
హైదరాబాద్, వెలుగు: ప్రైమ్ వాలీబాల్ లీగ్ నాలుగో ఎడిషన్‌లో ముంబై మీటియర్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. సోమవారం రాత్రి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై 3-–0 (15-–9, 15–-8, 15–-12) తేడాతో వరుస సెట్లలో డిఫెండింగ్ చాంప్ కాలికట్ హీరోస్‌ను చిత్తు చేసింది. ఆట ప్రారంభంలో కాలికట్ హీరోస్ కెప్టెన్, సెట్టర్ మోహన్ మంచి పాస్‌లతో ఆకట్టుకున్నాడు. కానీ,ముంబై బ్లాకర్ అభినవ్ సలార్ గోడలా నిలిచి కాలికట్ ఎటాక్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు.
ఆట మధ్యలో మోహన్ చేసిన డబుల్ టచ్ తప్పిదంతో కీలకమైన సూపర్ పాయింట్ అందుకున్న ముంబై తొలి సెట్‌ను ఈజీగా నెగ్గింది. రెండో సెట్‌లోనూ ఆ జట్టు హవానే నడిచింది. శుభమ్ చౌదరి, మథియాస్ లోఫ్ట్‌సెన్స్ పదునైన స్పైక్స్‌కు తోడు కెప్టెన్ అమిత్ గులియా తెలివైన ప్లాన్స్‌తో ముంబై వరుస సెట్లలో కాలికట్ పని పట్టింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. అమిత్ గులియాకు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.