ప్రియాంక పాలిటిక్స్ పన్జేస్తయా?

ప్రియాంక పాలిటిక్స్ పన్జేస్తయా?

దేశాన్ని సుదీర్ఘ కాలం పాటు పాలించిన కాంగ్రెస్​ పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తన ఉనికిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. చివరికి ఉత్తరప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీలో ఉన్నానని నిరూపించుకునేందుకు ప్రయాస పడుతోంది. ఇందుకోసం గాంధీ ఫ్యామిలీ నుంచి ప్రియాంకా గాంధీ వాద్రాను రంగంలోకి దించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మార్పు నినాదంతో ప్రజల్లో కలిసిపోయేందుకు ప్రియాంకా చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అలాగే అన్ని వర్గాలకూ చేరువయ్యేందుకు వివిధ స్కీములను కూడా ప్రకటించారు. ఇప్పటికే యూపీలో నాలుగు విడతల పోలింగ్​ పూర్తయ్యింది. మరో మూడు ఫేజ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త తరహా రాజకీయం అంటూ ప్రియాంక చెపుతున్న మాటలు ఎంత వరకు యూపీ జనాల చెవికెక్కుతాయో చూడాలి.

కాంగ్రెస్​ జనరల్‌‌‌‌ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్‌‌‌‌కు శ్రీకారం చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్​లో తన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సుదీర్ఘ సిద్ధాంతాన్ని ఆమె అమలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో సరికొత్త రాజకీయాలకు అవకాశం కల్పిస్తున్నాయి. సామాన్యుల సమస్యలతోపాటు ఆరోగ్యం, విద్య, మహిళా భద్రత, విద్యుత్​ సరఫరా, యువతకు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై ఈ సందర్భంగా రాజకీయ వేదికలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షకులైన ప్రజలకు రాజకీయ పార్టీలు జవాబుదారీగా ఉండాలి. నాయకుల పనితీరు ఆధారంగా ప్రజలు ఓట్లు వేయాలి. ప్రజలు ఎన్నికల హామీల ఆధారంగా ఓట్లు వేస్తారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రజల్లోకి నాయకులొస్తే తమకు ఏం చేశారో నిలదీసి అడగాలి. 

భావోద్వేగ నినాదాలు

మూడు దశాబ్దాల నుంచి అంటే 1989 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి థర్డ్​ ఫ్రంట్​ పార్టీల రాజకీయ ఎజెండా కారణంగా సామాన్యులకు సంబంధించిన సమస్యలు మాయం అయిపోయాయి. విలువలు, ఐడియాలజీ, ప్రజా సమస్యల పరిష్కారంపై పోటీ పడాలి కానీ.. ఇతరులను అవమానించడం లేదా పనికిమాలిన విషయాలపై శ్రద్ధ వద్దని ప్రియాంకాగాంధీ వాద్రా ఎలక్షన్స్‌‌‌‌లో పోటీ చేస్తున్న పార్టీలను కోరుతున్నారు. థర్డ్​ ఫ్రంట్​లో దేనికీ కూడా నమ్మదగిన ఆర్థిక ప్రణాళిక, సామాజిక దూరదృష్టి, రాజకీయ లక్ష్యాలు లేవు. వారిలో చాలామందికి ఎన్నికల్లో గెలవడం, అధికారాన్ని అనుభవించడమే ఏకైక లక్ష్యం. రాజకీయాలు అక్కడే మొదలై, ముగుస్తాయని వారి ఉద్దేశం. 1990లో బీజేపీ సీనియర్​ లీడర్​ ఎల్‌‌‌‌కే అద్వానీ కమండల్​ కార్డుతో వస్తే.. వీపీ సింగ్​ మండల్‌‌‌‌ కార్డ్​తో ప్రయోజనం పొందాలని చూశారు. అదే ఆయన నేతృత్వంలోని నేషనల్‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌ ప్రభుత్వం కొనసాగడానికి ముప్పు తెచ్చింది. మండల్‌‌‌‌ కమిషన్‌‌‌‌ రిపోర్ట్​ను అమలు చేస్తామనే ప్రకటన చేయగానే.. అది ఆలోచించి తీసుకున్న విధానపరమైన నిర్ణయంగా కాకుండా స్వప్రయోజనాలతో కూడుకున్నదిగా అందరికీ కనిపించింది.

నిర్మాణాత్మక కార్యక్రమం

ప్రియాంక పవర్‌‌‌‌‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌ చేయకుండా రాజకీయాలు అంటే సేవ అనే గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఈ విధానం రాజకీయ ముఖచిత్రాన్నే మారుస్తుంది. తన రాజకీయ విధానానికి భిన్నంగా కాంగ్రెస్‌‌‌‌ నిలబడింది. అధికారాన్ని సాధించడమే లక్ష్యం కాదు, అది కేవలం కార్యాచరణ మాత్రమే. స్వాతంత్ర్య పోరాట కాలంలో ఒక నిర్మాణాత్మక కార్యక్రమాన్ని మాహాత్మా గాంధీ ప్రవేశపెట్టారు. పొలిటికల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌తో పాటు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మార్పు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని గాంధీజీ రూపొందించారు. తమ పొలిటికల్​ వర్క్​తోపాటు నిర్మాణాత్మక కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కాంగ్రెస్‌‌‌‌ మెన్​, విమెన్‌‌‌‌ నిమగ్నం కావాలని గాంధీజీ కోరుకున్నారు. ఈ నిర్మాణాత్మక కార్యక్రమంలో హిందూ–ముస్లిం ఐక్యత, అంటరానితనం నిర్మూలన, మద్యపాన నిషేధం, ఖాదీకి ప్రోత్సాహం, గ్రామ పరిశ్రమలు, పారిశుద్ధ్యం, మహిళా విద్య, సాధికారత, ప్రాథమిక విద్య లేదా నయీ తలీమ్​ వంటి విషయాలున్నాయి. గాంధీ చెప్పినదాన్ని బట్టి ప్రతి పొలిటికల్​ ఫిలాసఫీ నిర్మాణాత్మక కార్యక్రమాన్ని తప్పక కలిగి ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో తోడ్పడతాయి.

స్వాతంత్ర్యం, ఒక స్టార్టింగ్ పాయింట్

రాజకీయ, ఆర్థికాభివృద్ధి, సామాజిక, సాంస్కృతిక మార్పు, ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి స్వాతంత్ర్యం ఒక స్టార్టింగ్‌‌‌‌ పాయింట్ మాత్రమే అని కాంగ్రెస్​ గతంలోనే ప్రకటించింది. వాస్తవానికి ఈ నిర్మాణాత్మక కార్యక్రమం నిజాయితీ గల అహింసా విధానాల ద్వారా పూర్ణ స్వరాజ్యం లేదా పూర్తి స్వాతంత్ర్య నిర్మాణానికి పట్టం కట్టింది. 1975–77 మధ్య ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ 20 పాయింట్ల ప్రోగ్రామ్​తో ముందుకు వచ్చారు. ఇందులో భూ సంస్కరణలు, వెట్టిచాకిరీ నిర్మూలన, పేదలకు ఇండ్లు–స్థలాలు, గ్రామీణ రుణాల రద్దు, ఎస్సీ, ఎస్టీలకు సరైన న్యాయం, మహిళా సమానత, గౌరవం, విద్యాభివృద్ధి వంటి కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టారామె. వయోజన విద్య, వరకట్న నిషేధం, మొక్కలు నాటడం, ఫ్యామిలీ ప్లానింగ్, కుల వ్యవస్థ నిర్మూలన, వంటి వాటితో కూడిన 5 పాయింట్ల ప్రోగ్రామ్​తో సంజయ్​గాంధీ ముందుకు వచ్చారు. 2004–14 మధ్య కాలంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా నేషనల్​ అడ్వయిజరీ కౌన్సిల్(ఎన్ఏసీ)కు అధిపతిగా వ్యవహరించిన కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ సోనియాగాంధీ హక్కుల ఆధారిత సదుపాయాల ద్వారా గొప్ప విజయాలు సాధించారు. అవినీతిపై పోరాటానికి బలమైన పునాది వేసిన సమాచార హక్కు చట్టం, జాతీయ ఆహార భద్రత చట్టం ద్వారా ఆహారానికి హక్కు, ఎంఎన్ఆర్ఈజీఏ ద్వారా పనికి హక్కు, విద్యా హక్కు, ఆదివాసీ చట్టం, మాన్యువల్​ స్కావెంజర్స్​గా ఉపాధిని తొలగించే చట్టాన్ని ఆమోదించడం వంటివి ఆమె సాధించిన విజయాల్లో కొన్ని. అంతేకాక ఆమె సారథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్​ సౌకర్యం కల్పించడమే కాక పట్టణాల్లో ఉండే పేదవారిపై ప్రత్యేక దృష్టి పెట్టి 30 కోట్ల మందికిపైగా ప్రజలను దారిద్ర్య రేఖకు ఎగువకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ప్రియాంక మొదలుపెట్టిన ఈ బ్రాండ్​ న్యూ పాలిటిక్స్​ కుల ఆధారిత, మతతత్వ పార్టీల నిర్మూలనకు ఉత్ప్రేరకంగా పనిచేసి, రాజకీయ పార్టీలన్నీ ప్రజలకు జవాబుదారీగా ఉండేలా చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది.

జవాబుదారీతనంపై దృష్టి

పొలిటికల్​ పార్టీలను జవాబుదారీగా చేయడం అనేది కొత్త  కాన్సెప్ట్‌‌‌‌. పొలిటికల్‌‌‌‌  పార్టీల పనితీరును, వాస్తవానికి వారు ప్రజలకు ఏం చేశారో అనే దానిని ఇది వెలుగులోకి తెస్తుంది. చాలా థర్డ్​ ఫ్రంట్​ పార్టీలు ఓట్లు దండుకుని, అధికారంలోకి రావడానికి భావోద్వేగపూరిత నినాదాలు చేసేవే. అలానే ఈ పార్టీల లీడర్లు పనితీరు అనే విషయాన్నే పట్టించుకోరు. పనితీరుపై దృష్టి పెట్టడం ద్వారా కుల ఆధారిత పార్టీలు, మతతత్వ పార్టీల చరిష్మాను తగ్గించే అవకాశం ఉన్నందున ఇది కూడా మంచిదే. పనితీరులో వెనుకబడిన పార్టీ పోటీలో నిలబడటం కష్టం. సమాజ్​వాదీ వంటి పూర్తిగా కులం మీద ఆధారపడిన పార్టీ మంచి పనితీరు కనబర్చకుండానే బయటపడొచ్చు. కులం పేరు మీదే అఖిలేశ్​ యాదవ్‌‌‌‌ ఓట్లు అడుగుతున్నారు. అలాగే బీఎస్పీ మాయావతి కూడా కుల ప్రాతిపదికగానే ఓట్లు అడుగుతున్నారు. కుల, మత సమీకరణలు పక్కన పెడితే దళితులకు ఏం చేశారో మాయావతి చెప్పలేకపోతున్నారు. మాయావతి, అఖిలేశ్​ ఇద్దరూ కూడా నాలుగున్నర సంవత్సరాలు ప్రజల్లోనే లేరు. యూపీ ఎలక్షన్స్‌‌‌‌ రాగానే నిద్ర లేచారు. కులం, మతం కార్డులను ఎలా స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారో వీరిద్దరి టికెట్ల కేటాయింపును చూస్తే అర్థమవుతుంది. ఎన్నికల్లో గెలవడం ముఖ్యమే కానీ, గెలుపే ఏకైక లక్ష్యం కాకూడదనే విషయాన్ని ఈ పార్టీలు గ్రహించడం లేదు.

- పర్సా వెంకట్, పొలిటికల్ ఎనలిస్ట్