటున్నారని అన్నారు.  కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇంత వరకూ ఆ పనిచేయలేదని అన్నారు.

బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దని సూచించారు.  బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి అవుతోందని ఎవరైనా ఊహించారా..? అని ప్రశ్నించారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందున్నారు. హైదరాబాద్ మ్యూజియానికి రాంజీగోండు పేరు పెట్టి గౌరవిస్తామని చెప్పారు. 
 
అబ్ కీ బార్.. చార్ సౌ పార్

ఈ సారి  బీజేపీ నాలుగు వందలకు  పైగా సీట్లు సాధిస్తుందని ప్రధాని చెప్పారు. దేశమంతా మోదీ గ్యారెంటీలపైనే చర్చ జరుగుతోందని అన్నారు. ‘మీరంతా నా వాళ్లని, నేను మీ వాణ్ణి, మీ ప్రేమను కోరుకుంటున్న వాణ్ణి’అని ప్రధాని అన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపి సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.