వారణాసిలో మోడీ టూర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం 

వారణాసిలో మోడీ టూర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం 

ఉత్తరప్రదేశ్: వారణాసిలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.1780 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వారణాసి కాంట్ స్టేషన్ నుండి గోదౌలియా వరకు ప్యాసింజర్ రోప్‌ వేకి మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ. 645 కోట్లు. ఐదు స్టేషన్లతో రోప్‌వే వ్యవస్థ 3.75 కిలోమీటర్లు వరకూ ఉంటుంది. దీని ద్వారా ట్రాఫిక్ తగ్గుతుందని భావిస్తున్నారు. వారణాసిలోని పర్యాటకులు, యాత్రికులు, నివాసితులకు సులభంగా రాకపోకలు సాగించడానికి వీలు కల్పిస్తుంది. కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ (వారణాసి జంక్షన్) నుండి గొదౌలియా స్క్వేర్ వరకూ రోప్‌వే నడుస్తుంది.

భగవాన్‌పూర్‌లో నమామి గంగా పథకం కింద రూ.300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 55 ఎంఎల్‌డి మురుగునీటి శుద్ధి ప్లాంట్‌,  ఖేలో ఇండియా పథకం కింద సిగ్రా స్టేడియం అభివృద్ధి పనులకు సంబంధించి మోడీ శంకుస్థాపన చేశారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నిర్మించబోయే సేవాపురిలోని ఇసర్వార్ గ్రామం వద్ద LPG బాట్లింగ్ ప్లాంట్ ను ప్రారంభించారు. అంతేకాదు.. భర్తర గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జల్ జీవన్ మిషన్ కింద19 తాగునీటి పథకాలను ప్రజలకు అంకితం చేశారు. ఇది 63 గ్రామ పంచాయతీలలోని 3 లక్షల మందికి పైగా ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రధాన మంత్రి మిషన్ కింద 59 తాగునీటి పథకాలకు శంకుస్థాపన చేశారు.