- లైన్మెన్ల స్థానంలో ప్రైవేట్ వ్యక్తులతో పనులు
- ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న కార్మికులు
- పట్టించుకోని ఉన్నతాధికారులు
వనపర్తి, వెలుగు : విద్యుత్‌శాఖలోని ప్రైవేట్కార్మికులు కష్టాలను ఎదుర్కొంటున్నారు. విద్యుత్ కు అంతరాయం ఏర్పడినప్పుడు సమస్యను పరిష్కరించాల్సిన లైన్మెన్లు స్పందించడం లేదు. సీనియర్లైన్మెన్లు స్తంభం ఎక్కడాన్ని నామోషీగా భావిస్తున్నారు. లైన్మెన్లు, జూనియర్ లైన్మెన్లు చేయాల్సిన పనులను ప్రైవేట్ కార్మికులతో చేయిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో అవగాహన లేని ప్రైవేట్ కార్మికులు ప్రమాదాల బారినపడి తీవ్రంగా గాయపడుతున్నారు. కొందరు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి.
స్పాట్ బిల్లింగ్తోనూ పనులు..
కొందరు లైన్మెన్లు, ఇతర సిబ్బంది ప్రతి నెలా ఇంటింటికీ తిరిగి స్పాట్ బిల్లింగ్ చేసే యువకులను తమ పనుల కోసం వినియోగించుకుంటున్నారు. విద్యుత్ సమస్య తలెత్తినా, కొత్తగా విద్యుత్ మీటర్లు బిగించాల్సి వచ్చినా వారితో పని చేయిస్తున్నారు. ఏదైనా విద్యుత్ రిపేర్లు చేయాల్సి వచ్చినప్పుడు ఏఈకి సమస్య తెలియజేసి లైన్ క్లియర్(ఎల్సీ) తీసుకోవాలి.
కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు. లైన్మెన్, ప్రైవేట్‌వ్యక్తులు స్థానిక అధికారులతో మాట్లాడి ఎల్సీ తీసుకుంటున్నారు. తీరా పనులు చేసే సమయంలో విద్యుత్ సప్లై కావడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇలా లైన్మెన్, కింది స్థాయి సిబ్బంది, ప్రైవేట్‌వ్యక్తులు.. స్పాట్ బిల్లింగ్ చేసే యువకులతో పని చేపిస్తున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.
వనపర్తి జిల్లాలో జరిగిన ఘటనలు.
ఈనెల మొదటి వారంలో కొత్తకోట మండలం పాలెం గ్రామంలో లైన్మెన్ ఓ యువకుడితో విలేజ్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయడానికి నియమించుకున్నాడు. పని చేస్తుండగా విద్యుత్సప్లై కావడంతో షాక్‌కు గురై యువకుడి కాళ్లు, చేతులు కాలాయి.
పాన్గల్లో సెప్టెంబర్ 30న ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు.
గతేడాది గోపాల్పేట మండలంలో స్పాట్బిల్లర్గా పనిచేసే యువకుడిని లైన్మెన్ బుద్దారం 11కేవీ సబ్ స్టేషన్ బ్రేక్ డౌన్ రెక్టిఫై చేయమని చెప్పాడు. ఎల్సీ తీసుకుని స్తంభం పైకి ఎక్కి పనిచేస్తుండగా, విద్యుత్‌సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకోవద్దని చెప్పాం..
పాలెం సంఘటనలో గాయపడ్డ యువకునికి ట్రీట్మెంట్ నడుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తులతో విద్యుత్ రిపేరు పనులు చేయించవద్దని విద్యుత్ శాఖ సిబ్బందికి స్పష్టంగా చెప్పాం. ఏ రిపేరైనా విద్యుత్‌శాఖ సిబ్బంది మాత్రమే చేయాలి. ప్రైవేట్ వారితో చేయించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాస్, డీఈ, ట్రాన్స్‌కో, వనపర్తి
