ప్రైవేట్ దోపిడి.. రెండు నెలల చదువులకు ఏడాది ఫీజు

ప్రైవేట్ దోపిడి.. రెండు నెలల చదువులకు ఏడాది ఫీజు
  • శానిటైజేషన్స్ తో స్పెషల్ దోపిడి
  • వసూళ్లపై పేరేంట్స్ దోపిడి
  • ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో పట్టించుకోని సర్కార్

హైదరాబాద్, వెలుగు: చెప్పేది రెండు నెలల చదువులే. కానీ, ఫీజు మాత్రం ఏడాదిదంతా కట్టాల్నట. అదీ ఒక్కసారే చెల్లించాల్నట. కట్టకపోతే పిల్లలను పై క్లాసులకు పంపరట.. ఇదీ పేరెంట్స్​కు  ప్రైవేటు, కార్పొరేట్​ స్కూళ్ల హుకుం. పైగా అన్ని పుస్తకాలు, కొత్త యూనిఫామ్​ కొనాల్సిందేనని, స్పెషల్​గా శానిటైజేషన్​ ఫీజూ చెల్లించాలని సతాయిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి  స్కూళ్లలో 6, 7, 8 తరగతులను ఓపెన్​ చేసుకోవచ్చని అంతకు ఒక్కరోజు ముందు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అదునుగా ప్రైవేటు, కార్పొరేట్​ స్కూళ్లు రెచ్చిపోతున్నాయి. పేరెంట్స్​ నుంచి ముక్కుపిండి ఫీజులు గుంజుతున్నాయి. పిల్లలను గవర్నమెంట్​ స్కూళ్లలో చేర్పిస్తాం, టీసీలు ఇవ్వండి అని అడిగినా.. 12 నెలల ఫీజు కట్టాల్సిందేనని చెప్తున్నాయి. స్కూళ్ల ఓపెన్​కు పర్మిషన్​ ఇచ్చిన సర్కారు.. ఫీజులు ఎంత చెల్లించాలన్న దానిపై ఎందుకు ప్రకటన చేయడం లేదని పేరెంట్స్​ ప్రశ్నిస్తున్నారు. మేనేజ్మెంట్ల వసూళ్ల దందా కోసమే సడెన్​గా స్కూళ్లు తెరిపించారా? అని నిలదీస్తున్నారు. కరోనా వల్ల పనులు లేక తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు పూర్తి ఫీజులు ఎక్కడి నుంచి కట్టాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆన్​లైన్​ క్లాసులు చెప్పని బడులు కూడా..

అసలు ఆన్​లైన్ పాఠాలు చెప్పని బడులు కూడా ఇప్పుడు ఏడాది ఫీజు కోసం వేధిస్తున్నాయి. కరోనా కారణంగా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకూ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించిన సర్కార్.. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి 9,10 తరగతుల్లో స్కూళ్లలో ఫిజికల్​ క్లాసులు షురూ చేసింది. అయితే మిగిలిన క్లాసులను ఇప్పట్లో  స్టార్ట్ చేయబోమని చెప్తూ వచ్చిన ప్రభుత్వ పెద్దలు.. సడన్​గా 6,7,8 క్లాసులకూ ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 9,612 ప్రైవేటు స్కూళ్లలోనూ క్లాసులకు అనుమతించినట్లయింది. సర్కారు నుంచి ప్రకటన రావడమే ఆలస్యం పేరెంట్స్​కు స్కూల్​​ మేనేజ్మెంట్లు ఫోన్లు చేస్తున్నాయి. పిల్లలను బడులకు పంపించాలని, ఏడాది ఫీజులు చెల్లించాలని చెప్తున్నాయి. కేవలం మార్చి, ఏప్రిల్​నెలల్లోనే క్లాసులు ఉండటంతో, కొంతైనా ఫీజులు తగ్గించాలని పేరెంట్స్ కోరినా పట్టించుకోవడం లేదు.

బడులకు రావాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావద్దంటూ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేసిన ప్రకటనను ప్రైవేటు, కార్పొరేట్​  స్కూల్స్​ మేనేజ్మెంట్లు తుంగలో తొక్కాయి. ఆన్​లైన్  క్లాస్​లకు సంబంధించిన లింక్​లనూ చాలా స్కూల్​ మేనేజ్మెంట్లు తొలగించాయి. ఇక ఆన్​లైన్ పాఠాలు ఉండబోవని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని మేనేజ్మెంట్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటూ రెండు రోజులుగా ఆన్​లైన్​ క్లాసులు చెప్పడం లేదు. ఆన్​లైన్​ క్లాస్​లను బంద్​ పెడితేనే పిల్లలు స్కూల్స్​కు వస్తారని భావించే ఇలా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

పై తరగతులకు పంపరట

ప్రైవేటు స్కూళ్లలో 7.57 లక్షల మంది 6,7,8 తరగతులు చదువుతుండగా.. మరో 4.8 లక్షల మంది 9,10 క్లాసులు చదువుతున్నారు. చాలా స్కూళ్లు ఆన్​లైన్​ క్లాసులను కేవలం 8, 9, 10 తరగతులకే  నిర్వహించాయి. అదీ రోజుకు రెండు, మూడు క్లాసులే. ఆన్​లైన్ క్లాసుల సమయంలో ఫీజుల కోసం ఒత్తిడి చేయడంతో, చాలామంది పిల్లలు ఆ క్లాస్​లకు అటెండ్​ కాలేదు. ప్రస్తుతం స్కూళ్లలో ఫిజికల్ క్లాసులు మొదలవడంతో బడులకు పిల్లలను పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఫీజులు తీసుకురావాలని మేనేజ్మెంట్లు ఒత్తిడి తెస్తున్నాయి. బడులకు రాకుంటే, వచ్చే ఏడాది పైతరగతులకు పంపించబోమని బెదిరిస్తున్నాయి. సర్కారు బడుల్లో జాయిన్ చేసేందుకు మేనేజ్మెంట్లను టీసీ ఇవ్వాలని అడిగినా, మొత్తం ఫీజు కడితేనే ఇస్తామని చెప్తున్నాయి.

మొత్తం పుస్తకాలు, కొత్త యూనిఫామ్​ కంపల్సరీ అట

ఫీజులతోపాటు మొత్తం కొత్త పుస్తకాలు, స్కూల్ డ్రెస్​ కూడా కొనాలని మేనేజ్మెంట్లు ఆదేశాలిస్తున్నాయి. రెండు నెలల చదువుల కోసం మొత్తం పుస్తకాలేందని, కొత్త యూనిఫామ్​ ఎందుకని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నా.. కొనసాగాల్సిందేనని హుకుం జారీచేస్తున్నాయి. అది కూడా తమ స్కూల్​లోనే కొనాలని చెప్తున్నాయి.

శానిటైజేషన్​ పేరిట స్పెషల్​ దోపిడీ

కరోనా వల్ల స్కూళ్లను శానిటైజ్​ చేయించాల్సి వస్తోందని, దీని ఖర్చును కూడా పేరెంట్సే భరించాలి అంటూ స్కూల్​ మేనేజ్మెంట్లు పట్టుబడుతున్నాయి. శానిటైజేషన్​, మెయింటెనెన్స్​అంటూ ఒక్కో స్టూడెంట్​ నుంచి స్కూళ్ల వారీగా రూ. 5 వేలు మొదలు రూ. 10 వేల దాకా వసూలు చేస్తున్నాయి.

సర్కార్ గప్​చుప్​

రాబోయే రెండు నెలల చదువులకు ఎంత ఫీజు కట్టాలనే దానిపై ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం  లేదు. స్కూల్​ఎడ్యుకేషన్​అధికారులూ నోరుమెదపడం లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతోనే ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.  నెలవారీగానే ట్యూషన్​ ఫీజులు తీసుకోవాలని ఆన్​లైన్​ క్లాసులు స్టార్టయిన కొత్తలో సర్కారు ఆదేశాలిచ్చింది. అయితే.. వాటిని స్కూల్​ మేనేజ్మెంట్లు  పక్కనపడేశాయి. మొత్తం ఫీజులు చెల్లించాలంటున్నాయి. వీటి భారం  13 లక్షల కుటుంబాలపై పడుతోంది. ఫీజు వసూళ్లపై పేరెంట్స్ నుంచి ఫిర్యాదులు వస్తున్నా  ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పక్కనున్న ఏపీలో డిసెంబర్​లోనే స్కూల్స్​ఓపెన్ అయ్యాయి. అక్కడి ప్రభుత్వం ఫీజులో రాయితీ ప్రకటించింది.

ప్రభుత్వమే ఆదేశించాలంటున్న ఆఫీసర్లు

‘‘నెలవారీ ఫీజులు మాత్రమే తీసుకోవాలని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీని ప్రకారం పిల్లలు బడులకు వస్తున్న మార్చి, ఏప్రిల్​ నెలలకు సంబంధించిన ఫీజులే మేనేజ్మెంట్లు తీసుకోవాలి. ఏడాది ఫీజులు ఒకేసారి ఎలా వసూలు చేస్తారు? ఇలా చేయడం సర్కారు నిబంధనలకు విరుద్ధం…” అని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన ఇవ్వాలని కోరితే మాత్రం.. అది సర్కారు పరిధిలోని అంశం అంటూ దాటవేశారు.

టీచర్లకు క్లాసుల లెక్క జీతం!

స్టూడెంట్స్​ నుంచి ఏడాది ఫీజు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్​ స్కూల్​​ మేనేజ్మెంట్లు.. తమ దగ్గర పనిచేసే టీచర్లకు మాత్రం అరకొర జీతాలే ఇస్తున్నాయి.  లాక్ డౌన్​కు  ముందు వరకు ఫుల్ టైమ్ టీచర్లుగా ఉన్నవారు ఇప్పుడు అవర్లీ బేస్డ్ టీచింగ్ చేయాల్సి వస్తోంది. కరోనా టైంలో టీచర్లు నానా కష్టాలు పడ్డా కనీసం సాయం చేయని మేనేజ్మెంట్లు.. ప్రస్తుతం స్కూళ్లు ఓపెన్​ కావడంతో కొందరినే జాబ్​లోకి తీసుకున్నాయి. రోజుకు ఒకటి, రెండు క్లాసులు చెప్పేలా వారితో మాట్లాడుకుంటున్నాయి. ఇలా క్లాస్​ను  బట్టి రూ. 200 నుంచి 300  ఇస్తున్నాయి.

కంప్లైంట్​ చేసినా చర్యల్లేవ్​

6, 7, 8 తరగతులను ఉన్నఫళంగా ఓపెన్​ చేయడంతో ప్రైవేటు మేనేజ్మెంట్లకు ప్రభుత్వం అధికారికంగా వసూళ్ల దందా కోసం అనుమతి ఇచ్చినట్లయింది. రెండు నెలల చదువులకు మొత్తం ఫీజులు వసూలు చేయడం దారుణం. ఇలాంటి స్కూళ్లపై మంత్రికి, విద్యాశాఖ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. సీఎం కేసీఆర్  స్పందించాలి.

– వెంకట్, హైదరాబాద్​ స్కూల్స్​​ పేరెంట్స్​ అసోసియేషన్​ సెక్రటరీ

పైతరగతులకు అనుమతి ఇవ్వరట

హైదరాబాద్​ అమీర్​పేటలోని ప్రైవేటు స్కూల్​లో మా బాబు ఏడో తరగతి చదువుతున్నడు. ఏడాది ఫీజు రూ. 61,500 ఉంది. ఇప్పటికే రూ. 15వేల వరకూ కట్టినం. మిగిలిన ఫీజు కూడా కట్టాలని ఫోన్లు, మెసేజ్​లు చేస్తున్నరు. ఫీజు కట్టకపోతే నెక్ట్స్  క్లాసుకు ప్రమోషన్ ఇవ్వబోమని చెప్తున్నరు.

– బీవీకే కిషోర్, పేరెంట్, హైదరాబాద్

ఆన్లైన్ క్లాసులు లేవంటున్నరు

హైదరాబాద్​ మౌలాలిలోని ఓ ప్రైవేటు స్కూల్​లో మా బాబు టెన్త్ క్లాసు చదువుతున్నడు. ఈ ఏడాది రూ. 24 వేలు ఫీజు ఉంది. ఇప్పటికీ రూ. 4 వేలు కట్టినం. మిగిలిన ఫీజు కూడా కట్టాలని చెప్తున్నరు. ఇప్పటివరకు ఆన్​లైన్ క్లాసులు జరిగేవి. ప్రస్తుతం అవి బంద్ చేసి,  ఫిజికల్ క్లాసులకు రావాలని చెప్తున్నరు. కరోనా టైమ్ లో ఎలా పంపించాలని చెప్పినా, వినకుండా ఆన్ లైన్​ క్లాసులు బంద్​ చేసిన్రు. దీంతో చేసేదేమీ లేక బడికి పంపుతున్న. కానీ ఫీజు తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న.

– వినోద్ కుమార్, పేరెంట్ హైదరాబాద్

ఆన్​లైన్​ క్లాసులు బంద్ చేస్తమంటున్నరు

హబ్సిగూడలోని ఓ ప్రైవేటు స్కూల్​లో నా కూతురు ఏడో తరగతి చదువుతోంది. ఏడాదికి రూ. 40 వేలు ఫీజు ఉంది. ఇప్పటివరకు ఆన్​లైన్​లోనే క్లాసులు కొనసాగాయి. అప్పు చేసి, మా బాబు, పాప ఫీజు మొత్తం 96 వేలు కట్టిన. ప్రస్తుతం ఫిజికల్ క్లాసులు స్టార్టయినయ్​. బడికి రావాలని చెప్తున్నరు. కరోనా నేపథ్యంలో పిల్లలను బడికి పంపించబోమని చెప్పినం. దీంతో ఆన్​లైన్ క్లాసులు బంద్ చేస్తమని అన్నరు. మళ్లీ బడికి పంపితే శానిటైజేషన్, మెయింటెనెన్స్ అంటూ వసూలు చేసే అవకాశముంది. కాబట్టి ఆన్ లైన్​ క్లాసులు కొనసాగించేలా చూడాలి.

– మనోజ్ కుమార్, పేరెంట్ హైదరాబాద్

మొత్తం ఫీజుఎట్ల కడుతం

గాజుల రామారం లోని  ప్రైవేట్  స్కూల్​లో మా కూతురు చదువుతోంది. ఫిజికల్ క్లాసులు స్టార్టయ్యాక మొత్తం ఫీజు చెల్లించాలని మేనేజ్మెంట్ అడుగుతోంది. సగం రోజులు కూడా స్కూల్ నడవలేదు.. ఎందుకు మొత్తం ఫీజు కట్టాలంటే సమాధానం చెప్పడం లేదు. ఫీజు కట్టకపోతే ఆన్​లైన్ క్లాసులు కూడా బంద్​ చేస్తున్నరు. వాళ్లపై చర్యలు తీసుకోవాలె.

– ధనలక్ష్మి, పేరెంట్ నల్గొండ జిల్లా

వేరే దిక్కులేదు

లాక్ డౌన్ కంటే ముందు నేను ఫుల్ టైం టీచర్ గా మా ఇంటి దగ్గర్లోని ప్రైవేట్ స్కూల్​లో  వర్క్ చేసేదాన్ని.  6 నుంచి టెన్త్​ క్లాస్ లకు బయాలజీ చెప్తుంటాను. ఆరేండ్లుగా ఈ ఫీల్డ్​లో ఉన్నాను. ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయ్యాక ఓ ప్రైవేట్​ స్కూల్ లో అవర్లీ బేసిస్ లో టీచర్​గా జాయిన్ అయ్యాను. ఆ స్కూల్​కు  రెండు, మూడు బ్రాంచ్ లున్నాయి. ఒకరోజు ఒక బ్రాంచ్​లో, ఇంకో రోజు మరో బ్రాంచ్ లో పాఠాలు చెప్పాలి. కానీ అన్నింటికీ కలిపి రోజుకు రెండు గంటల చొప్పునే లెక్క కట్టి ఇస్తారు. మాకు వేరే దిక్కులేదు. తప్పనిసరి పరిస్థితిలో ఇలా చేయాల్సి వస్తుంది. నాకు రోజుకు రూ.  200 నుంచి 300 అంటే.. నెలకు రూ. 6 వేల జీతం వస్తోంది.

–  కల్యాణి, బయాలజీ టీచర్,సాగర్ రింగ్ రోడ్, హైదరాబాద్​

ఫుల్​ జీతాలు ఇయ్యాలి

ప్రభుత్వం హయ్యర్​ క్లాసులకు పర్మిషన్  ఇచ్చినా.. 90 శాతం స్కూల్  మేనేజ్మెంట్లు టీచర్లను  ఉద్యోగాల్లోకి  తీసుకోవడం లేదు. కొంతమందిని తీసుకున్నా పూర్తి జీతాలు ఇవ్వడం లేదు. గత పదకొండు నెలలుగా కరోనా పేరు చెప్పి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెట్టాయి. కనీసం ఇప్పుడైనా అందరినీ విధుల్లోకి తీసుకుని పూర్తి జీతాలు చెల్లిస్తారని టీచర్లు ఆశించారు. కానీ మేనేజ్మెంట్లు అవర్లీ బేస్డ్ , 30 శాతం లేదా 50 శాతం మాత్రమే జీతాలు చెల్లిస్తామని చెప్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం జీవో నంబర్ 45ను అమలు చేసి టీచర్లకు  ప్రతి నెలా ఫుల్​ జీతాలు అందేలా చూడాలి.

– బయ్యా శివరాజ్ , ప్రైవేట్ టీచర్స్ ఫోరమ్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు