వారణాసిలో ప్రియాంక నిలబడితే మోదీ ఓడిపోయేవారు : రాహుల్ గాంధీ

వారణాసిలో ప్రియాంక నిలబడితే మోదీ ఓడిపోయేవారు : రాహుల్ గాంధీ
  • రాయ్ బరేలీ ‘కృతజ్ఞతా సభ’లో రాహుల్ గాంధీ  
  • సామాన్యులను విస్మరించినందుకే బీజేపీని అయోధ్యలో ఓడించిన్రు
  • ఇండియా కూటమి కలిసికట్టుగా పనిచేసిందని  కామెంట్ 

రాయ్ బరేలీ: యూపీలోని వారణాసిలో ప్రియాంక గాంధీ పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఓటమి తప్పేదికాదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘బీజేపీ అయోధ్యలో ఓడిపోయింది. నా చెల్లి వారణాసిలో పోటీ చేసి ఉంటే.. అక్కడ కూడా ఆ పార్టీ రెండు లేదా మూడు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయేది” అని ఆయన చెప్పారు. యూపీలోని అమేథీ, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలకు, పార్టీ క్యాడర్ కు థ్యాంక్స్ చెబుతూ మంగళవారం రాయ్ బరేలీలో తన చెల్లి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ ‘కృతజ్ఞతా సభ’ను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని గెలిపించిన అమేథీ, రాయ్ బరేలీ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నేతలు, సభ్యులందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. పార్లమెంట్​లో ఎన్డీయే బలాన్ని తగ్గించడం కోసం అమేథీ, రాయ్ బరేలీ, యూపీతోపాటు దేశవ్యాప్తంగా ఇండియా కూటమి కలిసికట్టుగా పోరాడింది. యూపీలో సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ నేతలతో కలిసి గట్టిగా పోరాడారు” అని రాహుల్ అన్నారు. ‘‘గతంలోనూ ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ అలయెన్స్ గా పోటీ చేసింది. కానీ ప్రతిసారీ ఆయా పార్టీల మధ్య కోఆపరేషన్ ఉండేది కాదు.

కానీ ఈసారి దేశవ్యాప్తంగా కూటమిలోని పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడాయి. ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ ముప్పుగా మారిందని గుర్తించినందుకే అందరూ కలిసికట్టుగా పనిచేశారు. రాజ్యాంగంతో మోదీ, అమిత్ షా ఆటలాడుకుంటున్నారని దేశం గ్రహించినందుకే ఈ విజయం దక్కింది. తొలిసారి భారత ప్రధాని ఒకరు విద్వేషం, హింసతో కూడిన రాజకీయాలు చేయడం మనం చూశాం. ఇది దేశ సంస్కృతికి, మతానికి వ్యతిరేకం” అని రాహుల్ అన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకల సందర్భంగా సామాన్య ప్రజలను మోదీ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఆ వేడుకల్లో టాప్ ఇండస్ట్రియలిస్టులు, ఇతర ప్రముఖులకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. అందుకే అయోధ్యలో బీజేపీని ఓడించడం ద్వారా ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పారన్నారు.

మోదీ కేబినెట్.. ఒక కుటుంబ కూటమి

కుటుంబ రాజకీయాలు అంటూ తరచూ విమర్శలు చేసే ప్రధాని మోదీ.. తన కేబినెట్​లో మాత్రం రాజకీయ కుటుంబాలకు చెందిన వాళ్లకే మంత్రి పదవులు కట్టబెట్టారని రాహుల్ గాంధీ విమర్శించారు. మోదీ 3.0 సర్కారు.. ఒక కుటుంబ కూటమిగా మారిపోయిందని ట్వీట్ చేశారు. ‘‘కొన్ని తరాల పాటు పోరాటాలు, సేవలు, త్యాగాలు చేసిన వాళ్లది బంధుప్రీతి అని విమర్శించేవాళ్లు.. వారి గవర్నమెంట్ ఫ్యామిలీకి మాత్రం అధికారం పంచుతున్నారు. మోదీ మాటలకు, చేతలకు పొంతన ఉండదనేందుకు ఇదే నిదర్శనం” అని విమర్శించారు.

ఇది చరిత్రాత్మక విజయం: ప్రియాంక

అమేథీ, రాయ్ బరేలీలో కాంగ్రెస్​కు ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రాయ్ బరేలీలో జరిగిన కృతజ్ఞతా సభలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇది కదా అసలు విషయం. ఇది చరిత్రాత్మక విజయం. క్లీన్ పాలిటిక్స్​ను కోరుకుంటున్నామని దేశానికి చాటిచెప్పినందు కు గర్వపడుతున్నా. ఈ రిజల్ట్ కోసమే మేం రాత్రీపగలూ కష్టపడ్డాం. నా అన్నను గెలిపించినందుకు రాయ్ బరేలీ ప్రజలకు, కిశోరీ లాల్ శర్మను గెలిపించినందుకు అమేథీ ప్రజలకు ధన్యవాదాలు. మీరు మా పట్ల చూపిన ఉత్సాహానికి రెట్టింపుగా మీకోసం మేం కష్టపడి పనిచేస్తాం” అని ప్రియాంక చెప్పారు.