ఆర్టీసీలో ప్రైవేట్ వ్యక్తుల హవా .. రెండేండ్లుగా సంస్థలో కన్సల్టెంట్లుగా చెలామణి

ఆర్టీసీలో ప్రైవేట్ వ్యక్తుల హవా ..  రెండేండ్లుగా సంస్థలో కన్సల్టెంట్లుగా చెలామణి
  • ఒక్కొక్కరికి నెలకు లక్షల్లో జీతాలు
  • రిటైర్డ్ ఆఫీసర్లపై సర్కారు నిర్ణయంతో బయటకు వస్తున్న అక్రమ నియమకాలు
  • ఓ మహిళా కన్సల్టెంట్‌‌‌‌కు ఏకంగా నెలకు రూ.8 లక్షల జీతం
  • ఐటీ కన్సలెంట్ కంపెనీకి ఏడాదికి రూ.12 కోట్ల చెల్లింపు

హైదరాబాద్, వెలుగు: టీఎస్‌‌‌‌ ఆర్టీసీలో గత రెండేండ్లుగా ప్రైవేట్ వ్యక్తుల హవా కొనసాగుతోంది. ఎండీ తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, పలు విభాగాల హెచ్‌‌‌‌వోడీలు, రీజనల్ మేనేజర్లు ఇలా ఎంతో మంది అధికారులు సంస్థలో ఉన్నా.. ప్రైవేట్ వ్యక్తులను నియమించి, వారికి పెద్ద మొత్తంలో జీతాలు చెల్లిస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీని డెవలప్ చేయడం కోసం ప్రైవేట్ వ్యక్తులను కన్సల్టెంట్లుగా నియమించి నెలనెలా లక్షల రూపాయల జీతాలు, వెహికల్, డ్రైవర్లను కేటాయిస్తూ ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నారు.

వీరిలో చాలా మంది బస్ భవన్‌‌‌‌కు రాకుండా బయట నుంచే పనిచేస్తూ జీతాలు తీసుకుంటుండగా, మరికొంత మంది ఎప్పుడో ఒకసారి అలా వచ్చి ఇలా వెళ్తున్నారు. గత రెండేండ్లుగా సంస్థలో వీరంతా కొనసాగుతున్నా.. ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. అన్ని ప్రభుత్వ శాఖల్లో రిటైర్డ్ అధికారులు, ప్రైవేట్ వ్యక్తుల వివరాలు, వారిని తొలగించేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు వారి వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

ఓ మహిళా అధికారి సహకారంతో..

ఆర్టీసీకి సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు, వారికి చెల్లించే జీతాలు ఇలా అన్ని నియమకాలు.. సంస్థలో ఫైనాన్స్ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఓ మహిళా అధికారి చేతుల్లో ఉందని బస్‌‌‌‌ భవన్‌‌‌‌ ఉద్యోగులు చెబుతున్నారు. రెండేండ్ల కింద ఫైనాన్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా ఉన్న ఓ అధికారిని బలవంతంగా వీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ తీసుకునేలా ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. తర్వాతే ఆ మహిళను ఫైనాన్స్‌‌‌‌ అడ్వైజర్‌‌‌‌‌‌‌‌ పోస్టులో నియమించారని చెబుతున్నారు. అయితే, ఆర్టీసీలో బయట వారిని ఎవరిని నియమించాలనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించాలి. 3 నెలలకోసారి జరిగే బోర్డ్ మీటింగ్‌‌‌‌లో వీరి నియమకానికి ఆమోదం తెలపాలి. కానీ, ఇవేమీ లేకుండా సదరు మహిళా ఈ ప్రైవేట్‌‌‌‌ వ్యక్తుల వ్యవహరం నడిపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అందరినీ తొలగించాల్సిందే..

రెండేండ్ల నుంచి ఆర్టీసీలో కన్సల్టెంట్లుగా పనిచేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను తొలగించాలని ఆర్టీసీ ఉద్యోగులు, అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఓ మహిళ కన్సలెంట్‌‌‌‌కు నెలకు రూ.8 లక్షల జీతం చెల్లిస్తున్నారు. వీరిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అసలు వీరిని ఏ ప్రాతిపదికన నియమించారో చెప్పాలని డిమాండ్‌‌‌‌ చేస్తున్నారు. వారికి ఆర్టీసీ నుంచి ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలని కోరుతున్నారు. ఏటా కోట్లల్లో నిధులు దుబారా చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఆర్టీసీలో సూపరింటెండెంట్లు, డిపో మేనేజర్, డివిజనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్, ఐటీ వింగ్, పర్సనల్ వింగ్, లా వింగ్, విజిలెన్స్, పలు విభాగాల హెచ్‌‌‌‌వోడీలు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఇలా సుమారు 300 మంది అధికారులు పనిచేస్తున్నారు. వీరికి సంస్థలో 20 నుంచి 30 ఏండ్ల అనుభవం ఉన్నప్పటికీ వీళ్ల మీద ప్రైవేట్ వ్యక్తులు పెత్తనం చెలాయిస్తుండటంతో విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలోని అధికారులు ఇచ్చిన సలహాలతోనే ఆర్టీసీ నష్టాలు తగ్గాయని చెబుతుండడంపై కార్మికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీలో ఓ ఉన్నతాధికారి ఫ్రెండ్‌‌‌‌ను మార్కెటింగ్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా నియమించి ఆయనకు నెలకు రూ.1.5 లక్షల జీతం ఇస్తుండటంపై ఉద్యోగులు వాపోతున్నారు. 

మీటింగ్‌‌‌‌ల కోసం టెంపరరీ ఆఫీస్.. 

హైదరాబాద్‌‌‌‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌‌‌‌లో ఆర్టీసీ సంస్థకు ఐదెకరాల్లో విశాలమైన ఆఫీస్ ఉన్నా.. మీటింగ్‌‌‌‌ల కోసమని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌‌‌‌సీయూ) డిపోలో టెంపరరీగా ఓ ఆఫీసును నిర్మించారు. దీనికోసం రూ.60 లక్షలు ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి.