బండ్ల అమ్మకాల్లో దూకుడు.. ఏప్రిల్‌‌లో  27 శాతం పెరిగిన సేల్స్​

బండ్ల అమ్మకాల్లో దూకుడు.. ఏప్రిల్‌‌లో  27 శాతం పెరిగిన సేల్స్​
  • వెల్లడించిన ఫాడా

న్యూఢిల్లీ: మనదేశంలో గత నెల మొత్తం వాహన రిటైల్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 27 శాతం పెరిగి 22,06,070 కి చేరాయి. ప్యాసింజర్ వెహికల్స్,  టూవీలర్స్​ సహా అన్ని విభాగాలలో ఏప్రిల్‌‌లో అమ్మకాలు భారీగా పెరిగాయని ఇండస్ట్రీ సంస్థ ఫాడా బుధవారం తెలిపింది. అయితే గత ఏప్రిల్​లో మొత్తం 17,40,649 వెహికల్స్ ఆర్​టీఓ ఆఫీసుల్లో రిజిస్టర్​ అయ్యాయి. ప్యాసింజర్ వెహికల్స్​ రిటైల్ విక్రయాలు గతేడాది ఇదే నెలలో 2,89,056 యూనిట్ల నుంచి 16 శాతం పెరిగి 3,35,123 యూనిట్లకు చేరుకున్నాయి.

అయితే టూవీలర్ల​ రిజిస్ట్రేషన్లు ఏప్రిల్‌‌లో 33 శాతం పెరిగి 16,43,510 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో 12,33,763 యూనిట్లు రిజిస్టర్​ అయ్యాయి. కమర్షియల్ వెహికల్స్​ రిటైల్ అమ్మకాలు ఏప్రిల్‌‌లో ఏడాది ప్రాతిపదికన 2 శాతం పెరిగి 90,707 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో త్రీవీలర్స్​ విక్రయాలు 9 శాతం పెరిగి 80,105 యూనిట్లకు చేరుకోగా, ట్రాక్టర్ల సేల్స్​ఒకశాతం వృద్ధితో 56,625 యూనిట్లకు చేరుకున్నాయి.

కలసి వచ్చిన పండుగలు

గత ఏడాది మార్చికి బదులుగా పండుగను ఏప్రిల్‌‌కు మార్చడమే ఈ వృద్ధికి కారణమని కొందరు పేర్కొంటుండగా, మొత్తం పెరుగుదల గణనీయంగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ముఖ్యంగా నవరాత్రి,  గుడి పడ్వా వంటి పండుగ సమయాల్లో మోడల్స్​ అన్నీ అందుబాటులో ఉండటం,  అనుకూలమైన మార్కెట్ సెంటిమెంట్ల కారణంగా ప్యాసింజర్ వెహికల్​ సెగ్మెంట్​ రెండంకెల వార్షిక వృద్ధిని సాధించింది.

"బలమైన బుకింగ్స్​ ఉన్నప్పటికీ, అధిక పోటీ, అదనపు సరఫరా,  తగ్గింపులు  నిరంతర వృద్ధికి సవాల్​గా మారాయి.  కొన్ని పోర్ట్‌‌ఫోలియోలలో కొత్త మోడల్స్ లేకపోవడం మార్కెట్​కు నష్టదాయకంగా మారింది" అని సింఘానియా చెప్పారు. మెరుగైన సరఫరా, 125సీసీ మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా టూవీలర్స్​సెగ్మెంట్ చెప్పుకోదగ్గ వృద్ధిని సాధించింది. పెట్రో ధరలు పెరగకపోవడం, వర్షాలు బాగా పడటం, పండుగల డిమాండ్,  పెళ్లిళ్ల సీజన్ వల్ల అమ్మకాలు పెరిగాయని సింఘానియా చెప్పారు.  కస్టమర్లు నిర్ణయాలను ఆలస్యం చేయడంతో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కొంత దెబ్బతిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1,503 రీజనల్​ ట్రాన్స్​పోర్ట్​ఆఫీసుల నుంచి తీసుకున్న డేటాతో ఈ వివరాలను తయారు చేసినట్టు ఫాడా తెలిపింది.