బస్సులో మంటలు..20 మంది సజీవ దహనం

బస్సులో మంటలు..20 మంది సజీవ దహనం
  • 16 మందికి గాయాలు.. రాజస్తాన్​లోని జైసల్మేర్‌‌లో ఘటన
  • ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు

జైపూర్: రాజస్తాన్‌ జైసల్మేర్‌లో ఓ ప్రైవేట్‌ బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. థైయత్ ప్రాంతంలోని మిలిటరీ స్టేషన్ ఏరియాలో రన్నింగ్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్యాసింజర్లు సజీవ దహనమయ్యారు. మరో 16 మందికి కాలిన గాయాలయ్యాయి. బస్సు 50 మందికిపైగా ప్రయాణికులతో మంగళవారం జైసల్మేర్‌ నుంచి జోధ్‌పూర్‌కు బయలుదేరిందని అధికారులు వెల్లడించారు. 

థైయత్ గ్రామ సమీపంలోకి రాగానే రన్నింగ్ బస్సులో మంటలు ఎగిసిపడ్డాయని చెప్పారు. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపాడని.. ప్రయాణికులను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారని వివరించారు. అయినప్పటికీ, 20 మంది చనిపోయారన్నారు. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఫైర్ టెండర్లు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారని వెల్లడించారు. 

ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయిందన్నారు. బస్సులో పటాకులను రవాణా చేయడం వల్లే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులోని విద్యుత్ వ్యవస్థలో షార్ట్ సర్క్యూట్ కారణంగా క్రాకర్లు అంటుకుని, మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు.

అన్ని చర్యలు తీసుకుంటున్నం: సీఎం

బస్సు కాలిపోయి 20 మంది మృతిచెందిన ఘటనపై  రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ స్పందించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నదని, బాధితులను ఆదుకునేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. "జైసల్మేర్‌లో బస్సు అగ్నిప్రమాదం ఘటన చాలా బాధించింది. ఈ  ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 

గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఇప్పటికే స్థానిక అధికారులకు ఆదేశాలిచ్చాం. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోడానికి సిద్ధంగా ఉంది" అని భజన్‌లాల్ ట్వీట్ చేశారు. కాగా..త్వరలోనే తాను జైసల్మేర్​కు వెళ్లి పరిస్థితిని సమీక్షస్తానని సీఎం ప్రకటించారు.