మా పాలన వల్లే పేదరికం తగ్గింది : మోదీ

మా పాలన వల్లే పేదరికం తగ్గింది : మోదీ

న్యూఢిల్లీ:  దేశంలో గత తొమ్మిదేండ్లలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమ ప్రభుత్వంలోని పారదర్శక వ్యవస్థ, ప్రజల భాగస్వామ్యంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. దేశంలో పేదరికం తగ్గుతుందని ఎవరూ అనుకోలేదు కానీ, తమకు వనరులు ఇస్తే అది సాధ్యమవుతుందని పేదలు చూపించారన్నారు.

గురువారం ‘వికసిత్‌‌‌‌ భారత్‌‌‌‌ సంకల్ప్‌‌‌‌ యాత్ర’లో భాగంగా లబ్ధిదారులతో ప్రధాని మోదీ వర్చువల్‌‌‌‌గా మాట్లాడారు. దేశంలో పేదరికం తగ్గిందని నీతి ఆయోగ్‌‌‌‌ ఇచ్చిన నివేదికను ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేదలకు సహాయం చేయడంలో ఇతర దేశాలకు ఇండియా ఒక నమూనాను అందించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. ఈ సంకల్ప్‌‌‌‌ యాత్ర అనుకున్న దానికంటే ఎక్కువ విజయం సాధించిందన్నారు. ఇప్పటికే దేశంలోని 70 నుంచి 80 శాతం పంచాయతీలను కవర్‌‌‌‌‌‌‌‌ చేశామని చెప్పారు. 

ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్ర: కాంగ్రెస్‌‌‌‌

గత తొమ్మిదేండ్లలో 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్‌‌‌‌ నివేదికను కాంగ్రెస్‌‌‌‌ తప్పుబట్టింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉచిత రేషన్‌‌‌‌ నుంచి ప్రజలను దూరం చేయడానికి కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించింది. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్‌‌‌‌ నేత సుప్రియా శ్రీనతే మాట్లాడారు. బీజేపీ చెబుతున్న అబద్ధాల జాబితాలో దేశంలో 24.84 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారనే అబద్ధం కూడా చేరిందని ఎద్దేవా చేశారు.