ప్రైవేట్ బస్సుల ఛార్జీల మోత.. లబోదిబోమంటున్న ప్యాసింజర్లు

ప్రైవేట్ బస్సుల ఛార్జీల మోత.. లబోదిబోమంటున్న ప్యాసింజర్లు

వెలుగు, హైదరాబాద్:

రాష్ట్రంలో రోడ్డెక్కిన ప్రైవేటు బస్సులు చార్జీల మోత మోగిస్తున్నాయి. ప్యాసింజర్ల జేబులు గుల్ల చేస్తున్నాయి. తమకు తోచినంత టికెట్​ రేట్లను ఫిక్స్​ చేసుకొని ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్​ నుంచి జిల్లా కేంద్రాలకు, రాష్ట్ర రాజధానికి దూరంగా ఉన్న పట్టణాలకు వెళ్లే రూట్లను ప్రైవేటు ఆపరేటర్లు టార్గెట్​ చేశారు. సమ్మె కొనసాగుతుండటంతో అందిన కాడికి దండుకుంటున్నారు. ఆర్టీసీ చార్జీలతో పోలిస్తే డబుల్, ట్రిపుల్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. సమ్మెకు ప్రత్యామ్నాయం పేరిట కొన్ని రూట్లలో అద్దె బస్సులకు ఆర్టీసీ ఇటీవలే టెండర్లు పిలిచింది. సగం రూట్లను ప్రైవేటుకు అప్పగించే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ప్రకటించారు. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్​ యజమానులు తమకు దోచుకునే పర్మిట్​ దొరికినట్లుగా చెలరేగుతున్నారు. ప్రధాన రూట్లలో ఏసీ, వోల్వో, స్లీపర్​ బస్సులను రంగంలోకి దింపాయి. ఆర్టీసీ టికెట్ల ధరతో పోలిస్తే ఒకటికి మూడింతలకు పైగా పెంచి ఆన్​లైన్ లోనే దర్జాగా టికెట్లను ఆఫర్​చేస్తున్నాయి. ఆదిలాబాద్​, మంచిర్యాల, కరీంనగర్​,  నిజామాబాద్​, మిర్యాలగూడ అన్ని రూట్లలోనూ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్లాన్​ చేసుకుంటున్నాయి. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆరెంజ్, దివాకర్,  విక్రమ్ శ్రీ, వెంకటేశ్వర, రెడ్డి ఎక్స్​ప్రెస్​, హరిత, కావేరి తదితర ప్రైవేటు ఆపరేటర్లందరూ ప్రధాన రూట్లలో  బస్సులు నడిపేందుకు రంగంలోకి దిగాయి. కొన్ని ట్రావెల్స్​ మూడు రెట్ల  టికెట్లను ఫిక్స్​ చేసి.. అందులో  5 శాతం డిస్కౌంట్​ ఆపర్​ ఇచ్చి  ప్రయాణికులను బురిడీ కొట్టిస్తున్నాయి.

హైదరాబాద్​‌‌-మిర్యాలగూడ      రూ.185  రూ.250 – రూ.700

మంచిర్యాల-హైదరాబాద్        రూ.356  రూ. 530- రూ. 740

సూర్యాపేట-హైదరాబాద్​         రూ.160  రూ.300

కరీంనగర్-సికింద్రాబాద్​           రూ.198 రూ.350

హైదరాబాద్​‌‌-శ్రీశైలం                రూ.270  రూ.400

హైదరాబాద్​-నిజామాబాద్​  రూ.210  రూ.350- రూ.1200

ఖమ్మం-హైదరాబాద్           రూ.250-350    రూ.400 – రూ.900

కొత్త రూట్లకు ఆర్టీవో పర్మిట్లు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నుంచి హైదరాబాద్​కు ఆర్టీసీ సూపర్​ లగ్జరీ బస్సుకు ఆర్టీసీ రూ.185 వసూలు చేస్తే.. ప్రైవేట్​  ట్రావెల్స్ రూ.200 నుంచి రూ.250 చార్జీ తీసుకుంటోంది. రెండు రోజుల కిందటే ఈ రూట్లో  ప్రైవేటు బస్సులకు రవాణా శాఖ పర్మిట్లు జారీ చేసిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ.. అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రూట్లో ఏసీ, స్లీపర్​ బస్సులను నడిపేందుకు ప్రైవేటు ఆపరేటర్లు పోటీ పడుతున్నారు. ఏసీ, స్లీపర్​ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు ఆన్​లైన్​లో  రూ.400 నుంచి రూ.700 వరకు టికెట్లను ఆఫర్​ చేస్తున్నాయి.

రద్దీ పేరిట దోపిడీ

మంచిర్యాల నుంచి హైదరాబాద్ కు ఆర్టీసీ ఇంద్ర కోచ్​లో రూ.356 టికెట్ ఉంటే.. ప్రైవేట్​ ట్రావెల్స్​ రూ. 740 వసూలు చేస్తున్నాయి. ఆన్​లైన్​లో రూ.500 నుంచి రూ.670 వరకు టికెట్లను అమ్ముతున్నాయి.  ఇటీవల దసరా, దీపావళి పండుగ సమయంలో ఈ రూట్లో ప్రైవేటు సర్వీసులు తమ ప్రతాపం ప్రదర్శించాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో  సీజన్​ ఫేర్​ పేరుతో రూ.1500 వరకు ఛార్జీ వసూలు చేసి ప్రయాణికుల నుంచి దోచుకున్నారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్​కు ఆర్టీసీ సూపర్​ లగ్జరీ బస్ ఛార్జీ రూ.160, గరుడకు రూ.420. విజయవాడ రూట్లో వెళ్లే ప్రైవేటు సర్వీసులన్నీ రూ.300 నుంచి రూ.400 వసూలు చేస్తున్నాయి. కరీంనగర్ నుండి సికింద్రాబాద్​ జూబ్లీ బస్టాండ్ వరకు  ఎక్స్​ ప్రెస్​కు రూ.148, డీలక్స్​కు రూ.167, సూపర్​ లగ్జరీకి రూ.198 చార్జీ ఉంది. ప్రైవేట్​ ట్రావెల్స్​ నిర్వాహకులు రూ. 220 వసూలు చేస్తున్నారు. పేరొందిన ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ, స్లీపర్​ బస్సులను నడిపిస్తూ ఆన్​లైన్లో ​ రూ.350 నుంచి రూ.600 వసూలు చేస్తున్నాయి.

ఒక్కో టికెట్ పై అదనంగా  రూ.50

హైదరాబాద్​ నుంచి  సిద్దిపేట, కరీంనగర్, మెదక్ వైపు వెళ్లే ప్రైవేట్ సర్వీసులన్నీ ఆర్టీసీ ఛార్జీల కంటే పాతిక శాతం అధికంగా చార్జీ తీసుకుంటున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు,కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నుంచి హైదరాబాద్ కు వెళ్లే ప్రైవేటు బస్సులన్నీ ఆర్టీసీ ఛార్జీకి అదనంగా రూ.50 దండుకుంటున్నాయి.  హైదరాబాద్​ నుంచి  శ్రీశైలానికి ప్రతి రోజు దాదాపు 40 బస్సులు నడుస్తాయి. ఇతర డిపోల బస్సులు మరో 20 వరకు ఉంటాయి. ఆర్టీసీ బస్సుల్లో రూ.270 టికెట్​ ఉంటే.. ఘాట్ రోడ్డు కావటంతో ప్రైవేటు ఆపరేటర్లు రూ.400 వరకు చార్జీ తీసుకుంటున్నారు.

కార్తీక మాసం భక్తులకు మోత

కార్తీక మాసం కావటంతో భక్తుల రద్దీ ఉండటంతో ప్రయాణికులు అడిగినంత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి నుంచి హైదరాబాద్​కు వచ్చే ప్రైవేటు వాహనాలన్నీ ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. నిజామాబాద్​ రూట్లో ప్రైవేటు బస్సులు ఆన్​లైన్​లో రెండింతల నుంచి నాలుగింతల వరకు అమ్ముకుంటున్నాయి.