- మేం ఇచ్చినవన్నీ ఎస్పీ, కాంగ్రెస్ వెనక్కి తీస్కుంటయ్
- జన్ ధన్ అకౌంట్లు మూసేసి డబ్బులు లాక్కుంటరు
- ఆ కూటమి క్యాన్సర్ కన్నా డేంజర్
- యూపీ ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని సంచలన కామెంట్లు
శ్రావస్తీ/బస్తీ (యూపీ): లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే.. ఎన్డీఏ సర్కారు అమలు చేసిన పథకాలన్నింటినీ వాపస్ తీసుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం యూపీలోని శ్రావస్తీ, బస్తీ లోక్ సభ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. ‘‘గత పదేండ్లలో నా ప్రభుత్వం పేదలకు 4 కోట్ల ఇండ్లను కట్టించింది. వాళ్లు గెలిస్తే.. మీకు మేం ఇచ్చిన 4 కోట్ల ఇండ్లను తీసేసుకుంటారు. మేం 50 కోట్ల మందికి జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేయించాం. ఆ బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేసి వాటిలో ఉన్న డబ్బంతా లాక్కుంటారు.
మేం ప్రతి గ్రామానికీ కరెంట్ అందించాం. వాళ్లు వస్తే కరెంట్ కనెక్షన్లు కట్ చేసి మళ్లీ మిమ్మల్ని చీకట్లపాలు చేస్తారు. అలాగే మేం ఇంటింటికీ నల్లా నీటిని అందించాం. వాళ్లు వస్తే నల్లా కనెక్షన్లనూ తీసేస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లనూ తొలగిస్తారు. వీటన్నింటినీ వాళ్ల ఓటుబ్యాంకుకు ఇచ్చుకుంటారు” అని ప్రధాని ఆరోపించారు. ఇండియా కూటమి పార్టీలు మత, కుల, కుటుంబ కేంద్ర రాజకీయాలు చేస్తున్నాయని, ఆ కూటమి దేశానికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరమని విమర్శించారు. గత 60 ఏండ్లు దేశాన్ని పాలించిన వారిని ఏంచేశారని అడిగితే.. సమాజాన్ని విభజించి, ఓటు జిహాద్ చేశామని చెప్తారని మోదీ ఎద్దేవా చేశారు. దేశానికి 60 ఏండ్లుగా ఏమీ చేయలే కానీ ఇప్పుడు తనను అడ్డుకునేందుకు మాత్రం ఏకం అయ్యారన్నారు. ‘‘దేశ ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకేనని కాంగ్రెస్ పార్టీ అంటోంది. పేదలకే ఉంటుందని, ఉండాలని నేనంటున్నా” అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్, ఎస్పీ నేతలు పాక్ సింపథైజర్లు
పాకిస్తాన్కు కాంగ్రెస్, ఎస్పీ నేతలు సానుభూతిపరులుగా మారారని మోదీ అన్నారు. ‘‘టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఒకప్పుడు మనకు ఎదురు నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు తినడానికి సరైన తిండి కూడా లేనంతగా నాశనమైంది. కానీ ఆ దేశానికి సింపథైజర్లుగా మారిన కాంగ్రెస్, ఎస్పీ నేతలు మాత్రం మన దేశాన్నే బెదిరిస్తున్నారు. పాక్ వద్ద ఒక అణుబాంబు ఉంది కాబట్టి మనం భయపడాలని చెప్తున్నారు. కానీ వాళ్లకు 56 ఇంచుల ఛాతీ గురించి తెలియదా? ఇది బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. బలమైన మోదీ సర్కార్. నేడు ఇండియా వాళ్ల ఇండ్లలోకి దూరి మరీ మట్టుబెడుతోంది” అని ప్రధాని చెప్పారు.
కాంగ్రెస్, ఎస్పీ నేతలు రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్ 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి ప్రచారం చేసి ఫెయిల్ అయ్యారు. అప్పుడు ఫ్లాప్ అయిన సినిమాను ఇప్పుడు మళ్లీ చూపిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది” అని ఆయన ఎద్దేవా చేశారు. యూపీలో 80 సీట్లు ఉండగా, 79 సీట్లను ఇండియా కూటమి గెలుస్తుందని అఖిలేశ్ అంటున్నారని, జూన్ 4న వాళ్లకు కనువిప్పు కలుగుతుందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక వాళ్లు మళ్లీ ఈవీఎంలపై నిందలేస్తారన్నారు. బస్తీలో జరిగిన ర్యాలీలో యూపీ సీఎం యోగి కూడా పాల్గొన్నారు. తాము 400 సీట్లు దాటుతామని మాట్లాడుతుంటే.. ఎస్పీ, కాంగ్రెస్ కలిసి కనీసం 400 సీట్లలో కూడా పోటీ చేయట్లేదన్నారు.
