నరేంద్ర మోదీవి పచ్చి అబద్ధాలు : ప్రియాంకా గాంధీ

నరేంద్ర మోదీవి పచ్చి అబద్ధాలు : ప్రియాంకా గాంధీ
  • కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆయన దుష్ప్రచారం చేస్తున్నరు: ప్రియాంక
  • ఆర్టికల్ 370, రామమందిరంపైనా అబద్ధాలు చెప్తున్నరని ఫైర్  
  • యూపీలోని రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ తరఫున ప్రచారం

రాయ్ బరేలీ: ప్రధాని నరేంద్ర మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఫైర్ అయ్యారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరానికి బాబ్రీ తాళం వేస్తుందని, జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తుందని మోదీ అంటున్నారు. కానీ అవి పచ్చి అబద్ధాలు. మేం కోర్టు తీర్పులను గౌరవిస్తాం. గతంలోనూ గౌరవించాం. భవిష్యత్తులోనూ గౌరవిస్తాం” అని చెప్పారు. గురువారం ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీకి మద్దతుగా నిర్వహించిన సభలో, మీడియాతో ప్రియాంక మాట్లాడారు.

 కాంగ్రెస్ అదానీ, అంబానీ జపం ఆపేసిందని, ఆ పార్టీకి ఏమైనా డబ్బులు అందాయా? అని మోదీ చేసిన కామెంట్లపైనా ఆమె స్పందించారు. రాహుల్ గాంధీ ప్రతిరోజూ తన స్పీచ్ లలో అదానీ, అంబానీ పేర్లను ప్రస్తావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై మోదీ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘‘ప్రధాని మోదీ ముందుగా కాంగ్రెస్ మేనిఫెస్టోను చదవాలి. ఆ తర్వాత కామెంట్ చేయాలి. కానీ మోదీ మా మేనిఫెస్టోను చదవకుండానే కామెంట్లు చేస్తున్నారు. అందులో లేనివి ఉన్నట్టుగా చెబుతున్నారు” అని విమర్శించారు. 

బీజేపీతో ఎంఐఎం కుమ్మక్కు.. 

ప్రజా సమస్యలను బీజేపీ పట్టించుకోవడం లేదని ప్రియాంక అన్నారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ మాట్లాడడం లేదంటూ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన కామెంట్లపై స్పందిస్తూ.. ‘‘ప్రజా సమస్యలపై మేం మాట్లాడడం లేదా? మేమే ప్రతిరోజూ ప్రజల కోసం మాట్లాడుతున్నాం. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాలను ప్రస్తావిస్తున్నాం. ప్రజా సమస్యలపై మాట్లాడనిది బీజేపీ నేతలే” అని ఆమె చెప్పారు. ‘‘ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీతో కలిసి పని చేస్తున్నారు. బీజేపీకి మేలు చేసేందుకే ఎంఐఎం క్యాండిడేట్లను పోటీలో నిలుపుతున్నారు. 

తెలంగాణలో చేసినట్టే ఇతర రాష్ట్రాల్లోనూ ప్లాన్  చేస్తున్నారు” అని అన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్, సిట్టింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ కొడుకు కరణ్ భూషణ్ సింగ్ కు టికెట్ ఇవ్వడంపై స్పందిస్తూ.. బీజేపీ మహిళలకు అండగా ఉండదన్న విషయం దీనితో తేలిపోయిందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై మహిళా రెజ్లర్లు ఆందోళనకు దిగితే బీజేపీ కనీసం మద్దతు ఇవ్వలేదని మండిపడ్డారు.