రాష్ట్రంలో మొదలైన ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజుల  దోపిడీ

రాష్ట్రంలో మొదలైన ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజుల  దోపిడీ

ప్రైవేటు స్కూల్స్ యజమాన్యాలు ఫీజు దోపిడీని షూరు చేశాయి. అధిక ఫీజుల పేరుతో మధ్యతరగతి, నిరుపేదలను పిండి.. పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఫీజుల నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా ఫలితం మాత్రం శూన్యం. వేలు, లక్షల ఫీజుల పెంపుతో సగటు నిరుపేద విద్యార్థి తల్లిదండ్రుల గుండె గుబేల్ మంటోంది. 

కొన్ని స్కూళ్లల్లో ఎల్ కేజీకి లక్షా 20 వేలు వసూలు చేస్తున్నారని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగో తరగతికి రూ. లక్షా 20 వేల నుంచి లక్షా 60 వేలకు పెంచారని చెబుతున్నారు. ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుతున్నా రాష్ట్ర  ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అధికంగా ఫీజులు పెంచడాన్ని ప్రశ్నిస్తే పలు స్కూలు యాజమాన్యాలు బెదిరిస్తున్నాయని వాపోతున్నారు తల్లిదండ్రులు. రాష్ట్రంలో కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీ చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం 20 నుంచి 50 శాతం స్కూల్స్ ఫీజులు పెంచాయి పలు స్కూల్స్.

మంత్రి వర్గ ఉపసంఘం సిఫారసు ప్రకారం.. తెలంగాణలోని పాఠశాలలు మునుపటి సంవత్సరంలో వసూలు చేసిన ఫీజులో 10 శాతానికి మించి ఫీజులను పెంచకూడదు. అయితే.. ఈ నిబంధనలను పూర్తిగా పక్కన బెట్టి వచ్చే విద్యా సంవత్సరానికి అంటే (2023--24) గాను చాలా ప్రైవేటు స్కూళ్ల  యాజమాన్యాలు ఫీజలను మధ్య తరగతి తల్లిదండ్రులు మోయలేనంతగా పెంచేశాయి. 

ప్రస్తుతం ఉన్న ఫీజుల కంటే దాదాపు 6 నుంచి 20 శాతం వరకు పెంచాయి. దీంతో విద్యార్థుల తల్లితండ్రులపై మోయలేని భారం పడుతోంది. ఇప్పటికే చాలా స్కూళ్లల్లో ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. కొన్ని స్కూళ్లల్లో మాత్రం ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది కట్టాల్సిన ఫీజుల విషయంలో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు వాట్సాప్‌ మెసెజ్‌లు, నోటీసులు, మెయిల్స్‌ పంపారు.

ఇస్టానుసారంగా ఫీజులు పెంచుతున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు, విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. సర్కారు నిబంధనలను లెక్క చేయకుండా, ఇష్టారాజ్యంగా నడుస్తున్న పాఠశాలలపై అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా ఫీజుల దందా కొనసాగుతున్నా...అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్నా.. తమకేమీ పట్టనట్టుగా ఉంటున్నారు. 

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి స్కూల్ల్లో జాయిన్ చేసి, ఉన్నత చదువులు చదివించాలని భావిస్తారు. ఇంగ్లిషు మీడియంపై మోజు, కార్పొరేటు స్కూళ్లపై వ్యామోహంతో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు. తల్లిదండ్రుల వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటున్న చాలా కార్పొరేట్ స్కూల్స్ ఇష్టానుసారంగా ఫీజులను పెంచి.. ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. భారీ మొత్తంలో ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తుండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిఏడాది కొన్ని పాఠశాలల యాజమాన్యాలు 20 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతూనే ఉన్నా యి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోంది. కంప్యూటర్‌ క్లాసులంటూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నారు. ఏదో అలా నాలుగు, ఐదు కంప్యూటర్లు, స్ర్కీన్లను ఏర్పా టు చేసి ఫీజులు వసూలు చేస్తున్నారే తప్ప.. విద్యార్థులకు చెప్పెదేమీ లేదని చాలామంది పేరెంట్స్ వాపోతున్నారు.

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో సరైన నియంత్రణ లేకపోవడంవల్ల పాఠశాలల యాజమన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాజమాన్య ప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో కలిసి కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజుల విషయంలో ఈ కమిటీ నిర్ణయం తీసుకోవాలి. అలాంటిది ఏ ఒక్క పాఠశాలలో అమలు కావడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల విషయంలో ఒక్కసారి కూడా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తల్లిదండ్రులతో మార్చి వరకు కమిటీని ఏర్పాటు చేసి ఏప్రిల్‌లో ఫీజులు నిర్ణయించాలి. ఈ నిబంధనలను పట్టించుకునే వారే లేరు. 

https://www.youtube.com/watch?v=YNhWAOSalg8