
మన దగ్గర ప్రైవేటు రైళ్లు
ఐదు నడిపేందుకు రైల్వే బోర్డు అనుమతి!
సికింద్రాబాద్ నుంచి 3 ట్రైన్స్
విజయవాడ, తిరుపతి నుంచి ఒక్కో రైలు
పట్టాలు, స్టేషన్లు, సిగ్నలింగ్ మినహా అంతా ప్రైవేటే..
ట్రైన్ లేట్ అయితే కంపెనీలకు ప్రభుత్వం పెనాల్టీ
వ్యతిరేకిస్తున్న రైల్వే కార్మికులు
హైదరాబాద్, వెలుగు:
ప్రైవేటు రైళ్లు రాబోతున్నాయి. త్వరలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలుగు రాష్ర్టాల్లో నడవనున్నాయి. తొలి విడతలో ఐదు రైళ్లు నడపనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి మూడు, విజయవాడ, తిరుపతి నుంచి ఒక్కో రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
అన్నీ ప్రైవేటోళ్లే చేస్తరు
దేశంలో తొలి ప్రైవేట్ ప్లేయర్- ఆపరేటెడ్ ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ రైలును ఢిల్లీ–లక్నో రూట్‌లో అక్టోబర్ ఫస్ట్‌వీక్‌లో నడపనున్నారు. దీన్ని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రారంభించనుంది. దేశంలో 150 రైళ్లకు పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వేలో పరిధిలో 5 రైళ్లు నడిపేందుకు ప్రైవేట్‌కు అనుమతి ఇచ్చారని తెలిసింది. అయిత మన దగ్గర వచ్చే ఐదు రైళ్లు ఏ రూట్లో వెళ్తాయనేది ఇంకా ఖరారు కాలేదు. ఇవి ఎంత మేర సక్సెస్ అవుతాయో పరీక్షించాక, మరికొన్ని రైళ్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది. పట్టాలు, స్టేషన్లు, సిగ్నలింగ్ మినహా అన్నీ ప్రైవేట్ వాళ్లే చేపట్టనున్నారు. రైల్‌లో పనిచేసే స్టాఫ్, లోకోపైలట్, టీసీలను… అందరినీ ప్రైవేట్ వాళ్లే నియమించుకుని నడిపించనున్నారు. రైల్వేకు ఎలాంటి సంబంధం ఉండదు. టికెట్ ధరల నిర్ణయం కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్లకే ఉంటుంది.
ఆధునిక సదుపాయాలు
రైల్వేలో ఇప్పుడున్న టికెట్ ధరలతో పోలిస్తే ప్రైవేట్ ట్రైన్స్‌లో డబుల్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రైళ్లు కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్లే తెచ్చుకుంటారని తెలిసింది. ట్రైన్‌లో ఆధునిక సదుపాయాలు ఉండనున్నాయి. వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కల్పించనున్నారు. టాయిలెట్స్, సీట్లు.. తదితర అన్ని మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ప్రైవేట్ రైళ్లు టైం టు టైం నడవనున్నాయి. ఆలస్యమయ్యే చాన్స్ ఉండదు. ఎందుకంటే ఆలస్యమైన సమయాన్ని బట్టి నష్టపరిహారం చెల్లించే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం.
సర్కార్ రైలు క్రాసింగ్‌లకే!
ప్రైవేట్ రైళ్లకు అనుమతి ఇవ్వడంలో భాగంగా ఆశ్చర్యకరమైన ఒప్పందం కూడా చేసుకున్నట్లు తెలిసింది. ప్రైవేట్ రైలు సమయానికి గమ్యం చేరుకోకుంటే ప్రభుత్వం సదరు కంపెనీకి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఐదు గంటల సమయం ఉంటే, వివిధ కారణాలతో ఆరు లేదా ఏడు గంటలు అయితే.. ఆలస్యమైనందుకు ప్రభుత్వం పెనాల్టీ చెల్లించాలి. ఇలా జరగకుండా ఉండటానికి రైల్వే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనుంది. ప్రైవేట్ రైలు వచ్చే సమయంలో దానికి ఇబ్బంది లేకుండా ఉండటానికి మిగతా రైళ్లను క్రాసింగ్‌లో పెట్టనుంది. ఫలితంగా ఇతర ట్రైన్స్‌కు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. రైళ్లను ప్రైవేట్‌పరం చేయడంపై రైల్వే కార్మికులు మండిపడుతున్నారు. సమ్మెలోకి వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నారు.
ప్రాణాలకు తెగించైనా అడ్డుకుంటం
రైల్వేను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా 150 రైళ్ల ను ప్రైవేటుకు అప్పగించేందుకు ఇటీవల అనుమతిచ్చారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నాం. ప్రైవేట్‌కు అప్పగిడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ప్రైవేట్ రైలొస్తే.. సర్కార్ రైలుకు ఇబ్బందులు వస్తాయి. దీనికి వ్యతిరేకంగా ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పోరాడాలి. ప్రాణాలు తెగించి అయినా ప్రైవేట్ రైళ్లను అడ్డుకుంటాం. ‑ శివగోపాల్ మిశ్రా, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆలిండియా రైల్వే మెన్ ఫెడరేషన్