దేశంలో ప్రైవేటు స్కూళ్లు ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత సులభతరం, వేగవంతం చేసే దిశగా అన్ని నిబంధనలను సవరించాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. కొత్తగా ప్రైవేటు స్కూలు ఏర్పాటు చేయాలని భావించేవారు సమర్పించాల్సిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల (ఎన్ఓసీ) విషయంలోనూ నీతి ఆయోగ్ పలు సూచనలు చేసింది.
స్కూలును ప్రారంభించే సంస్థ పోలీసు, మున్సిపల్, అగ్నిమాపక, ఆర్అండ్‌బి, ఇతరత్రా విభాగాల నుంచి ఎన్ఓసీ సర్టిఫికెట్లను సమర్పించిన తర్వాత అనుమతులిచ్చే పద్ధతికి స్వస్తి పలకాలని, అనవసర నిబంధనలు, అనవసర సర్టిఫికెట్లను తొలగించాలని నీతి ఆయోగ్ సూచనలు చేసింది. ఇందుకు బదులుగా ప్రైవేటు స్కూలు ప్రారంభమైన తర్వాత నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? విద్యా బోధనా ప్రమాణాలను అనుసరిస్తున్నారా? అనేది ప్రత్యక్ష పరిశీలనలతో తెలుసుకోవాలని నిర్దేశించారు.
ప్రస్తుతం మనదేశంలో మొత్తం 14.72 లక్షల స్కూళ్లు ఉన్నాయి. వీటిలో ప్రైవేటు స్కూళ్లు 23 శాతంగా ఉన్నాయి. రాబోయే కొన్నేళ్లలో ప్రైవేటు స్కూళ్ల సంఖ్య వీలైనంత పెరిగేలా అన్ని రాష్ట్రాల్లో అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని నీతి ఆయోగ్ నిర్ణయించింది. అయితే ప్రభుత్వ పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా ఇలా ప్రైవేటుకు విద్యారంగాన్ని ధారాదత్తం చేస్తే పేద ప్రజలకు విద్య దూరమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
విద్యారంగంలో అసమానతలు
2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని విద్యా విధానంలో మార్పులు చేయతలపెట్టింది. ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన ‘నీతి ఆయోగ్’ దేశ అభివృద్ధికి ప్రణాళికలు కాదు, వ్యూహాలు కావాలంటోంది. ఆ దిశలోనే మెరుగైన మౌలిక వసతులు, తక్కువ విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి, ఉపాధ్యాయులకు మెరుగైన వేతనాలు, మెరుగైన ఉపాధ్యాయ శిక్షణ ప్రమాణాల స్థాయిని పెంచలేవని నీతి ఆయోగ్ నిర్ధారిస్తుంది.
విద్యార్థి కచ్చితమైన వ్యక్తిగత స్థాయిని బట్టి సరైన బోధనా పద్ధతులు అవలంబిస్తే అభ్యసనా ఫలితాలు మెరుగవుతాయని నీతి ఆయోగ్ కార్యాచరణ సూచిస్తున్నది. అందులో భాగంగా విద్యాహక్కు చట్టాన్ని అభ్యసన హక్కు చట్టంగా మార్చడం, అభ్యసనా ఫలితాలను కొలిచే వ్యవస్థ రూపొందించాలని నీతి ఆయోగ్ తెలిపింది.
విద్యారంగంలో నెలకొన్న అసమానతలు, విద్య వ్యాపారం అవుతున్న తీరు, దానివల్ల విద్య సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్న తీరు సామాన్య ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, విద్యార్థులలో కనుమరుగవుతున్న సామాజిక చైతన్యం, ప్రశ్నించే తత్వం లాంటి సమస్యలను కావాలనే నీతి ఆయోగ్ స్పృశించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
వర్సిటీల ఏర్పాటుకు నిబంధనలను సడలించిన నీతి ఆయోగ్
1. ప్రభుత్వ విద్యారంగంలో లోపాలను ఎత్తిచూపి దానిని ప్రైవేటు రంగానికి బదలాయించడం.
2. ప్రభుత్వం విద్యారంగ బాధ్యత నుంచి తప్పించుకొని అక్రిడిటేషన్ సంస్థల ద్వారా, నేషనల్ అచీవ్మెంట్సర్వే , పాఠశాల విద్య నాణ్యత సూచిక లాంటి వాటి ద్వారా గ్రేడింగులు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టనున్నది. 3. గిట్టుబాటు కావడం లేదని కారణంతో స్వల్ప వ్యవధిలోనే వాటిని మూసివేయడం ద్వారా ఏడాదికి 50 వేల కోట్ల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. 4. రెండు, మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా కొన్ని వారాల శిక్షణ ఇచ్చి పెట్టుబడికి అవసరమయ్యే నైపుణ్యాలు ఉండే శ్రామిక వర్గాన్ని చౌకగా అందించవచ్చు. ఈ విషయం నీతి ఆయోగ్ కూడా బాహాటంగానే చెప్పింది. గత సంవత్సరం యూనివర్సిటీల ఏర్పాటుకు ఇదివరకు ఉన్న నిబంధనలను సడలిస్తూ కొత్తగా నిబంధనలను రూపొందించింది. కొత్తగా యూనివర్సిటీని స్థాపించేందుకు కనీసం 20 ఎకరాలు అవసరం. కనీసం 3,000 మంది విద్యార్థులు ఉండాలి.
స్థలాన్ని లీజుకు తీసుకోవాలంటే ఆ కాల వ్యవధి కనీసం 30 సంవత్సరాలు ఉండాలి. యూనివర్సిటీ స్థాపించే ప్రాంతం మెట్రోపాలిటన్ నగరం లేదా పర్వత ప్రాంతం అయితే పది ఎకరాల భూమి సరిపోతుంది. ఒకే యాజమాన్యం లేదా వేరే వేరే యాజమాన్యాలకు చెందిన విద్యాసంస్థలు దగ్గరగా ఉంటే క్రీడా మైదానం, గ్రంథాలయం తదితర వాటిని పరస్పరం వినియోగించుకోవచ్చు. ఆఫ్ క్యాంపస్ పెట్టాలనుకుంటే కనీసం ఐదు ఎకరాల విస్తీర్ణం అవసరం అనే అంశాలు ఆ సిఫార్సులలో ఉన్నాయి. ఈ సిఫార్సులు ద్వారా ప్రైవేట్ రంగంలో మరిన్ని విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. దీనివల్ల విద్య ఉన్నత విద్య అంగట్లో సరుకు అయ్యే ప్రమాదం ఉంది.
పెరుగుతున్న ప్రైవేటీకరణ
ప్రైవేట్ రంగంలోని యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలన్నీ విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేయడంతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకుండాపోయే ప్రమాదం ఉంది. కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులను తగ్గిస్తోంది. జాతీయ విద్యా విధానం- 2020 కూడా జీడీపీలో 6% నిధులు కేటాయించాలని సూచించినప్పటికీ తాజా బడ్జెట్లో 2.6% నిధులను మాత్రమే కేటాయించింది. ఫలితంగా ప్రభుత్వ విద్యాసంస్థలను పటిష్టం చేయలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి.
ఇప్పటికే దేశంలో 10 లక్షల మంది ఉపాధ్యాయుల కొరత ఉందని పార్లమెంటరీ కమిటీ నివేదిక తెలిపింది. అయినప్పటికీ ఉపాధ్యాయుల నియామకాన్ని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవడం లేదు. 10 లక్షల మంది కొత్త ఉపాధ్యాయులకు చెఊల్లించే వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధుల కేటాయింపులను తగ్గిస్తోంది. ఫలితంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యాసంస్థల పట్ల, ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. ఫలితంగా ప్రైవేటీకరణ పెరిగిపోతుంది. దీంతో పేదవర్గాలకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుంది.
- కె. వేణుగోపాల్,విద్యారంగ విశ్లేషకుడు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
