ప్రైవేట్ టీచర్లకు టార్గెట్: పిల్లలను చేర్పించాలె.. లేదంటే కొలువు కట్

ప్రైవేట్ టీచర్లకు టార్గెట్: పిల్లలను చేర్పించాలె.. లేదంటే కొలువు కట్

స్కూళ్లకు ఎండా కాలం సెలవులొచ్చాయి. పిల్లలంతా మస్త్​ ఖుష్ అవుతారు. నెలంతా ఆటపాటలతోఎంజాయ్ చేస్తారు. మరి, ఆ పిల్లలకు పాఠాలు చెప్పిన టీచర్ల మాటేంటి? వాళ్లకూ ఎండా కాలం సెలవులిస్తారా? ప్రభుత్వ బడులు ఓకేగానీ, ప్రైవేటు, కార్పొరేట్​ స్కూళ్లు మాత్రం ఆ సెలవుల్లోనూ పనిచేయించుకుంటున్నాయి. పిల్లలకు పాఠాలు చెప్పించడం కాదు..స్కూలు గురించి ప్రచారం చేయించడమే పని. నిబంధనలకు విరుద్ధంగా ఇల్లిల్లూ తిరుగుతూ పిల్లలను వారిస్కూల్లో చేర్పించేలా చూడడం వారి బాధ్యత. పెట్టిన టార్గెట్​ను చేరుకుంటే సరి.. లేదంటే ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ కొన్ని ప్రైవేటు స్కూళ్లు టీచర్లను బెదిరిస్తున్నాయి. దీంతో చేసేదిలేక టీచర్లు స్కూల్ ప్రచారంలో భాగం అవుతున్నారు.

ఏప్రిల్ 12 నుంచి మే31 వరకు ఇప్పటికే అన్ని స్కూళ్లకు సెలవులిచ్చారు. దీంతో ప్రైవేటు టీచర్లంతా బడిబాట వదిలి విద్యార్థుల ఇళ్లబాట పడుతున్నారు. టెన్త్​ విద్యార్థులు బయటకు వెళ్లిపోవడం, ఏటా ఒక్కో తరగతి వాళ్లు ప్రమోట్​ అవడం వల్ల ఒక క్లాస్ తరిగిపోతుంటుంది. ఇంకొంతమంది తమ పిల్లలను వేరే స్కూల్లో చేర్పించేందుకు టీసీ తీసుకుని వెళ్లిపోతుంటారు. దాని వల్ల స్కూలును బట్టి సగటున 50 నుంచి 200 మంది పిల్లల వరకు ఖాళీలు ఏర్పడుతుంటాయి. ఆ ఖాళీలను టీచర్లతోనే భర్తీ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాయి స్కూల్ యాజమాన్యాలు. ఇప్పటికే స్కూల్ టీచర్లతో ప్రచారం జోరందుకుంది.

స్కూళ్ల రీఓపెనింగ్ కు ఇంకా 40 రోజులదాకా టైం ఉండడంతో ప్రైవేట్​, కార్పొరేట్​ స్కూళ్లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాష్ట్రంలోని సగానికిపైగా స్కూళ్లు అదే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో స్కూల్ ఒక్కో రకమైన టార్గెట్​ పెట్టింది. ఒకటీచర్ కనీసం ఐదుగురి నుంచి 20 మంది పిల్లల దాకా చేర్పించాలన్న నిబంధన పెట్టాయి . లేదంటే జీతంలో కోత పడుతుందని హెచ్చరించాయి. దీంతో పిల్లలను చేర్పించలేకపోతే పరిస్థితేంటని టీచర్లు ఆందోళనచెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల్లో ఈ తంతు జోరుగాసాగుతోంది. విద్యాశాఖ అధికారులకు తెలిసినా మిన్నకుండి పోతున్నారన్న విమర్శలూ వస్తున్నాయి.

ఉపాధ్యాయ వృత్తిని యాచక వృత్తిగామారుస్తూ, ప్రైవేటు యాజమాన్యాలు టీచర్ల విలువను దిగజారుస్తున్నాయి. ఎర్రటిఎండల్లో టీచర్లను వీధులు, ఇల్లిల్లూ తిప్పుతూ అడ్మిషన్ల టార్గెట్ పెడుతున్నాయి. దీంతో టీచర్లు మానసిక వేదనకు గురవుతున్నారు. వారికేమైనా అయితే యాజమాన్యాలే బాధ్యతవహించాలి. టీచర్ల సమస్యలుపరిష్కరించాలని ఇటీవల విద్యాశాఖమంత్రితో పాటు ఉన్నతాధికారులనూకలిశాం. 12 నెలల జీతంతో పాటు అందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.
– షేక్ షబ్బీర్​ అలీ, ప్రైవేటు టీచర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు