- గుండె, కిడ్నీ, లివర్, బీపీ, షుగర్, పెరాలసిస్ పేషెంట్ల అవస్థలు
- కొంచెం క్రిటికల్‌గా ఉన్నా పేషెంట్లను చేర్చుకోని కార్పొరేట్ ఆస్పత్రులు
- జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి
- సిటీలోని ఆస్పత్రులకు వస్తున్న కేసుల్లో 60 శాతం జిల్లాలవే
- ప్రైవేటు ఆస్పత్రుల్లో సర్జరీలు వాయిదా
- ఆపరేషన్ ఆలస్యంతో పేషెంట్లకు మరిన్ని ఆరోగ్య సమస్యలు
హైదరాబాద్, వెలుగు:రాష్ర్టంలో ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌ల మూత పడటంతో జనం ఇక్కట్లు పడుతున్నారు. గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ సమస్యలు ఉన్న వారు, బీపీ, షుగర్, పెరాలసిస్ పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు తెరిచి ఉన్నా అక్కడ కొన్ని రకాల ట్రీట్‌మెంట్లు మాత్రమే అందిస్తున్నారు. పేషెంట్ కండీషన్ కొంచెం క్రిటికల్‌గా ఉన్నా.. వేరే ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనైతే హెల్త్ ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాల నుంచి మండల కేంద్ర ఆస్పత్రులకు, అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రులకు వెళ్లినా చికిత్స అందడం లేదు. డాక్టర్లు వారిని హైదరాబాద్‌లోని ఉస్మానియా, నిమ్స్ తదితర ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఇలా నిత్యం సిటీలోని ఆస్పత్రులకు వస్తున్న కేసుల్లో 60 శాతం జిల్లాల నుంచి వచ్చినవే ఉంటున్నాయి. జిల్లా ఆస్పత్రులకు సీరియస్ కేసులు వస్తే.. రిస్క్ ఎందుకని ప్రాథమిక చికిత్స అందించి పెద్దాసుపత్రులకు పంపిస్తున్నారు. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల్లో నెల రోజులుగా సర్జరీలు వాయిదా పడ్డాయి. ఆపరేషన్ ఆలస్యం కావడంతో పేషెంట్లకు మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దీంతో పరిస్థితి ప్రాణం మీదికి వస్తోంది.
సర్జరీలు వాయిదా
ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర సర్జరీలు మాత్రమే జరుగుతున్నాయి. లాక్డౌన్ ప్రారంభంలో అత్యవసరం కానీ వారికి మందులిచ్చి సర్జరీలను పోస్ట్‌పోన్ చేశారు. నెల పూర్తి కావడం, ఇచ్చిన మందులు అయిపోవడంతో పలువురి ఆరోగ్యం విషమిస్తోంది. ప్రస్తుతం అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రులకు వస్తున్న రోగుల్లో ఇలాంటి వారు కూడా ఉన్నారు. సిటీలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో రోజుకు 200 వరకు సర్జరీలు జరిగేవి. ఇపుడు వాటి సంఖ్య పదికి పడిపోయింది.
క్యాన్సర్ బాధితుల అవస్థలు
క్యాన్సర్, కిడ్నీ సమస్యతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారు దాదాపు లక్ష మంది వరకు ఉంటారు. ఇందులో 20 శాతం మంది ఇతర రాష్ట్రాల వాళ్లు ఉన్నారు. ఈ లక్ష మందిలో 30 వేల మందికి అత్యవసర చికిత్స చేయాల్సి ఉంటుంది. లాక్డౌన్ వల్ల ట్రాన్స్‌పోర్టేషన్ లేకపోవడంతో 30 వేల మందిలో 20 శాతం మంది సకాలంలో చికిత్స చేయించుకోలేకపోతున్నారు. మరికొందరు చికిత్సకు పూర్తిగా దూరమవుతున్నారు. జిల్లాల నుంచి వచ్చేందుకు సదుపాయం లేకపోవడం ఇందుకు కారణం.
ఓపీలు తగ్గినయ్
హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణంగా రోజుకు ఓపీ కోసం దాదాపు 25 వేల నుంచి 30 వేల మంది వచ్చే వారు. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులకు 2 వేల మంది చొప్పున వచ్చేటోళ్లు. కానీ లాక్డౌన్ వల్ల ఆయా ఆస్పత్రుల్లో వంద ఓపీలు దాటడంలేదు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ఇదే పరిస్థితి. సాధారణంగా రోజూ వెయ్యికి పైగా మైనర్, మేజర్ సర్జరీలు జరిగేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో మాత్రమే జరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇంతే. గతంలో ఒక్కొ కార్పొరేట్ ఆస్పత్రికి నిత్యం 1,000 నుంచి 1,500 మంది వరకు పేషెంట్లు వచ్చేవాళ్లు. ఇప్పుడు వందలోపే ఉంది. 10 రోజుల నుంచి కాస్త పెరిగినట్లు తెలిసింది. రిజిస్ర్టేషన్ చేసుకుంటే ఆన్లైన్ విధానంలోనే డాక్టర్లు సలహాలు, సూచనలు ఇచ్చి మందులు రాస్తున్నారు.
అవయవ మార్పిడి కోసం ఎదురుచూపులు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అవయవ మార్పిడి సర్జరీలు కూడా నిలిచిపోయాయి. నిమ్స్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న జీవన్‌దాన్ ట్రస్టులో ఆర్గన్స్ కోసం రిజిస్ర్టేషన్ చేసుకొని 7,481 మంది ఎదురుచూస్తున్నారు అందులో లివర్ కోసం 3,384 మంది, కిడ్నీల కోసం 3,950 మంది, ఇతర వాటి కోసం 147 మంది వెయిట్ చేస్తున్నారు.
అనుమానితులుంటే ప్రభుత్వాసుపత్రికే
ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. ఎవరైనా కరోనా అనుమానితులుగా అనిపిస్తే వారిని ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నాం. పల్మనాలజీ డిపార్ట్‌మెంట్ కు ఎక్కువగా లంగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్లు వస్తారు. సహజంగానే వీరిలో కొందరికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అలా అని అందరికీ కరోనా పరీక్షలు అవసరం అని కాదు. అనుమానాన్ని బట్టి అడ్వైజ్ చేస్తాం. వీలైనంత వరకు అందరికీ ట్రీట్‌మెంట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం.
– డాక్టర్ రమణ ప్రసాద్, సినీయర్ పల్మనాలజీ కన్సల్టెంట్, కిమ్స్ హాస్పిటల్
ఎమర్జెన్సీ అయితేనే..
ఎమర్జెన్సీ అయితేనే ట్రీట్‌మెంట్ చేస్తున్నాం. ఎవరిలోనైనా కరోనా లక్షణాలున్నట్లు అనుమానం వస్తే గాంధీకి వెళ్లాలని చెబుతున్నాం. అక్కడ నెగెటివ్ వస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నాం.
– డాక్టర్ కేటీఆర్ సత్యప్రకాష్, గ్లోబల్ హాస్పిటల్ ఎమర్జెన్సీ డిపార్టుమెంట్
