డబ్బులు డిమాండ్ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి : ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు

డబ్బులు డిమాండ్ చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి : ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు
  • ప్రైవేట్​ విద్యాసంస్థల యజమానులు

హనుమకొండ, వెలుగు : ప్రైవేట్ విద్యాసంస్థలను టార్గెట్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ప్రైవేట్​విద్యాసంస్థల యజమానులు ప్రభుత్వాన్ని కోరాయి. హనుమకొండ కుమార్ పల్లిలోని డీజీ స్మైల్ స్కూల్ సిబ్బందిపై పీడీఎస్ యూ నేతల దాడిని ఖండిస్తూ గురువారం ట్రస్మా, వడుప్పా తదితర సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని కేజీ టు పీజీ ప్రైవేటు విద్యాసంస్థల బంద్ పాటించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాల ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. 

రోడ్డుపై బైఠాయించి విద్యార్థి సంఘాల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు మాట్లాడుతూ డీజీ స్మైల్ స్కూల్ యాజమాన్యంపై దాడికి పాల్పడిన పీడీఎస్​యూ విద్యార్థి సంఘం నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ఆర్టీఐ నేతలమని చెప్పుకుంటూ కొంతమంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. దీంతో విద్యాసంస్థలు భయభ్రాంతులకు గురవుతున్నాయని తెలిపారు. 

ఇద్దరు పీడీఎస్ యూ నేతల అరెస్ట్.. 

మహాసభల కోసం చందాలు వసూలు చేసేందుకు వెళ్లి కుమార్ పల్లిలోని డీజీ స్మైల్ స్కూల్ కరెస్పాండెంట్ పై దాడికి పాల్పడిన పీడీఎస్ యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్, సెక్రటరీ మహేశ్ ను అరెస్ట్ చేసినట్లు హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్ తెలిపారు. డబ్బులు ఇవ్వాలని విద్యాసంస్థ యాజమానులను బెదిరించడంతోపాటు కరస్పాండెంట్ పై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారని చెప్పారు. ఈ మేరకు ఇద్దరిని అరెస్ట్​ చేసి రిమాండ్ కు తరలించినట్లు  సీఐ తెలిపారు.