
- టెస్టుల పేరుతో ప్రైవేటు హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్ల వసూళ్లు
- ఫీవర్ ఫియర్‌తో వెళ్తే టెస్టుల పేరుతో దోపిడీ
- రూ.వెయ్యి నుంచి 3 వేలు టెస్టులకే ఖర్చు
- ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి సొమ్ము చేసుకుంటున్న ల్యాబ్‌లు
హైదరాబాద్, వెలుగు:
రాష్ర్టంలో ప్రబలుతున్న జ్వరాలు ప్రైవేటు హాస్పిటళ్లు, డయాగ్నస్టిక్ సెంటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. జ్వరం రాగానే భయంతో వచ్చే జనం నుంచి అందినకాడికి దోచుకుంటున్నాయి. ఫీవర్ ప్రొఫైల్ పేరిట కొత్త కొత్త ప్యాకేజీలు అందిస్తూ డయాగ్నస్టిక్ సెంటర్లు రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. డయాగ్నస్టిక్ సెంటర్లు, టెస్టుల ధరలపై హెల్త్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షణ లోపించడంతో దొరికినకాడికి సొమ్ము చేసుకుంటున్నాయి.
రూ.వెయ్యి నుంచి 3 వేల వరకు..
ఒక్కో పేషెంట్ సగటును రూ.వెయ్యి నుంచి 3 వేల వరకూ టెస్టులకే ఖర్చు అవుతున్న పరిస్థితి. చాలా మంది డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా వంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఉదాహరణకు డెంగీ నిర్ధారణకు నిర్వహించే ఎన్‌ఎస్1 టెస్టుకు ఒకచోట రూ.500 తీసుకుంటే, ఇంకో సెంటర్లో రూ.1,350 వసూలు చేస్తున్నారు. మండల కేంద్రాలు, చిన్న చిన్న పట్టణాలు, ఆర్‌ఎంపీ, పీఎంపీ క్లినిక్‌లలోనూ ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. ప్లేట్‌లెట్ కౌంట్, హిమోగ్లోబిన్, డెంగీ, మలేరియా వంటి టెస్టులన్నీ చేస్తున్నారు. పాథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు లేకుండానే కేవలం మిషన్లు ఇచ్చే కౌంట్ పైనే ఆధారపడి రిపోర్టులు ఇస్తున్నారు. తమ వద్దకు వచ్చే రోగుల సంఖ్య జులై నుంచే రెట్టింపైందని ల్యాబ్‌ల నిర్వాహకులు చెబుతున్నారు.
ఆర్డీటీ ప్రామాణికం కాదు
ప్రస్తుతం వస్తున్న జ్వరాల్లో అధిక శాతం వైరల్ ఫీవర్లే ఉంటున్నాయి. వైరల్ ఫీవర్ వచ్చినా ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గుతోంది. ఇదే ప్రైవేటు హాస్పిటళ్లకు వరంగా మారింది. ప్లేట్‌కౌంట్ తగ్గగానే, డెంగీ నిర్ధారణ కోసం ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ (ఆర్డీటీ) చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ వస్తే డెంగీ అంటూ రోగులను భయపెడుతున్నారు. వాస్తవానికి ఎలీసా మెథడ్‌లో ఎన్‌ఎస్ 1 లేదా ఐజీఎం పాజిటివ్ వస్తేనే డెంగీ అని కచ్చితంగా చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. ఎలీసా చేయడానికి కనీసం ఐదారు గంటలు పడుతుంది. ఆర్డీటీ అయితే గంటలో రిజల్ట్స్ వస్తాయి. దీంతో చాలా హాస్పిటళ్లు ఆర్డీటీ వైపే మొగ్గు చూపుతున్నాయి. కానీ ఈ టెస్ట్ ప్రామాణికం కాదని నిపుణులు చెబుతున్నారు. ‘డెంగీ నిర్ధారణకు ఆర్డీటీ ప్రామాణికం కాదు. ఈ టెస్ట్‌తో 50% ఫాల్స్ నెగటివ్, ఫాల్స్ పాజిటివ్ ఫలితాలే వస్తాయి’ అని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎలీసా టెస్టుల్లో పాజిటివ్ వస్తేనే ప్రభుత్వం డెంగీ కేసులుగా పరిగణిస్తోంది.
రోజూ 10 శాతం డెంగీ కేసులు
ఇప్పుడు మా దగ్గరకు వస్తున్న పేషెంట్ల సంఖ్య డబుల్ అయింది. రోజుకు కనీసం 700 మంది నుంచి 800 మంది టెస్టుల కోసం వస్తున్నారు. మా బ్రాంచ్‌లన్నింటిలోనూ ఇలానే రష్ ఉంది. వీరిలో 20 నుంచి 30% మంది సొంతంగానే టెస్టుల కోసం వస్తున్నారు. మిగతా వాళ్లు డాక్టర్ల సూచనల మేరకు టెస్టులు చేయించుకుంటున్నారు. ఎక్కువగా ఫీవర్ కేసులే ఉంటున్నాయి. రోజూ వందకుపైగా డెంగీ టెస్టులు చేస్తున్నాం. ఇందులో 10% డెంగీ పాజిటివ్ వస్తున్నాయి. వైరల్ ఫీవర్ వచ్చిన వారిలోనూ ప్లేట్ లెట్ కౌంట్ తగ్గుతోంది. – జి.వెంకట్‌రెడ్డి, టపాడియా డయాగ్నస్టిక్ సెంటర్, హైదరాబాద్
భయపెడుతున్నరు
ప్రైవేటు హాస్పిటళ్లలో ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ చేసి డెంగీ అని భయపెడుతున్నారు. ఆర్డీటీతో డెంగీ నిర్ధారించలేం. ఎలీసా చేయాల్సిందే. ఆర్డీటీలో 21% కేసుల్లో డెంగీ లేకపోయినా ఉన్నట్టు(ఫాల్స్ పాజిటివ్), 30% కేసుల్లో డెంగీ ఉన్నా లేనట్టు(ఫాల్స్ నెగిటివ్) రిజల్ట్స్ వస్తాయి. అత్యవసర సమయాల్లో లేదా ప్రాథమిక నిర్ధారణకు మాత్రమే ఆర్డీటీ చేయాలి. కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు జనాలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదైతే, మాకు తెలపాలని ప్రైవేటు హాస్పిటళ్లకు ఆదేశాలిచ్చాం. ప్రైవేటు హాస్పిటళ్లు అనుమానిత కేసుల శాంపిళ్లను పంపిస్తే, ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం.- అమర్‌సింగ్ నాయక్, అడిషనల్ డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్