ఆస్పత్రిలో చేరిన ప్రియాంక గాంధీ

ఆస్పత్రిలో చేరిన ప్రియాంక గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య కారణాలతో చికిత్స తీసుకుంటున్నట్లు ఎక్స్ ద్వారా స్వయంగా వెల్లడించారామె. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న సమయంలో.. యాత్రలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు.. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరటం జరిగింది. ఆరోగ్యం బాగైన వెంటనే.. యాత్రలో పాల్గొంటానని స్పష్టం చేశారామె. న్యాయ యాత్రకు నా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని.. యూపీ ప్రజల ఆశీస్సులు ఉంటాయని.. యూపీ ప్రజల అండదండలతో యాత్ర విజయవంతంగా సాగుతుందని ఆకాక్షించారు ప్రియాంక గాంధీ.

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 16వ తేదీన యూపీలోని వారణాసిలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ప్రయాగ్ రాజ్, ప్రతాప్ గఢ్ మీదుగా ఫిబ్రవరి 19వ తేదీ అమేథీకి చేరుకుంటుంది. అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది పార్టీ. ఫిబ్రవరి 20వ తేదీన రాయ్ బరేలి చేరుకుంటుంది రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఆ నియోజకవర్గం ఎంపీగా సోనియాగాంధీ ఉన్నారు. 

యూపీలోకి రాహుల్ గాంధీ యాత్ర ప్రవేశించే సమయంలో ప్రియాంక గాంధీ స్వాగతం పలకాలని నిర్ణయించారు. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో జాయిన్ కావటంతో హాజరుకాలేదు. అనారోగ్యానికి కారణాలు ఏంటీ అనేది మాత్రం వెల్లడించలేదు. త్వరలోనే కోలుకుంటాను అని మాత్రం స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ.