మెదక్, వెలుగు: మెదక్ మండలం మంబోజిపల్లి సమీపంలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పక్కన ఉన్న రాళ్ల గుట్ట మీద 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఉన్న రాతి చిత్రాల కాన్వాస్ ను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు బుర్ర సంతోష్ తెలిపారు.
అక్కడ పెద్ద రాతి గుండ్లపై రెండు తాబేళ్లు, జిగ్ జాగ్ రేఖలు, ఆరు పాత్రలు, ఒక వరుసలో గొలుసు కన్నెలు, వెనక వైపున వేలాడే బుట్ట, చెట్ల మాదిరిగా కనిపిస్తున్న పొడవైన నిలువు గీతలు, నిలువుగా, అడ్డంగా రెండ్రెండు గీతలు, నాలుగు బాణాల తీరున్న బొమ్మలు ఉన్నాయని వివరించారు.
అలాగే ఒక దిశలో ఒక ద్వంద్వ వృత్తానికి నలువైపులా గురి పెట్టినట్లు ఐదు బాణాలు ఒక వృత్తంలో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ అరుదైన రాతిచిత్రాల డిజైన్లని చెప్పారు. దీర్ఘ వృత్తాలు, వృత్తాలు, త్రిశూలం, తేనెపట్టు తరహా సన్నని 8,9 గీతలతో కంఠహారం లాగా కనిపించే అర్థ వృత్తం, ఇంకా అధ్యారోపణం చేయబడిన ఎన్నో రాతిచిత్రాలను గుర్తించామని తెలిపారు.
కొన్ని గుర్తించడానికి వీలుకాని డిజైన్లు ఈ రాతి చిత్రాలతావులో కనిపిస్తున్నాయని చెప్పారు. రాతి చిత్రాలన్నీ ఎరుపురంగులో గీసినవేనని తెలిపారు. రంగు గాఢతను, గీతలను బట్టి ఈ చిత్రాల్లో కొన్ని పెద్ద రాతి యుగానికి, ఎక్కువ మట్టుకు చారిత్రక యుగానికి చెందినవిగా చెప్పొచ్చని రాతి చిత్రాల నిపుణులు డాక్టర్ బండి మురళీధర్ రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
