ప్లేట్​లెట్స్..కౌంట్ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడి

ప్లేట్​లెట్స్..కౌంట్ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడి
  • డిమాం డ్ పెరగడంతో బ్లడ్ బ్యాంకుల్లో కొరత
  • ప్లేట్​లెట్లు వేరు చేసే పరికరాలు 17 సర్కారు దవాఖాన్లలోనే
  • ప్రైవేటు ఆస్పత్రుల బాటపడుతున్న రోగులు

హైదరాబాద్, వెలుగుప్లేట్​లెట్స్​.. ఇప్పడు భయపెడుతున్న మాట. చిన్న జ్వరమొచ్చినా ప్లేట్​లెట్లు ఎక్కడ పడిపోతాయోనన్న ఆందోళన.. హాస్పిటళ్లకు పరుగుపెట్టిస్తోంది. చిన్నజ్వరమైనా రక్తపరీక్షలు చేయించుకోవాల్సి వస్తోంది. చాలా కేసుల్లో ప్లేట్​లెట్స్​ ఎక్కించాల్సి వస్తోంది. డిమాండ్​ పెరగడంతో బ్లడ్​ బ్యాంకుల్లోనూ కొరత ఏర్పడుతోంది. ప్లేట్​లెట్లు కావాలంటూ శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రి ప్రకటన విడుదల చేసిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాతల కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. జనాల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, అవసరం లేకున్నా ప్లేట్​లెట్లు ఎక్కించాలని చెబుతూ డబ్బులు గుంజుతున్నాయి. ఒక్కో యూనిట్​కు ₹15 వేల నుంచి ₹18 వేల వరకు వసూలు చేస్తున్నారు. 20 వేల కన్నా తక్కువకు పడిపోతేనే ప్లేట్​లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని, బ్లీడింగ్​ వంటి సమస్యలు వచ్చినప్పుడే ఆ అవసరం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం 30 వేలకు రాగానే ముందు జాగ్రత్త పేరిట రోగులను కంగారు పెడుతున్నాయి. రాష్ర్టవ్యాప్తంగా సుమారు 3.5 లక్షల మంది జ్వరాల బారిన పడ్డారు. 2 నెలల నుంచి డెంగీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజుల్లోనే దాదాపు 2 వేల మంది దాకా డెంగీ బారిన పడ్డారు. 80 శాతం జ్వరాల బాధితుల్లో ఏదో ఒక స్థాయిలో ప్లేట్​లెట్​ కౌంట్​ పడిపోతోంది. మామూలుగా అయితే 1.5 లక్షల వరకు ప్లేట్​లెట్లు ఉంటే సాధారణంగానే చెప్పొచ్చు. దీంతో ఆ లిమిట్​కు కొంచెం తగ్గినా రోగులను ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చేర్పించేసుకుంటున్నారు. 40 వేలకు పడిపోగానే ఐసీయూలోకి తీసుకెళ్లి జనాన్ని మరింత హడలెత్తిస్తున్నారు. 30 వేలకు పడగానే ఎక్కిస్తున్నారు. ఇంకొన్ని హాస్పిటళ్లలో అయితే, పడిపోకున్నా కౌంట్​ పడిపోయినట్టు తప్పుడు లెక్కలు చూపిస్తూ రోగులను భయపెడుతున్నారు. స్వయానా ఓ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారికే అలాంటి అనుభవం ఎదురైందంటే కొన్ని ఆస్పత్రుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం సర్కార్​ దవాఖాన్లలో 10 వేలకు పడిపోతేనే వాటిని ఎక్కిస్తున్నారు.

ప్లేట్​లెట్లు వేరుచేసే పరికరాల్లేవ్​

ప్రస్తుతం బ్లడ్​బ్యాంకులు, ఆస్పత్రుల్లో ప్లేట్​లెట్ల కొరత ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 17 ఆస్పత్రుల్లోనే రక్తం నుంచి ప్లేట్​లెట్లను వేరు చేసే పరికరాలున్నాయి. అందులో సింగిల్​ డోనర్​ ప్లేట్​లెట్లను (ఎస్​డీపీ) వేరు చేసే పరికరాలు కేవలం నాలుగే ఉన్నాయి. అవి కూడా హైదరాబాద్​లోని గాంధీ, నీలోఫర్​, మహబూబ్​నగర్​ టీచింగ్​ హాస్పిటల్​, కరీంనగర్​ జిల్లా ఆస్పత్రుల్లో  ఉన్నాయి. మిగిలి సర్కారు దవాఖాన్లలో ఆ వసతి లేకపోవడంతో రోగులు ప్రైవేటు హాస్పిటళ్లకే వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎస్​డీపీ: దాత నుంచి కేవలం ప్లేట్​లెట్లనే తీసుకోవడం. అందుకోసం ఓ ప్రత్యేక కిట్​ను వాడతారు. దాని ధర ₹6 వేల నుంచి ₹8 వేల వరకూ ఉంటుంది. దాని సాయంతో రక్తాన్ని బయటకు తీసి, ప్లేట్​లెట్లను వేరు చేస్తారు. మళ్లీ రక్తాన్ని దాత శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ ప్లేట్​లెట్లను ఎక్కిస్తే రోగి శరరీంలో 20 వేల నుంచి 30 వేల వరకు కౌంట్​ పెరుగుతుంది.

ఆర్​డీపీ: దీన్నే ర్యాండమ్​ డోనర్​ ప్లేట్​లెట్స్​ అఫెరిసిస్​ అంటారు. దాత నుంచి రక్తాన్ని తీసుకుని ప్లేట్​లెట్లు వేరు చేస్తారు. ఈ పద్ధతిలో వేరు చేసిన ఒక యూనిట్​ ప్లేట్​లెట్లను రోగికి ఎక్కిస్తే పెరిగేది కేవలం 5 వేల నుంచి 10 వేలు. దీంతో అవసరాన్ని బట్టి రెండు నుంచి మూడు యూనిట్లకు పైగానే ఎక్కించాల్సి వస్తోంది. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో ఇదే పద్ధతిని వాడుతున్నారు. దీంతో బాధిత వ్యక్తి ఇద్దరు ముగ్గురు డోనర్లను ఆస్పత్రులకు తీసుకురావాల్సి వస్తోంది. ఇలా ప్లేట్​లెట్లను వేరు చేసే పరికరాలు గద్వాల, తాండూరు‌‌, సంగారెడ్డి, సిద్దిపేట, కామారెడ్డి, నిర్మల్​, జగిత్యాల, జనగాం, కొత్తగూడెం, భద్రాచలం, నల్గొండ, సూర్యాపేట వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉన్నాయి.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి