ప్రైవేటోళ్లు లేకుండానే ఇంటర్ స్పాట్

ప్రైవేటోళ్లు లేకుండానే ఇంటర్ స్పాట్
  • కనిపించని కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లు
  • రిలీవ్ చేసేందుకు మేనేజ్‌‌మెంట్ల ససేమిరా 
  • తక్కువ మందితోనే కొనసాగుతున్న స్పాట్
  • నెలరోజుల పాటు సాగే చాన్స్

హైదరాబాద్, వెలుగు: ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్‌‌ పేపర్ల స్పాట్ వాల్యువేషన్‌‌లో లెక్చరర్ల కొరత కనిపిస్తోంది. వాల్యుయేషన్ మొదలై రెండు రోజులైతున్నా ఇప్పటికీ 30% మంది లెక్చరర్లు కూడా సెంటర్లలో రిపోర్టు చేయలేదు. సర్కారు కాలేజీల లెక్చరర్లతో పాటు కొన్ని ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు మాత్రమే ఇప్పటివరకూ స్పాట్‌‌కు అటెండ్ అవుతున్నారు. కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లు వాల్యుయేషన్‌‌కు రావడం లేదని అధికారులు చెప్తున్నారు. ఇదే పద్దతి కొనసాగితే నెలరోజులైనా వాల్యువేషన్ పూర్తికాదని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాల్లో ఈనెల 6 నుంచి ఫస్ట్ స్పెల్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. సంస్కృతం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్​ఏ, బీ, పొలిటికల్ సైన్స్, బోటనీ తదితర పేపర్లను దిద్దుతున్నారు. సెకండ్ స్పెల్‌‌లో ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, కామర్స్, జువాలజీ పేపర్లను దిద్దడం సోమవారం నుంచి మొదలుపెడతారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల క్యాంపుల్లో వాల్యుయేషన్‌‌ చాలా తక్కువ మందితోనే మొదలైందని అంటున్నారు. కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లు రాకపోవడం, మోడల్ స్కూళ్ల లెక్చరర్లు రిపోర్టు చేయకపోవడంతో తక్కువ మందితో స్పాట్‌‌ కొనసాగుతోందని తెలుస్తోంది.

మోడల్ స్కూలోళ్లు రారట..

మోడల్ స్కూళ్లలోని పీజీటీలను 10వ తేదీ మధ్యాహ్నం రిలీవ్ చేయాలని, 11న వారంతా స్పాట్‌‌లో జాయిన్ కావాలని మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. దీంతో 2,500 మంది పీజీటీలు స్పాట్‌‌కు దూరమయ్యారు. అయితే చీఫ్ ఎగ్జామినర్ పోస్టుల విషయంలో కించపరిచేలా బోర్డు ఇచ్చిన ఉత్తర్వులను  రద్దు చేసి తమకు ప్రయారిటీ ఇస్తేనే స్పాట్‌‌లో పాల్గొంటామని మోడల్ స్కూల్ టీచర్లు చెప్తున్నారు. స్పాట్‌‌ను బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే ఆయా సంఘాలు ప్రకటించాయి.

వారం పాటు క్లాసులు బంద్..!

ప్రస్తుతం స్పాట్‌‌లో ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు పాల్గొంటున్నారు. సర్కారీ కాలేజీల్లో చదివే పిల్లలు క్లాసులు నష్టపోతారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పాట్‌‌లో లెక్చరర్లందరినీ ఇన్వాల్వ్ చేయాలని బోర్డు నిర్ణయించింది. వారం రోజులు అన్ని కాలేజీల్లో క్లాసులు బంద్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని సర్కారుకు లెటర్ రాసింది. దానిపై సోమవారం నిర్ణయం వెలువడే చాన్స్ ఉంది. ఇది జరిగితే 15 రోజుల్లోనే స్పాట్ పూర్తయ్యే అవకాశముందని అధికారులు చెప్తున్నారు. మరోపక్క క్లాసులకు ఇబ్బంది కలుగుతుందనే భయంతో స్పాట్‌‌ వాల్యుయేషన్‌‌కు లెక్చరర్లను రిలీవ్ చేసేందుకు కార్పొరేట్ కాలేజీల మేనేజ్‌‌మెంట్లు ఒప్పుకోవడం లేదు. దీంతో వారంతా స్పాట్‌‌కు దూరంగా ఉన్నారు.

స్పాట్‌‌కు రాకుంటే చర్యలు

ఇంటర్ వాల్యుయేషన్‌‌కు ప్రయారిటీ ఇచ్చి, అన్ని కాలేజీల మేనేజ్‌‌మెంట్లు డ్రాఫ్ట్ చేసిన లెక్చరర్లను రిలీవ్ చేయాలి. వారంతా తప్పకుండా వారికి కేటాయించిన స్పాట్ సెంటర్లలో రిపోర్టు చేయాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం.

- ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు సెక్రెటరీ