రోడ్లపై స్టార్టప్ సీఈవో అసహనం.. బెంగళూరు నుంచి ఆఫీస్ మార్పు

రోడ్లపై స్టార్టప్ సీఈవో అసహనం.. బెంగళూరు నుంచి ఆఫీస్ మార్పు

ఆన్‌లైన్ ట్రక్కింగ్ స్టార్టప్ ప్లాట్‌ఫాం బ్లాక్‌బక్ సీఈవో రాజేష్ యాబాజీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో ఓఆర్ఆర్, బెల్లందూర్ ప్రాంతంలోని తమ ఆఫీసు స్టార్ట్ చేసి 9 ఏళ్లు అయ్యిందని చెప్పారు. కానీ ప్రస్తుతం బెంగళూరులో ఉన్న దారుణమైన రోడ్లు, తీవ్రమైన ట్రాఫిక్స్ సమస్యలతో ప్రయాణం నరకంగా అలాగే ప్రమాదకరంగా మారిందని చెప్పారు. అందుకే తమ ఆఫీసును బెంగళూరు నుంచి మార్చేస్తున్నట్లు రాజేష్ వెల్లడించారు. 

ఉద్యోగులు ఆఫీసులకు రావటానికి సగటున  గంటరన్నరకు పైగా టైం పడుతోందని చెప్పారు. రోడ్లు పాత్ హోల్స్, రాళ్లు తేలిన రోడ్లు ప్రయాణాలకు ఇబ్బంది కలిగిస్తున్నాయని తెలిపారు. అయితే కర్ణాటక ప్రభుత్వం అద్వానంగా ఉన్న రోడ్లపై దృష్టి పెట్టి రిపేర్ చేయడంలో ఆసక్తి చూపలేదని.. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ పరిస్థితి మారేలా లేదని స్టార్టప్ సీఈవో అన్నారు. 

ORR బెంగళూరుకు అత్యంత బిజీ IT కారిడార్. ఇక్కడ 45 శాతం ట్రాఫిక్ పెరుగుదలతో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. ఈ సమస్యలకు ప్రభుత్వ దృష్టి తక్కువగా ఉండటం కంపెనీల యాజమాన్యాలను నిరుత్సాహ పరుస్తోంది.

అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారాలోకేష్ బ్లాక్‌బక్ సంస్థను విశాఖపట్నానికి రావాలని ఆహ్వానించారు. విశాఖ దేశంలో టాప్ 5  శుభ్రమైన నగరాలలో పేరు పొందిందని లోకేష్ చెప్పారు. ఉత్తమ మౌలిక వసతులు నిర్మాణం జరుగుతోందని.. మహిళల కోసం సురక్షిత నగరాల్లో ఒకటిగా విశాఖ ఉందని చెప్పారు. 

కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్ రోడ్ల మరమత్తుల కోసం రూ.1,100 కోట్ల నిధులను ప్రకటించారు. రోడ్లపై ఉన్న పాత్ హోల్స్ తొలగించాలని, ప్రజలతో సంప్రదింపులు జరగాలని, ట్రాఫిక్ పోలీసులు కూడా పని చేయాలని సూచనలు చేశారు. అయినప్పటికీ ORR ప్రాంతం పరిస్థితి మారలేదు. దీంతో ప్రముఖ IT సంస్థలు తమ కార్యాలయాలను గతిలేక వేరే ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నాయి.